Home‘కేసరి`లాల్‌’ మంతనాలు!

‘కేసరి`లాల్‌’ మంతనాలు!

- Advertisement -

. కమనాథులతో చైనా కమ్యూనిస్టుల భేటీ
. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయాల సందర్శన
. 2014 నుంచి ఇదే తొలి సమావేశం
. ఈ బంధాన్ని ఏమనాలి: కాంగ్రెస్‌

న్యూదిల్లీ: హిందూత్వ సిద్ధాంతానికి, కమ్యూనిజానికి పోలిక లేదు. అతిజాతీయవాదం, మనువాదాన్ని ఆచరించే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌తో కమ్యూనిస్టుల కలయిక అరుదు. ప్రస్తుతం ఇలాంటి దృశ్యమే ఆవిష్కృతమైంది. ఇది రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. భిన్న సిద్ధాంతాలు, భావజాలాలు కలిగివున్న కాషాయ (కేసరీ) వర్గీయులతో చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. భారత్‌ పర్యటనలో భాగంగా రెండు దేశాలు, పార్టీల మధ్య సమన్వయం పెంచుకునే ఉద్దేశంతో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయాలను చైనా ప్రతినిధులు సందర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలేను కలిశారు. దాదాపు గంట సేపు సమావేశమయ్యారు. 2014 నుంచి సీపీసీబీజేపీ భేటీ కావడం ఇదే మొదటిసారి. 2009లో బీజేపీ అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ నాయకత్వంలో ఇలాంటి భేటీ జరిగింది. తాజా సమావేశానికి కచ్చితమైన అజెండా ఏమీ లేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే రెండు పార్టీల మధ్య సమన్వయం దిశగా చర్చలు సాగినట్లు తెలిపాయి. ఈ భేటీ భారత్‌, చైనా బంధానికి మరింత బలం చేకూర్చగలదని ఆకాంక్షించారు. కాగా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌తో బీజేపీ కార్యాలయంలో జరిగిన భేటీలో రెండు పార్టీల మధ్య సంప్రదింపులు పెంచుకోవడంపై ప్రతినిధులు చర్చించినట్లు భారత్‌కు చైనా రాయబారి జు ఫెహాంగ్‌ వెల్లడిరచారు. అయితే ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలతో భేటీకి అధిక ప్రాధాన్యత వచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్‌ అధ్యక్షుడు మోహన్‌ భగవత్‌ గతేడాది ఆగస్టులో లెచ్చర్‌ సిరీస్‌ నిర్వహించగా, చైనా మినహా అనేక దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. అప్పట్లో ఆపరేషన్‌ సింధూర్‌ కారణంగా పాకిస్థాన్‌, చైనా దేశాలను ఆహ్వానించలేదు.
మోదీ లొంగుబాటుకు నిదర్శనం: విపక్షాలు
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలతో చైనా ప్రతినిధుల భేటీపై ప్రతిపక్ష కాంగ్రెస్‌, ఆప్‌ స్పందించాయి. కేంద్ర ప్రభుత్వ విధానాన్ని, ప్రధాని మోదీ వైఖరిని ప్రశ్నించాయి. ‘ఇది సాధారణ సమావేశం కాదు. ఓ వైపు చైనాపై కన్నెర్ర చేసినట్లు మోదీ చెప్పుకుంటున్నారు… మరోవైపు బీజేపీ నేతలు ఆ దేశ ప్రతినిధులకు ఎర్ర తివారీ పరుస్తున్నారని ఎక్స్‌ మాధ్యమంగా దుయ్యబట్టాయి. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాక్‌కు మద్దతిచ్చింది, అరుణాచల్‌లో గ్రామాలు ఏర్పాటు చేసుకుంటోంది, అలాంటి దేశ ప్రతినిధులను బీజేపీ నేతలు ఆలింగనాలు చేసుకుంటున్నారంటూ సీసీపీ`బీజేపీ భేటీని కాంగ్రెస్‌ నేత సుప్రియా శ్రీనటే విమర్శించారు. ‘ఈ బంధాన్ని ఏమనాలి? బీజేపీ ఎందుకు దేశద్రోహానికి పాల్పడిరది? బీజేపీ, చైనా మధ్య ఎలాంటి రహస్య ఒప్పందం జరిగింది?’ అని శ్రీనటే వరుస ప్రశ్నలు సంధించారు. చైనా కంపెనీలపై నిషేధాన్ని మోదీ ఎత్తివేయబోతున్నారు… ఇక ప్రభుత్వ ఒప్పందాలన్నీ చైనా సొంతం చేసుకోబోతోందని వ్యాఖ్యానించారు. చైనాతో వాణిజ్యాన్ని భారత్‌ పెంచుకోవడం చూస్తుంటే విశ్వగురువుగా చెప్పుకునే మోదీ… ఏ విధంగా అమెరికా ఎదుట సణుగుతూ… చైనా ఎదుట అర్రులుచాచుతున్నారో అర్థమవుతోందని శ్రీనటే విమర్శలు గుప్పించారు. చైనా అంటే మోదీకి భయమంటూ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా వ్యాఖ్యానించారు. ఆయన దిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ బీజేపీపై విరుచుకుపడ్డారు. రంగులు మార్చడం ఎలాగో బీజేపీని చూసి ఊరసవిల్లి నేర్చుకోవాలంటూ ఎద్దేవా చేశారు. చైనాపై కన్నెర్ర చేసిన వారు ఇప్పుడు ఎర్ర తివాచీ పరిచారా అంటూ విమర్శించారు. ‘అధికారంలో లేనప్పుడు చైనాకు వెళ్లేవాళ్లు… సమావేశాలు నిర్వహించేవారు… ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులు శిక్షణ కోసం కూడా ఆ దేశానికి వెళ్లారు’ అని పవన్‌ ఖేరా వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు