Homeవిశ్లేషణఏఐ, జీపీఎస్‌తో జీవితం ఖాళీ

ఏఐ, జీపీఎస్‌తో జీవితం ఖాళీ

- Advertisement -

వంగవోలు రవి

సాంకేతికత మనిషి జీవితాన్ని అన్ని విధాలుగా సులభం చేసింది. ఒకప్పుడు గంటల సమయం పట్టే పనులు ఇప్పుడు నిమిషాల్లో పూర్తవుతున్నాయి. దూరప్రాంతాలకు వెళ్లేందుకు జీపీఎస్, లెక్కల కోసం కాలిక్యులేటర్, సమాచారం కోసం ఇంటర్నెట్… వీటన్నింటికీ తోడు ఏఐ రోజువారీ జీవితంలోకి వచ్చేసింది. సౌకర్యాలు పెరుగుతున్న కొద్దీ మనిషి స్వయంగా చేయాల్సిన పనులు, ఆలోచించాల్సిన అవసరం తగ్గిపోతుందా? అన్న ప్రశ్న ఇప్పుడు ఆలోచించాల్సిన అంశంగా మారింది. ఒక విద్యార్థికి క్లాస్రూమ్లో ఒక పేరా ఇచ్చి, దాన్ని చదివి సొంత మాటల్లో రాయమంటే కొంతసేపు ఆలోచిస్తాడు. మొదటి వాక్యం ఎలా ప్రారంభించాలో తడబడ తాడు. అదే ప్రశ్నను ఏఐ చాట్బాట్‌లో పెడితే క్షణాల్లో సమాధానం వచ్చేస్తుంది. అది పూర్తిగా అర్థమైందా లేదా అన్నది పక్కనపెట్టి, వచ్చిన సమాధానాన్ని అలాగే రాసేయడం చాలా సులువైపోయింది. ఒకప్పుడు కుటుంబసభ్యులు, స్నేహితుల ఫోన్ నంబర్లు చాలావరకు గుర్తుండేవి. ఇప్పుడు ఫోన్ చేతిలో లేకపోతే దగ్గరి వ్యక్తి నంబర్ కూడా గుర్తు రాని పరిస్థితి ఏర్పడుతోంది. తెలిసిన ప్రాంతంలో కొత్త చిరునామాకు వెళ్లాల్సి వస్తే జీపీఎస్ ఆన్ చేస్తాం. నాలుగు వస్తువులు కొంటే మొత్తం ఎంతవుతుందో చిన్న లెక్క కాలిక్యులేటర్‌లో చూసుకుంటాం. ఒక మెయిల్ రాయాలన్నా, ఒక విషయాన్ని నాలుగు వాక్యాల్లో చెప్పాలన్నా ఏఐ సాయం కోరడం మొదలైంది. ఇవన్నీ తప్పని చెప్పలేం. సాంకేతికత మనిషికి సమయాన్ని, శ్రమను ఆదా చేస్తోంది. అసలు ప్రశ్న సాంకేతికత మంచిదా చెడ్డదా అన్నది కాదు. దాన్ని మనం ఎంతవరకు ఉపయోగించాలి? ఎక్కడ మనమే ఆలోచించాలి? అన్నదే అసలు ప్రశ్న. మనిషి చాలా కాలంగా తన శారీరక శ్రమను యంత్రాలకు అప్పగిస్తూ వస్తున్నాడు. ఎద్దుల బండి స్థానంలో కారొచ్చింది. చేత్తో బట్టలు ఉతికే పనిని వాషింగ్ మెషీన్ తీసుకుంది. మెట్లెక్కే శ్రమను లిఫ్ట్ తగ్గించింది. జీపీఎస్ దారిని గుర్తుంచుకోవాల్సిన అవసరాన్ని తగ్గించింది. కాలిక్యులేటర్ లెక్కలు చేస్తోంది. ఇంటర్నెట్ మనం గుర్తు తెచ్చుకోవాల్సిన సమాచారాన్ని క్షణాల్లో అందిస్తోంది. ఏఐ సమాచారాన్ని వెతికి దాన్ని క్రమబద్దీకరించి ఇస్తోంది.
మెదడుకు ‘వాడకం’ అవసరమే : ఏఐ వినియోగంపై జరిగిన పరిశోధనల్లో, దానిపై ఎక్కువగా ఆధారపడేవారిలో స్వయంగా దారి గుర్తించే సామర్థ్యం కూడా తగ్గిపోతున్నట్లు గుర్తించారు. లండన్ టాకీస్‌ డ్రైవర్లపై జరిగిన పరిశోధనలు మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాయి. నగరంలోని అనేక మార్గాలను గుర్తుంచుకుని ప్రయాణించే డ్రైవర్ల మెదడులో జ్ఞాపకశక్తికి సంబంధించిన హిప్పోకాంపస్ ప్రాంతంలో కొన్ని నిర్మాణాత్మక తేడాలు గుర్తించారు. ఒక పనిని నిరంతరం చేయడం వల్ల దానికి సంబంధించిన మెదడు సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయని ఇది సూచిస్తుంది. ఏఐ విషయంలోనూ ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతున్నాయి. 