Homeవిశ్లేషణఒక ర్యాంప్ వాక్… ఎన్నో రాజకీయ ప్రశ్నలు

ఒక ర్యాంప్ వాక్… ఎన్నో రాజకీయ ప్రశ్నలు

- Advertisement -

మామిండ్ల రమేష్ రాజా

“అప్పుడు వీళ్లంతా నకస్లైట్లు… చీకటిని చీల్చే టార్Ìలైట్లు… ఇప్పుడు ర్యాంప్ వాక్ చేసే మోడళ్లు…అందరికీ అన్నం… ఆవాసం… నిండుబట్ట కావాలన్నోళ్లు… ఇప్పుడు మొండి బట్టలు ఏసుకున్న మోడల్స్‌…ఆపరేషన్ కగార్ చేసిన ఇచ్చంత్రాలు. రాజ్యం తల్చుకుంటే సింహాన్ని పిచ్చికుక్కను చేస్తుంది. మావోయి స్టులను ర్యాంప్ వాక్ చేయిస్తుంది .“సోషల్ మీడియాలో విస్తృతంగా తిరుగుతున్న ఈ పంక్తులు ఒక దృశ్యాన్ని మాత్రమే వ్యంగ్యంగా చూడటం లేదు. ఒక కాలం తనను తాను నిగ్గదీసుకుంటున్నది. ఒకప్పుడు రాజ్యాన్ని ప్రశ్నించిన, దండకారణ్య అడవుల్లో తుపాకులు పట్టిన మహిళలు ఇవాళ ప్రభుత్వ కార్యక్రమంలో ర్యాంప్‌పై నడవడం వ్యక్తిగత జీవిత మార్పుగా చూస్తే అది ఒక సాధారణ మానవ కథ. కానీ అదే దృశ్యాన్ని “మావోయిజంపై రాజ్యం సాధించిన విజయం”గా ప్రచారం చేసినప్పుడు అది రాజకీయ ప్రశ్నగా మారుతుంది. ఆగస్టు 7న రాయ్పూర్‌లో జరిగిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో బస్తర్‌కు చెందిన తొమ్మిది మంది మాజీ మహిళా మావోయిస్టులు ర్యాంప్‌పై నడిచారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన వార్తలు, వీడియోలు ఆగస్టు 13 నుంచి ప్రచారంలోకి వచ్చాయి. అధికారిక కథనం దీనిని పునరావాసం, నైపుణ్యాభివృద్ధి, ఆత్మవిశ్వాసం, ప్రధాన స్రవంతిలోకి పునరేకీకరణకు ప్రతీకగా చూపించింది. వార్తా కథనాల ప్రకారం, సుకాˆలోని పునరావాస కేంద్రం నుంచి వచ్చిన ఈ మహిళలకు ర్యాంప్ వాక్, గ్రూమింగ్, దుస్తుల ప్రదర్శన, మైక్‌పై మాట్లాడటం వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చి నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ అధికారిక కథనానికి భిన్నంగా ఆలస్యంగా కొన్ని ప్రశ్నలు, ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుట్టుమిషన్ లేదా ఉపాధి శిక్షణ కోసం తీసుకెళ్తున్నామని చెప్పి రాయ్పూర్‌కు తీసుకెళ్లారని, అక్కడికి వెళ్లిన తర్వాతే ర్యాంప్ వాక్ విషయం తెలిసిందని, ముందస్తు సమాచారం ఇవ్వలేదని, కార్యక్రమంలో పాల్గొనడానికి మొదట సంకోచించిన వారిపై ఒత్తిడి తెచ్చారని కొన్ని వర్గాలు ఆరోపించాయి. అవి నిజమా కాదా అనే దానిపై స్వతంత్ర విచారణ జరగాలనే ప్రశ్న సముచితమే. ఇక్కడ అసలు ప్రశ్న ర్యాంప్ వాక్ మంచిదా చెడ్డదా అనేది కాదు. ఒక వ్యక్తికి తన ఇష్టాన్ని నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉందా అనేదే కీలకం. ఒక మాజీ మావోయిస్టు మహిళ స్వచ్ఛందంగా చేనేత దుస్తులు ధరించి ర్యాంప్‌పై నడవాలనుకుంటే తప్పేమీ లేదు. కానీ కుట్టుమిషన్ శిక్షణ పేరుతో తీసుకెళ్లి, రాజకీయంగా ప్రతీకాత్మకమైన ఒక కార్యక్రమంలో పాల్గొనాలని ఒత్తిడి చేస్తే, అది పునరావాసం ప్రశ్నను దాటి వ్యక్తి స్వేచ్ఛ, సమ్మతి, గౌరవం ప్రశ్నగా మారుతుంది. అప్పుడు ర్యాంప్‌పై నడుస్తున్నది కేవలం ఒక మహిళ కాదు. ఆమె శరీరాన్ని ఒక రాజకీయ సందేశానికి వేదికగా ఉపయోగిస్తున్నారా అనే ప్రశ్న వస్తుంది. మాజీ మావోయిస్టు మహిళ కొత్త జీవితం ఎంచుకోవడాన్ని ఎగతాళి చేయాల్సిన అవసరం లేదు. తుపాకీ వదిలి కుటుంబంతో బతకాలని కోరుకోవడం తప్పు కాదు. చేనేత దుస్తులు ధరించి ర్యాంప్‌పై నడవడం తప్పు కాదు. కానీ, ఒక వ్యక్తి పునరావాసాన్ని ఒక రాజకీయ ఉద్యమం పరాజయానికి ట్రోఫీగా చూపించడం ప్రశ్నించాలి. “చూడండి, నిన్న తుపాకీ పట్టిన వాళ్లు ఇవాళ ర్యాంప్‌పై నడుస్తున్నారు. తుపాకీ మార్గం ఓడిపోయింది. ప్రధాన స్రవంతి గెలిచింది” అనే కథనం ఇందులో దాగి ఉంది. ఈ ర్యాంప్ వాక్‌ను పునరావాసం, పునరేకీకరణ, హింస నుంచి అభివృద్ధికి మార్పు వంటి ప్రతీకలతో వివరించే అధికారిక, మీడియా కథనాలు వెలువడ్డాయి. ఒక వ్యక్తి జీవితంలో వచ్చిన మార్పును మొత్తం రాజకీయ ఉద్యమం పరాజయానికి ప్రతీకగా నిలబెట్టడం ద్వారా ఒక సంక్లిష్టమైన సామాజిక రాజకీయ చరిత్రను ఒకే ఫ్రేమ్లో బంధించే ప్రయత్నం జరుగుతుంది. కానీ మార్క్సిస్ట్ ప్రశ్న అక్కడితో ఆగదు. ఒక వ్యక్తి మారితే సమాజం మారిందా? కొంత మంది లొంగిపోతే వారిని అడవిలోకి నెట్టిన సామాజిక పరిస్థితులు మాయ మయ్యాయా? భూమి సమస్య పరిష్కారమైందా? ఆదివాసీలకు అడవిపై హక్కు పూర్తిగా వచ్చిందా? ఖనిజ సంపదపై స్థానిక ప్రజల నిర్ణయాధికారం పెరిగిందా? నిరుద్యోగం, పేదరికం, భూస్వామ్య అవశేషాలు, కుల వివక్ష, సామాజిక అస మానత అంతమయ్యాయా? ఇదే అసలు గీటురాయి. పునరావాసం అంటే వ్యక్తి జీవితాన్ని తిరిగి నిర్మించడమా? లేక అతను లేదా ఆమె జీవితాన్ని ప్రభుత్వ ప్రచార కథనానికి అనుగుణంగా మలచడమా? పునరావాసం నిజమైనదైతే అందులో స్వేచ్ఛ, సమ్మతి, గౌరవం తప్పనిసరిగా ఉండాలి. ఒక మాజీ మహిళా మావో యిస్టుకు కుట్టుమిషన్ ఇవ్వడం, ఉపాధి నేర్పడం, వ్యవసాయానికి అవకాశం కల్పించడం, పిల్లలకు విద్య అందించడం, ఆరోగ్య సదుపాయాలు కల్పించడం వంటివన్నీ నిజమైన పునరావాస చర్యలు. కానీ ఆమెను కెమెరాల ముందు నిలబెట్టి “నిన్న అడవి లో తుపాకీ పట్టింది, ఇవాళ ర్యాంప్‌పై నడుస్తోంది” అనే దృశ్యాన్ని తయారు చేయ డం మరో రాజకీయ ప్రక్రియ. అందుచేత ఈ కార్యక్రమంపై ప్రశ్నించాల్సింది. ఆమె స్వచ్ఛందంగా వచ్చిందా? ముందుగానే పూర్తి సమాచారం ఇచ్చారా? ర్యాంప్ వాక్కు ఆమె సమ్మతి తీసుకున్నారా? నిరాకరించే స్వేచ్ఛ ఆమెకు ఉందా? కుట్టుమిషన్ లేదా ఉపాధి శిక్షణ పేరుతో తీసుకువచ్చి వేరే కార్యక్రమంలో పాల్గొనమని ఒత్తిడి చేశారా? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు రావాలి. నకస్ల్బరీని తుపాకీ, హింస, నిషేధిత సంస్థల చరిత్రగా చదవడం దాని సామాజిక మూలాలను చెరిపేయడమే. భూమి ఎవరిది? భూమిలేని రైతు బతుకేంటి? వ్యవసాయ కూలీకి హక్కులేంటి? ఆదివాసీకి అడవిపై అధికారం ఎవరిది? భూ సంబంధాలు ఎలా మారాలి? రాజ్యాధికారం ఎవరికి అనుకూలంగా పనిచేస్తోంది? అనే ప్రశ్నల నుంచే నకస్ల్బరీ రాజకీయ సవాలు పుట్టింది. ఇక్కడే లిబరేషన్ దృక్పథంలోని విమర్శనాత్మక మార్క్సిజం అవసరం. మావోయిస్టు రాజకీయాన్ని విమర్శించడానికి భూసమస్యను తిరస్కరించాల్సిన పని లేదు. అదే విధంగా రాజ్య అణచివేతను విమర్శించడం అంటే మావోయిస్టు ఉద్యమంలోని ప్రతి రాజకీయ పద్ధతినీ సమర్థించడం కాదు. విప్లవ లక్ష్యం ఒకటి. దానికి అనుసరించిన రాజకీయ వ్యూహం మరోటి. ఈ రెండింటినీ కలిపేయడం మార్క్సిజం కాదు. బస్తర్‌లో ఇటీవలి కాలంలో పెద్ద సంఖ్యలో లొంగుబాట్‌లు జరుగుతున్నాయి. వీటిని కేవలం “రాజ్యం గెలిచింది” అని చదవడం ఎంత సరళీకరణో, “లొంగిపోయిన వాళ్లంతా ద్రోహులు” అని చెప్పడం అంతే సరళీకరణ. ఒక కార్యకర్త ఎందుకు వెనక్కి తగ్గాడు? ఏ భౌతిక పరిస్థితులు అతడిని లేదా ఆమెను ఆ నిర్ణయానికి నెట్టాయి ? దీర్ఘకాలిక అడవి జీవితం, కుటుంబాలకు దూరం, మరణ భయం, సంస్థాగత సంక్షోభం, నాయకత్వంపై అసంతృప్తి, భవిష్యత్తుపై అనిశ్చితి, మరోవైపు ప్రభుత్వ పునరావాస ప్యాకేజీలన్నీ కలిసి పనిచేసి ఉండవచ్చు. అందుకే ప్రశ్న “వాళ్లు ఎందుకు లొంగిపోయారు?” అన్నదొక్కటే కాదు. “వాళ్లు లొంగిపోయే పరిస్థితి ఎందుకు ఏర్పడింది?” అనేదే అసలు ప్రశ్న. ఆపరేషన్ కగార్‌ను ఇలాగే చూడాలి. బస్తర్‌ను “భద్రతా సమస్య”గా కుదించేస్తే అక్కడి రాజకీయ ఆర్థిక వ్యవస్థ కనిపిం చదు. అడవి ఉంది. భూమి ఉంది. ఖనిజ సంపద ఉంది. రహదారులు ఉన్నాయి. మౌలిక వసతులు ఉన్నాయి. పెట్టుబడులు ఉన్నాయి. ఆదివాసీ ప్రజల జీవన హక్కులు ఉన్నాయి. భద్రత, భూమి, ఖనిజం, పెట్టుబడి, అభివృద్ధి, ఆదివాసీ హక్కులు విడివిడిగా ఉన్న ప్రశ్నలు కావు. అందుకే “ప్రధాన స్రవంతిలోకి వచ్చారు” అనే మాటను నిగ్గదీయాలి. ప్రధాన స్రవంతి అంటే ఎవరిది? అడవితో జీవించడం వెనుకబాటుతనమా? నగర వినియోగ సంస్కృతి లోకి రావడమే అభివృద్ధా? చేనేత దుస్తులు ర్యాంప్పైకి వచ్చినప్పుడే వాటికి విలువ వస్తుందా? ఆ చేనేతను ఉత్పత్తి చేసే కార్మికుడి బతుకు ఏమిటి? మార్క్సిస్ట్ దృక్పథం ఇక్కడ ఒక కీలకమైన తేడాను ముందుకు తెస్తుంది. ప్రజలను “ప్రధాన స్రవంతి లోకి తీసుకురావడం” కాదు. ప్రజలే తమ హక్కులతో ప్రజాస్వామిక ప్రధాన స్రవంతిని నిర్మించాలి. ఒక ఆదివాసీ మహిళ తన అడవిలో గౌరవంగా జీవించగలిగితే అదే అభివృద్ధి. ఒక మాజీ మావోయిస్టు మహిళ తనకు నచ్చిన ఉపాధిని ఎంచుకోగలిగితే అదే పునరావాసం. ఆమె ర్యాంప్‌పై నడవాలా వద్దా అన్న నిర్ణయాన్ని ఆమె తీసుకోగలిగితే అదే స్వేచ్ఛ. ఇదే సమయంలో విప్లవోద్యమం తనను తాను కూడా నిగ్గదీయాలి. ప్రజల నుంచి దూరమైపోయిందా? విస్తృత ప్రజా ఉద్యమాల నిర్మాణం బలహీనపడిందా ? సైనిక చర్యకు రాజకీయ ఉద్యమంపై అధిక ప్రాధాన్యం వచ్చిందా ? కార్మికులు, రైతులు, దళితులు, ఆదివాసీలు, మహిళలు, విద్యార్థులు, యువతతో నిరంతర ప్రజా సంబంధం ఎంతవరకు ఉంది ? కుల నిర్మూలనను వర్గపోరాటంతో ఎలా మిళితం చేయాలి ? ప్రజాస్వామిక హక్కుల పోరాటాలను ఎలా విస్తరించాలి? ఇవి అసౌకర్యమైన ప్రశ్నలే కావచ్చు. కానీ విప్లవ రాజకీయానికి ఆత్మవిమర్శ లేకపోతే అది సిద్ధాంతం కాదు, స్వీయ సమర్థన. లెనిన్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. విప్లవ పార్టీ ప్రజల జీవితాల నుంచి వేరుపడకూడదు. కార్మిక వర్గం, రైతాంగం, పీడిత వర్గాలు, మహిళలు, యువత, ఆదివాసీల దైనందిన పోరాటాలతో రాజకీయానికి జీవ సంబంధం ఉండాలి. నిన్న “శత్రువు”గా చూపిన మనిషిని ఇవాళ “విజయ ప్రతీక”గా చూపవచ్చు. అందుకే రాయ్పూర్ ర్యాంప్‌ను చూసి మనం నవ్వకూడదు. చప్పట్లు కొట్టకూడదు. రాజ్య విజయగాథగా చదవకూడదు. ఆమె స్వేచ్ఛగా నడిచిందా ? ఎవరో చూపించిన దారిలో నడిపించారా ? ఈ ప్రశ్నకు సమాధానం కావాలి. అదే సమయంలో ఆమె తుపాకీ వదిలాక నిజంగా ఏం పొందింది… ఉపాధి ? గౌరవం ? భద్రత ? స్వేచ్ఛ ? రాజకీయ హక్కు ? లేక కేవలం ఒక రోజు ర్యాంప్లైట్ ? అనేదీ అడగాలి. నిజమైన పునరావాసం ఒకరోజు కెమెరా ముందు జరిగే కార్యక్రమం కాదు. ఒక మనిషి తన జీవితాన్ని తానే నిర్ణయించుకునే స్థితికి చేరుకోవడం. అదే నిజమైన విముక్తి. మొన్న వాళ్లు. నిన్న వీళ్లు. ఇవాళ నేను. రేపు నువ్వు.. పోరాటానికి తలకొరివి పెట్టేది మనమేనా ? లేక ఓడిపోయిన చరిత్రను నిగ్గదీసి, కొత్త కాలానికి కొత్త పోరాట భాషను నిర్మించేది మనమేనా ?
సెల్ : 78932 30218

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు