దాదాపు రెండేళ్ల పాటు బీజేపీ అధ్యక్షుడిగా జె.పి.నడ్డాను కొనసాగించి చివరకు బిహార్‌కు చెందిన నితిన్ నవీన్ ను అధ్యక్షుడిగా నియమించారు. అంతకుకొద్దిరోజుల ముందే ఆయనను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించారు. ఇలాంటి సంప్రదాయం బీజేపీలో ఇంతకుముందు ఎన్నడూ కనిపించలేదు. నితిన్ నవీన్ అయిదుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. బిహార్‌లో మంత్రిగా ఉండేవారు. ఆయన వయసు 45ఏళ్లు. అంతకన్నా చిన్న వయసులో బీజేపీకి పూర్వ రూపమైన భారతీయ జనసంఘ్ అధ్యక్షుడిగా 1968లో ఎన్నికైనప్పుడు వాజపేయి వయసు 43 ఏళ్లే. దీన్ దయాళ్ ఉపాధ్యాయ మరణించడంతో వాజపేయిని ఆ స్థానంలో నియమించారు. అయితే అప్పటికే వాజపేయి ప్రసిద్ధుడే. బీజేపీ కొత్త అధ్యక్షుడిగా నియమితుడైన నితిన్ నవీన్ అనామకుడి కిందే లెక్క. ఆయన బిహార్‌లో కూడా అందరికీ పరిచితుడు కాదు. బీజేపీలో పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఎన్నికల తంతు ఏదీ ఉండదు. అన్నీ నియామకాలే. బీజేపీ ఆర్.ఎస్.ఎస్.కు అనుబంధ సంస్థ కనక పార్టీ అధ్యక్షుడి నియామకానికి మాతృసంస్థ అంగీకారం ఉండవలసిందే. నడ్డా తరవాత ఎవరిని బీజేపీ అధ్యక్షుడిగా నియమించాలన్న విషయంలో ఆర్.ఎస్.ఎస్.కు బీజేపీకి ఏకాభిప్రాయం కుదరనందు వల్లే దాదాపు రెండేళ్ల జాప్యం జరిగింది. నితిన్ నవీన్‌ను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టిన సందర్భంలో ప్రధాని మోదీ విచిత్రమైన వ్యాఖ్య చేశారు. నేను బీజేపీలో సామాన్య కార్యకర్తనే. ఈ రోజు నుంచి నితిన్ నవీన్ నాకు బాస్ మోదీ అన్నారు. ఆర్.ఎస్.ఎస్., అమిత్‌షా, మోదీ అంగీకారం లేకుండా ఎవరూ బీజేపీ అధ్యక్షులు కాలేరు. అందువల్ల మోదీ వ్యాఖ్య విచిత్రంగానే కనిపిస్తుంది. మోదీ నితిన్ నవీన్ తనకు బాస్ అని చెప్పినప్పటికీ మోదీ, అమిత్ షాకు చెప్పకుండా బీజేపీ అధ్యక్షుడు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఇంతవరకు అధ్యక్షుడిగా ఉన్న నడ్డాకు ఆ స్వాతంత్య్రం ఇవ్వనే లేదు. నడ్డా వెన్నెముక లేని అధ్యక్షుడిగానే కొనసాగారు. నితిన్ నవీన్ తనకు వెన్నెముక ఉందని నిరూపించగలరేమో చూడాలి. నవీన్‌కు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకపోతే ఆయనా నడ్డాలాగే మిగిలిపోతారు. బీజేపీ ఇప్పుడు సంస్థాగతంగా ఎదిగింది కనక ఇక తమకు ఆర్.ఎస్.ఎస్. దన్ను అవసరం లేదని నడ్డా 2024 మే 18న వ్యాఖ్యానించారు. మోదీ, అమిత్‌షా ఆదేశాల మేరకే ఆయన ఈ పని చేసి ఉంటారు. నడ్డా ఈ వ్యాఖ్య చేసినప్పుడు దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. వివిధ దశల పోలింగ్ మధ్యలోనే ఆయన ఈ మాట చెప్పారు. ఆ దశలో అబ్‌కి బార్ చార్ సౌ పార్ అన్న నినాదం దేశమంతటా ప్రతిధ్వనిస్తూ ఉండేది. కానీ నడ్డా ప్రకటన తరవాత మిగిలిన లోక్‌సభ ఎన్నికలలో ఆర్.