సీట్ల సర్దుబాటులో ఎవరికి వారే యమునా తీరే
మేయర్, చైర్మన్ పీఠాలపై పట్టుబడుతున్న జనసేన, బీజేపీ
- ప్రత్యక్ష ఎన్నికలతో పెరిగిన పోటీ
- తీవ్ర ఒత్తిడిలో తెలుగు తమ్ముళ్లు
- బాబు-పవన్ భేటీపైనే సర్వత్రా ఆసక్తి
విశాలాంధ్ర – సచివాలయం: రాష్ట్రంలో త్వరలో జరగనున్న పురపాలక, కార్పొరేషన్ ఎన్నికల సమరంలో అధికార మిత్రపక్షాల మధ్య సమన్వయ లోపం బయటపడుతోంది. 2024 సాధారణ ఎన్నికలలో చూపిన విజయోత్సాహం, ఐక్యత ఒకెత్తయితే… క్షేత్రస్థాయికి వచ్చేసరికి “మా సీటు మాదే” అంటూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు ఎవరికి వారే పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. మొదటి విడతగా మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్ల పదవులకు నేరుగా ఎన్నికలు జరగనుం డటంతో పొత్తుల లెక్కలు, రాజకీయం పూర్తిగా మారిపోయాయి. చైర్మన్లు, మేయర్లను ప్రజలే నేరుగా ఎన్నుకునేలా చట్టసవరణలు పూర్తి కావడంతో కీలక పీఠాల కోసం అధికార కూటమిలోని మూడు పార్టీల మధ్య పోటీ తీవ్రమైంది. గతంలో వార్డు సభ్యులుగా కౌన్సిలర్లు, కార్పొరేటర్లను గెలిపించుకుని, ఆ తర్వాత అంతర్గత బేరసారాలతో పీఠాలను దక్కించుకునే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు నేరుగా చైర్మన్, మేయర్ పీఠాలకే ఓటింగ్ జరగనుండటంతో ఏ ఒక్క పార్టీ కూడా తమ పట్టును విడిచిపెట్టడానికి సిద్ధంగా లేదు. సామాజిక సమీకరణాలు, అర్బన్ ప్రాంతాల్లో తమకున్న పట్టు ఆధారంగా ప్రతిష్టాత్మకమైన స్థానాల్లో తమ అభ్యర్థులే బరిలో ఉండాలని స్థానిక నాయకులు అధిష్టానాలపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. సాధారణ ఎన్నికలలో సాధించిన ప్రతిష్టాత్మక ఫలితాలు, సామాజిక-రాజకీయ సమీకరణాలను ప్రామాణికంగా తీసుకుని తమకు బలం ఉన్న ప్రాంతాల్లో స్థానాలను దక్కించుకోవా లని జనసేన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కీలక మున్సిపాలిటీలు, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి వంటి కార్పొరేషన్లలో పట్టు సాధించేందుకు సిద్ధమని ఇప్పటికే సంకేతాలిచ్చింది. స్థానిక పరిస్థితులను బట్టి బరిలోకి దిగుతామని, తగ్గెదేలే అని స్పష్టం చేయడంతో క్యాడర్లో ఉత్సాహం నెలకొంది. మరోవైపు, జాతీయ పార్టీ హోదాలో అర్బన్ ప్రాంతాల్లో తమ బలాన్ని నిరూపించుకోవాలని బీజేపీ భావిస్తోంది. విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు వంటి నగరాల్లో మేయర్ స్థానాలతో పాటు కొన్ని కీలక మున్సిపాలిటీలలో తమ స్థానాలను భద్రపరుచుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. మిత్రపక్షాల ఆశల వెల్లువతో ప్రధాన భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ తీవ్ర ప్రతిష్టంభన ఎదుర్కొంటోంది. క్షేత్రస్థాయిలో ఏళ్ల తరబడి పార్టీ కోసం శ్రమించిన నాయకులు తమకే సీట్లు కావాలని పట్టుబడుతుండటంతో, వారిని బుజ్జగించడం టీడీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఇటీవల కూటమి సమన్వయ కమిటీ సమావేశం జరిగినప్పటికీ, కలిసే పోటీ చేద్దామనే సూత్రప్రాయ ప్రకటన తప్ప సీట్ల అంతర్గత సర్దుబాటుపై స్పష్టత రాలేదు. పొత్తు ధర్మాన్ని నిలబెట్టుకుంటూనే సొంత పార్టీ ప్రయోజనాలను, క్యాడర్ ఆశలను కాపాడుకోవాలనే ఆలోచనతో టీడీపీ ప్రస్తుతానికి వేచి చూసే ధోరణి అవలంబిస్తోంది. స్థానిక నాయకత్వాల మధ్య రగులుతున్న సీట్ల మంటను చల్లార్చి, కూటమి ఓట్లు ఏమాత్రం చీలిపోకుండా చూడాలంటే అత్యున్నత స్థాయి జోక్యం అనివార్యమైంది. ఈ క్రమంలో ముఖ్య మంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ త్వరలోనే ప్రత్యేకంగా భేటీ కానున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా సీట్ల కేటాయింపు, మేయర్, చైర్మన్ అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అధినేతలు ఇద్దరూ కూర్చుని ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను ప్రకటిస్తే తప్ప, క్షేత్రస్థాయిలో ఉన్న ఈ ‘స్థానిక’ చిక్కుముడులు వీడే అవకాశం కనిపించడం లేదు.


