. రూ.20 కోట్లు మంజూరు
. ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష
విశాలాంధ్ర-హైదరాబాద్: ఆషాడ మాస బోనాల ఉత్సవాలు రంగ రంగ వైభవంగా నిర్వహించాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎంసీహెచ్‌ఆర్డీ తుంగభద్ర బ్లాక్ లో ఆషాడ బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికా రులతో వారు సమీక్షించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆషాడ బోనాల ఉత్సవాల నిర్వహణ కు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ఉత్సవాలు ఈనెల 26న ప్రారంభమై జులై 24 వరకు నిర్వహించడం జరుగుతుం దన్నారు. 26న గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి ఆలయంలో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, జూన్ 29న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో ఎదుర్కోలు, 13న రంగం (భవిష్యవాణి) నిర్వహించడం జరుగుతుం దన్నారు. జులై 1న బల్కంపేట శ్రీఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో కళ్యాణం, పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం, జులై 20న సింహ వాహిని మహంకాళి ఆలయం, మీరాళం మండి శ్రీ మహా కాళేశ్వర దేవాలయం, శాలిబండ శ్రీ అక్కన్న మాదన్న ఆలయం, చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం, కార్వాన్ శ్రీ దర్బార్ మైసమ్మ దేవస్థానం, కార్వాన్ సబ్జి మండి శ్రీనల్ల పోచమ్మ దేవాలయం, బల్కంపేట్ శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవాలయంలో ఆషాడ బోనా లు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం 28 ప్రధాన దేవాలయాలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తుందని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రధాన దేవాలయాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బోనాల ఉత్సవాలలో 700 మంది కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు, అమ్మవారి ఊరేగింపులో కళా ప్రదర్శనలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆషాడ బోనాలు దిల్లీ తో పాటు విజయవాడ, శ్రీశైలంలో కూడా నిర్వహించనున్నట్లు వెల్లడిరచారు. అనంతరం దేవాలయాల కమిటీలతో మంత్రులు సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవాలని, అధికారులు ఎక్కడా లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రులు ఆదేశించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీల చైర్మన్లు, సభ్యులతోనూ సమా వేశం కొనసాగింది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, డీజీపీ జితేందర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, సీపీ సీవీ ఆనంద్ స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్, పోలీస్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రవి గుప్తా, వివిధ శాఖల ఉన్నత అధికారులు పాల్గొన్నారు.