2025లో మైక్రోసాఫ్ట్, కార్నెగీ మెలన్ యూనివర్సిటీ పరిశోధకులు 319 మంది ఉద్యోగులపై చేసిన అధ్యయనంలో, ఏఐపై ఎక్కువ నమ్మకం ఉన్న సందర్భాల్లో విమర్శనాత్మకంగా ఆలోచించేందుకు చేసే ప్రయత్నం తక్కువగా కనిపించినట్లు వెల్లడించారు. అంటే ఏఐ మనిషి ఆలోచించే సామర్థ్యాన్ని తప్పనిసరిగా తగ్గిస్తుంది అని కాదు. కానీ మనం ఆలోచించాల్సిన ప్రతి పనినీ యంత్రానికి అప్పగిస్తే, ఆలోచించే అలవాటు తగ్గిపోయే ప్రమాదం ఉంది.
పిల్లల విషయంలో జాగ్రత్త : పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ప్రశ్నకు వెంటనే సమాధానం దొరకడం సౌకర్యమే. కానీ సమాధానం కోసం కాసేపు ఆ ప్రశ్నతో పోరాడటం విద్యలో భాగం. ఒక లెక్క తప్పు చేసి మళ్లీ మళ్లీ చేయడం. ఒక పేరాను రెండుసార్లు చదివి అర్థం చేసుకోవడం, రాస్తున్నప్పుడు సరైన పదం కోసం వెతకడం, ఒక ప్రశ్నకు సొంతంగా సమాధానం ఊహించడం… ఇవన్నీ పిల్లలకు కష్టంగా అనిపించవచ్చు. సమయం కూడా పడుతుంది. కానీ ఆ ప్రయత్నంలోనే ఆలోచన, జ్ఞాపకశక్తి, సమస్య పరిష్కార సామర్థ్యం, భాషా నైపుణ్యం వంటి అనేక సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయి. పిల్లల ముందున్న ప్రతి చిన్న సమస్యను సాంకేతికతతో తొలగిస్తే వారి పని సులువవుతుంది. కానీ సమస్యను ఎదుర్కొని పరిష్కరించే ప్రక్రియలోనే నేర్చుకుంటున్నాం అనే విషయాన్ని గ్రహించడం లేదు. దీనికి పరిష్కారం సాంకేతికతను పూర్తిగా పక్కనపెట్టడం కాదు. మ్యాప్ చేతిలో ఉన్నప్పటికీ కావాలని దారి తప్పాల్సిన అవసరం లేదు. కాలిక్యులేటర్ ఉన్నప్పుడు ప్రతి లెక్కనూ కాగితంపై వేసు కోవాల్సిన అవసరం లేదు. ఏఐ చెప్పిన సమాచారం నిజమేనా అని పరిశీలించడం మన పని. అది ఇచ్చిన సమాధానంలో తప్పులున్నాయా అని చూడటం మన పని. ‘ఎందుకు?’ అని ప్రశ్నించడం మన పని. మరో కోణం ఉందేమో వెతకడం మన పని. చివరకు ఏది సరైనదో నిర్ణయించుకోవడం మన బాధ్యతే. సమాధానం యంత్రం నుంచి రావచ్చు. విచక్షణ మాత్రం మనదే. మనిషి తన శారీరక శ్రమను యంత్రాలకు అప్పగిస్తూ వచ్చాడు. దాని వల్లే ఎన్నో పనులు సులభమయ్యాయి. ఇప్పుడు మెదడు చేసే పనులను యంత్రానికి అప్పగించడం పురోగతిలో భాగమే. కానీ ఏ పని వరకు సాంకేతికత సాయం తీసుకోవాలి ? ఎక్కడ మన బుర్రకు పని చెప్పాలి ? అన్న గీతను మనమే గీయాలి. సాంకేతికత మనిషి సామర్థ్యాన్ని భర్తీ చేయడానికి కాదు, దాన్ని శక్తివంతం చేయడానికి ఉపయోగపడినప్పుడే దాని అసలు ప్రయోజనం నెరవేరుతుంది.
ఉపాధ్యాయుడు, సెల్ : 8555077824

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు