పహల్గాం దాడి తరవాత మోదీ సర్కారు చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై ప్రతిపక్షాలు ఎన్ని ప్రశ్నలు అడిగినా ఇంతవరకు సరైన, సమగ్రమైన సమాధానాలు రానే లేదు. పార్లమెంటు ఉభయ సభల్లో సోమవారం, మంగళవారం చర్చ జరిగింది. పహల్గాం దాడి తరవాత పరిస్థితిని చర్చించడానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలన్న ప్రతిపక్షాల విజ్ఞప్తిని మోదీ సర్కారు ఏ మాత్రం పట్టించుకోలేదు. ప్రత్యేక సమావేశాలకు బదులు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఏర్పాటు చేసింది. ఆపరేషన్ సిందూర్‌పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చర్చ ప్రారంభించారు. ఆయన కూడా అసలు ప్రశ్నలకు సమాధానం చెప్పనేలేదు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాత్రం రక్షణ మంత్రి చెప్పిన కొన్ని మాటలను ఖండిరచారు. ఇది ప్రభుత్వంలోని అంతర్వైరుధ్యాలను బహిర్గతం చేస్తోంది. మంగళవారం సాయంత్రం ప్రధానమంత్రి మోదీ ఈ చర్చకు సుదీర్ఘమైన సమాధానం ఇచ్చారు. అందులోనూ పాత పాటే పాడారు. ఆపరేషన్ సిందూర్ గురించి సమాచారం ఏదైనా బయటకు వచ్చిందంటే అది మన త్రివిధ దళాల సైన్యాధిపతి నుంచి, ఇతర ఉన్నత సైనికాధికారుల నుంచే. లేదా మరో దేశంలోని దౌత్య కార్యాలయంలో భారత సైనిక ప్రతినిధిగా ఉన్న వ్యక్తి నుంచే. రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, ప్రధానమంత్రి ప్రసంగాలు ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలను సమాధానాలు లేకుండానే మిగిల్చారు. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య మూడు రోజులపాటు జరిగిన ఘర్షణను తానే నిలిపి వేయించానని అమెరికా అధ్యక్షుడు ఇప్పటికి 29 సార్లు అదే పనిగా చెప్తున్నా దానికి మాత్రం మోదీ సర్కారు ఎలాంటి సమాధానమూ ఇవ్వలేదు. ఆపరేషన్ సిందూర్ క్రమంలో మనది పైచేయిగా ఉన్న సమయంలో కాల్పుల విరమణ ఎందుకు ప్రకటించవలసి వచ్చింది అన్న ప్రశ్నకూ సమాధానం లేదు. మోదీ సమాధానం నిండా అప్రస్తుతంగానే పండిత్ నెహ్రూ మీద దాడితోనే సరిపోయింది. పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని మోదీ పదే పదే ప్రకటించారు. కానీ రాజకీయ నాయకత్వం నుంచి సరైన దిశా నిర్దేశం లేనందువల్ల మూడు రోజులపాటు కొనసాగిన ఆపరేషన్ సిందూర్‌లో మొదటి రెండు రోజులు మనం తప్పటడుగులు వేశామని సైనికాధికారులు వెల్లడిరచిన మాటకు కూడా ప్రధాన మంత్రి నుంచి ఏ సమాధానమూ లేదు. ఈ వ్యవహారంపై పార్లమెంటులో చర్చ జరుగుతున్న సమయంలోనే మోదీ సర్కారు ఆపరేషన్ మహదేవ్ అన్న కొత్త అస్త్రాన్ని బయటకు తీసింది. ఏప్రిల్ 22న పహల్గాం దాడి జరిగితే దాడి చేసిన వారెవరో తమకు తెలుసునని మోదీ సర్కారు అనేక సార్లు చెప్పింది. గత 90 రోజుల కాలంలో ఆ దుండగుల జాడ కనిపెట్టనే లేదు. కానీ హఠాత్తుగా ఆ దాడికి బాధ్యులని వాదిస్తూ ముగ్గురిని అంతమొందించారు. పార్లమెంటులో జరుగుతున్న చర్చ చాలా వాడిగా వేడిగా ఉన్నందువల్లే వీరిని హతమార్చి మోదీ సర్కారు పరువు నిలుపుకునే ప్రయత్నం చేసిందనిపిస్తోంది. నక్సలైట్ల ఎన్‌కౌంటర్లు సరిగ్గా ఇదే పద్ధతిలో జరగడం అర్ధశతాబ్దం పై నుంచి చూస్తూనే ఉన్నాం. ఆపరేషన్ సిందూర్ సమయంలో మోదీ ప్రభుత్వం చేసిందల్లా కేవలం పాకిస్థాన్ లోని తొమ్మిది తీవ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడమే. నిజానికి రక్షణ విభాగం ధ్వంసం చేయదగిన స్థావరాలు 21 ఉన్నాయని గుర్తించిందట. మరి మిగతా వాటిని ఎందుకు ధ్వంసం చేయలేక పోయారో అంతుబట్టదు. ఈ విషయాన్ని పార్లమెంటు చర్చలో భాగంగా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న వారెవరూ కనీసం ప్రస్తావించలేదు. ఆపరేషన్ సిందూర్ క్రమంలో