Homeఆంధ్రప్రదేశ్ఆర్టీజీఎస్‌ డేటానే ప్రామాణికం

ఆర్టీజీఎస్‌ డేటానే ప్రామాణికం

- Advertisement -

. సైబర్‌ నేరాలు, సాంకేతికతపై ప్రజలకు అవగాహన కల్పించాలి
. ట్రాఫిక్‌ నిబంధనలపై ముందు హెచ్చరికలు, తర్వాత పెనాల్టీలు
. ముఖ్యమంత్రి చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ఆర్టీజీఎస్‌ డేటానే అన్ని శాఖలకు ప్రామాణికంగా ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. టెక్నాలజీ పరంగా జరుగుతున్న మార్పులను అమలు చేయాల్సిన అంశాలను ఆయా శాఖల్లో వివరించేందుకు ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించే విధంగా ఆలోచన చేయాలని సూచించారు. అలాగే నేరాలు జరిగాక కట్టడి చేయడమే కాదు… జరగకుండా చూసుకోవాలి. ప్రమాదాలు జరిగాక స్పందించడం కాకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులకు మార్గనిర్దేశనం చేశారు. ఆర్టీజీఎస్‌ పని తీరుపై సోమవారం రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. వాట్సాప్‌ గవర్నెన్స్‌, డేటా లేక్‌, డేటా అనుసంధానం వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా అనుమానితులను గుర్తించే ఫేషియల్‌ రికగ్నేషన్‌ వ్యవస్థ పని తీరు మీద అధికారులు డెమో ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘నేరగాళ్ల భరతం పట్టేందుకు టెక్నాలజీని వినియోగించుకోవడం మంచిదే. అయితే నేరం జరిగిన తర్వాత వారిని ట్రేస్‌ చేసి… ఆ తర్వాత వారికి శిక్షలు పడేలా చేయడంతో పాటు అసలు నేరాలు జరగకుండానే చూడాలి. ముందుగానే అనుమానితులను గుర్తించాలి. వారి కదలికలను ట్రేస్‌ చేయాలి. వారు ఏ తరహా నేరాలకు పాల్పడ్డారనే అంశాన్ని కూడా డేటా బేస్‌లో పెట్టుకోవాలి. వారి కదిలికలను గుర్తించి అప్రమత్తమైతే చాలా వరకు నేరాలను కట్టడి చేయవచ్చు. రౌడీ షీటర్లు, క్రిమినల్స్‌కు వారి వారి నేరాలను బట్టి డేటాలో కలర్‌ కోడిరగ్‌ ఇవ్వాలి. అలాగే కొన్ని ప్రమాదాలను ముందుగా గుర్తించగలిగితే… వాటిని ముందుగానే నివారించవచ్చు. ఈ మేరకు ఆర్టీజీఎస్‌ పని తీరు మెరుగుపడాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని సీసీ కెమెరాలను అనుసంధానం చేయాలి. ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ట్రాఫిక్‌ రద్దీ వంటిది జరగ్గకుండా చూడాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారికి వెంటనే చలానాలు విధించకుండా సిగ్నల్‌ జంప్‌ చేస్తున్న వాహనాల ఫొటోలను ముందుగా వారికి పంపాలి. అలా రెండు మూడుసార్లు చూసి… వారిలో మార్పు రాకుంటే అప్పుడు చలానాలు విధించాలి. సైబర్‌ నేరాలు, సాంకేతిక వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం అన్నారు. ‘ఓర్వకల్లులో డ్రోన్‌ సిటీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. డ్రోన్‌ సిటీకి ప్రముఖ కంపెనీలు… బహుళ జాతి సంస్థలు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. డ్రోన్‌ సిటీలో ప్రభుత్వం ఇచ్చే వసతులను… డ్రోన్‌ సిటీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించండి. డ్రోన్‌ సిటీలో పెట్టుబడులు పెట్టేలా డిఫెన్స్‌ కంపెనీలను ఒప్పించగలిగితే ఎక్కువ పెట్టుబుడులు వస్తాయి. అధికారులు ఆ దిశగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది’ అని సీఎం వివరించారు. ఈ సమావేశంలో సీఎస్‌ విజయానంద్‌ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు