బ్లాక్ మార్కెట్‌లో విక్రయాలు
. బస్తాకు రూ.300 అదనపు వసూళ్లు
. పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న ఏపీ కోటా
. దుకాణాల్లో దొరక్క రైతుల ఇక్కట్లు
. మిగులు ఉన్నట్లు అధికారుల బుకాయింపు
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: రాష్ట్రంలో ఎరువుల ధరల మోత మోగుతోంది. ఏపీ కోటా పక్క రాష్ట్రాలకు, ఇతర అవసరాలకు మళ్లుతుండటంతో బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నాయి. మార్కెట్‌లో ఎరువుల డిమాండ్‌ను, రైతుల అవసరాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటూ అధిక లాభాలు గడిస్తున్నారు. బస్తాకు రూ.100 నుంచి రూ.300 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. మార్కెట్‌లో ఎరువులు దొరకడం లేదని, అధిక ధరలకు కొనాల్సి వస్తుందని రైతులు చెబుతుండగా…రాష్ట్రంలో యూరియా, డీఏపీ ఎరువులు సమృద్ధిగా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు బుకాయిస్తూ ప్రకటనలు చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే ఈ గందరగోళానికి కారణం వ్యవసాయ యూరియా పెద్దమొత్తంలో దారిమళ్లుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ఐదేళ్లతో పోలిస్తే ఈ ఏడాది ఎరువుల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుత ఖరీఫ్‌లో జులై ఆఖరు నాటికి యూరియా అమ్మకాలు గతేడాది కంటే 91 వేల టన్నులు పెరిగింది. అయినప్పటికీ ఎరువుల కోసం దుకాణాల ముందు రైతులు పడిగాపులు పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. యూరియాను వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తుండటంతో పాటు ఇతర ప్రాంతాలకు తరలింపు వంటి కారణాల వల్ల మార్కెట్‌లో ఎరువుల కొరత ఏర్పడిరది. ఎరువులు పక్క రాష్ట్రాలకు తరలిపోవడం, వ్యవసాయేతర పరిశ్రమలకు, ఉత్పత్తుల తయారీకి యూరియా మళ్లిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. అయితే పంటల సాగు పెరిగి యూరియాకు డిమాండ్ వచ్చిందని, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రాలకు కేటాయించిన యూరియాను వ్యవసాయేతర అవసరాలకు మళ్లించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది. యూరియాను పెయింట్లు, వార్నిష్, ఫ్లైవుడ్, సారా, బీరు, పాల ఉత్పత్తి, కోళ్ల దాణా, చేపలు, రొయ్యలకు ఉత్ప్రేరకంగా వాడుతున్నట్లు కేంద్రం గమనించినట్లు సమాచారం. దీంతోపాటు ఏపీ నుంచి పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటక, తెలంగాణ, ఒడిశాకు యూరియా అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు జిల్లాల నుంచి కర్నాటకకు… చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల నుంచి తమిళనాడుకు… ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఒడిశాకు… కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల నుంచి తెలంగాణకు రవాణా జరుగుతున్నట్లు ఆరోపణలు వినబడుతున్నాయి. దీంతో యూరియా అధికంగా తెప్పిస్తున్న హోల్‌సేల్ వ్యాపారులు, ఎక్కువగా అమ్ముతున్న రిటైలర్లు, అత్యధికంగా కొనుగోలు చేస్తున్న వారి వివరాలను, గతేడాది కన్నా ఈ సీజన్‌లో ఎక్కువగా కొనుగోలు చేసిన వారి వివరాలను సేకరిస్తున్నట్టు తెలిసింది. పరిశ్రమలకు, ఇతర రాష్ట్రాలకు యూరియా తరలించకుండా, వ్యవసాయేతర పరిశ్రమల అవసరాలకు యూరియా వాడే వారిపై చర్యలు చేపట్టాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఆగస్టు మాసానికి లక్షా 65 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ప్రస్తుతం క్షేత్రస్థాయిలో 2 లక్షల 4 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని సీఎస్ విజయానంద్ చెబుతున్నారు. అదేవిధంగా డీఏపీ 70 వేల మెట్రిక్ టన్నులు అవసరం కాగా, ప్రస్తుతం 88 వేల 248 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని, కావున రైతులు ఎరువుల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎస్ స్పష్టం చేశారు. వ్యవసాయ యూరియాను పారిశ్రామిక అవసరాలకు, ఇతర అవసరాలకు దారి మళ్లించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌లను ఆదేశించారు. ఇందుకు సంబంధించి జిల్లా స్థాయిలో వ్యవసాయశాఖ అధికారులతో వెంటనే సమన్వయ సమావేశం నిర్వహించి రైతులకు పూర్తిస్థాయిలో ఎరువులు అందుబాటులో ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆకస్మిక తనిఖీలు చేపట్టి యూరియా దారి మళ్లకుండా చర్యలు చేపట్టాలని సీఎస్ సూచించారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాలను పకడ్బందీగా క్షేత్రస్థాయి అధికారులు అమలు చేస్తేనే ఎరువులు రైతులకు అందుతుందని భావిస్తున్నారు.