కాల్పుల విరమణ జరిగినా ఆ కార్యక్రమం ఇంకా పూర్తి కాలేదని, అది కొనసాగుతూనే ఉంటుందని మంగళవారం మోదీ ప్రసంగంలోనూ నొక్కి చెప్పారు. అంటే పాకిస్థాన్‌లోని తీవ్రవాద స్థావరాలను సంపూర్ణంగా ధ్వంసం చేయలేకపోయారనుకోవాలి. తీవ్రవాదులను ప్రోత్సహించడం ద్వారా పాకిస్థాన్ మన మీద పరోక్ష యుద్ధం కొనసాగిస్తోంది. తీవ్రవాద స్థావరాలను పూర్తిగా నిర్మూలించకపోతే ఆ బెడద మరెప్పుడైనా తలెత్తవచ్చు. అందుకే మోదీ ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుంది అని అనేక సార్లు చెప్తున్నారనుకోవాలి. తీవ్రవాదులను మట్టి కరిపిస్తామని, వారికి మద్దతిచ్చే వారికీ అదే గతి పడ్తుందని మోదీ పునరుద్ఘాటించారు. పహల్గాం దుర్ఘటన తరవాత మనం ఇంత భారీ స్థాయిలో చర్య తీసుకుంటామని పాకిస్థాన్ ఊహించలేదని మోదీ అన్నారు. ఈ మాట రుజువు కావాల్సింది భవిష్యత్తులోనే. తమ దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయన్న పాకిస్థాన్ మాటను మనం ఖాతరు చేయలేదని మోదీ అన్నారు. అణ్వస్త్రాలు మన దగ్గరా ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తరవాత అణ్వస్త్రాలు అనేక దేశాలు తయారు చేశాయి. అనేక యుద్ధాలు జరిగాయి. ఏ యుద్ధంలోనూ ఏ దేశమూ అణ్వస్త్రాలు ప్రయోగించలేదు. ఇందుకు పాకిస్థాన్ కూడా మినహాయింపు కాదు. అణ్వస్త్ర ప్రయోగం ఆత్మహత్యా సదృశమని పాకిస్థాన్‌కే కాదు అణ్వస్త్రాలున్న అన్ని దేశాలకూ తెలుసు.
పార్లమెంటులో మోదీ ఇచ్చిన సమాధానం దేశ ప్రజల అనుమానాలను తీర్చనే లేదు. కానీ కాంగ్రెస్ మీద కసి తీర్చుకోవడానికి, ఆరు దశాబ్దాల కింద మరణించిన నెహ్రూ మీద దుమ్మెత్తి పోయడానికి మాత్రమే మోదీ ప్రయత్నించారు. మోదీ ఆత్మకు ఇంపైన మేక్ ఇన్ ఇండియా గురించి పదే పదే ప్రస్తావిస్తూ ఉంటారు. ఆ విధానం వల్లే ఇప్పుడు ఆపరేషన్ సిందూర్‌లో విజయవంతం అయ్యామని చెప్తున్నారు. మూడు దేశాలు తప్ప అన్ని దేశాలు ఆపరేషన్ సిందూర్‌ను సమర్థించాయని మోదీ చెప్తున్న మాట పచ్చి అబద్ధం. నిజానికి ఆత్మ రక్షణకు మనకు ఉన్న అవకాశాన్ని అనేక దేశాలు గుర్తించి ఉండవచ్చు. కానీ మనకు అండగా నిలిచిన దేశం ఒకటి కూడా లేదు. ఇటీవల జరిగిన రెండు అంతర్జాతీయ సమావేశాలలో విడుదల చేయవలసిన సంయుక్త ప్రకటనలు పాకిస్థాన్‌ను పేరు పెట్టి విమర్శించడానికి అంగీకరించక పోవడమే అన్న వాస్తవాన్ని మోదీ వాటంగా కప్పి పుచ్చారు. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు పాకిస్థాన్ పాటపాడ్తాయి అని మోదీ చేసిన ఆరోపణ పచ్చి అబద్ధం. పాకిస్థాన్‌తో జరిగిన మొదటి మూడు యుద్ధాలూ కాంగ్రెస్ అధికారంలో ఉండగానే జరిగాయి. వాజపేయి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన కార్గిల్ యుద్ధం మినహాయిస్తే మోదీ చెప్తున్న సర్జికల్ స్ట్రైక్, బాలాకోట్, ఆపరేషన్ సిందూర్ పరిమిత లక్ష్యంతో పాకిస్థాన్ మీద చేసిన దాడులే. కానీ పాకిస్థాన్ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ అనునిత్యం పరోక్ష యుద్ధానికి పాల్పడుతూనే ఉంది. మనం ఆపరేషన్ సిందూర్ వ్యవహారంలో నిమగ్నమై ఉన్నప్పుడు కూడా పాకిస్థాన్ జమ్మూలో దాడులకు దిగింది. ఈ వాస్తవాన్నీ మోదీ దాచేశారు. పాకిస్థాన్‌కు చైనా సరఫరా చేస్తున్న ఆయుధాల గురించి మోదీ ఒక్క మాట కూడా చెప్పలేదు. తమ యుద్ధం సిందూరం నుంచి సింధు దాకా అని మోదీ అన్నారు. సింధు జలాల ఒప్పందాన్ని ప్రస్తుతానికి నిలిపి ఉంచారు. ఆ ఒప్పందాన్ని రద్దు చేసే దమ్ము మోదీకి ఉందా? ఎదురు దాడిని, ప్రతిపక్షాల మీద దాడి చేయడమే లక్ష్యంగా మోదీ ప్రసంగం సాగింది. ఆ ప్రసంగాన్ని నింపాదిగా విశ్లేషిస్తే తప్ప అందులో ఎన్ని అసత్యాలుఉన్నాయో బయట పడవు.
ఎదురు దాడితో సరిపెట్టిన మోదీ
- Advertisement -