ఎస్.ఎస్.కార్యకర్తలు బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం చేయడం మానుకున్నారు. అందుకే బీజేపీ 240 సీట్లతో సంతృప్తి పడవలసి వచ్చింది. అప్పటికే మోదీ తాను మామూలు మనిషిని కాదని, దైవాంశ సంభూతుడిని అని, ఈసారి 400 కన్నా ఎక్కువ స్థానాలు సంపాదిస్తామని, మోదీ గ్యారంటీ అని బీరాలు పలికేవారు. సహజంగానే ఇది ఆర్.ఎస్.ఎస్. అధినాయకులకు నచ్చలేదు. ఈ మాటలన్నీ ఆర్.ఎస్.ఎస్. ఎన్నికల ప్రచారం నుంచి దూరంగా ఉండడానికి దారి తీశాయి. ఈ ప్రభావంవల్ల బీజేపీ సాధించిన సీట్లు కుదించుకు పోయాయి. ఏదో ఒక రోజు మోదీ, షా నితిన్ నవీన్‌ను పిలిచి మీరు ఇలా చేయాలి అని చెప్తే ఆయన ఆ మాటను జవదాటగలరా ? ససేమిరా సాధ్యం కాదు.నడ్డా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం ఆయన అనేక అవమానాలు భరించవలసి వచ్చింది. అయినా ఆయన సకల అవమానాలూ దిగమింగి ఎప్పుడూ ముసిముసి నవ్వులు చిందిస్తూ ఉండేవారు.
ఈ వాస్తవాన్ని నితిన్ నవీన్ ఉపేక్షించలేరు. నడ్డా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో బీజేపీ 30సార్లు వివిధ శాసనసభ ఎన్నికలలో విజయం సాధించగలిగింది. అందులో ఒక్క విజయం కూడా నడ్డా ఖాతాలో వేయలేదు. ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ బలం గణనీయంగా తగ్గింది. శాసనసభ ఎన్నికలలోనూ బీజేపీ అధికారం సాధించింది. ఆ విజయోత్సవ సభలో నడ్డా ఎక్కడా కనిపించలేదు. ఆయన పేరైనా ఎవరూ ఎత్తలేదు. ఆ తరవాతే నడ్డా ఆర్.ఎస్.ఎస్. అధినాయకులను క్షమించమని అడగడానికి నడ్డా చేతులు జోడించి నాగపూర్‌లోని ఆర్.ఎస్.ఎస్. ప్రధాన కార్యాలయంలో వేచి ఉండవలసి వచ్చింది. నడ్డా ఏం చేయాలనుకున్నా అమిత్‌షాను సంప్రదించాల్సి వచ్చేది. అధ్యక్షుడు నడ్డా అయినా పార్టీ వ్యవహారాలన్నీ అమిత్‌షానే చూసుకునే వారు. చెప్పింది చేయడమే నడ్డాకు ఇచ్చిన స్వాతంత్య్రం. నడ్డా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో అంతకుముందు బీజేపీ వ్యవహార సరళి పూర్తిగా మారిపోయింది. ఏడాదిలో కనీసం ఒక్క సారైనా బీజేపీ జాతీయ సమావేశం నిర్వహించాలని బీజేపీ నిబంధనావళిలో రాసుకున్నారు. కానీ నడ్డా హయాంలో ఈ నియమాన్ని పాటించుకోనే లేదు. పార్టీ నిబంధనావళిని రాష్ట్రస్థాయిల్లో కూడా అమలు చేయనే లేదు. సర్వం మోదీ మయంగా కొనసాగింది. మోదీ ప్రధానమంత్రి అభర్థిగా ఎంపిక అయినప్పుడు కనీసం పార్లమెంటరీ బోర్డు సమావేశమైనా జరగలేదు.
చేసిందల్లా ఎన్.డి.ఎ.సమావేశంలో రాజ్‌నాథ్‌సింగ్ లేచి మోదీ ఎన్.డి.ఎ. పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు అని ప్రకటించడమే. గత డిసెంబర్ 15న నితిన్ నవీన్‌ను కార్య నిర్వాహక అధ్యక్షుడిగా నియమించేదాకా ఆయన పేరే ఎక్కడా వినిపించలేదు. నడ్డా స్థానంలో బీజేపీ అధ్యక్షులు ఎవరవుతారు అన్న విషయంలొ ఊహాగానాలు మాత్రమే సాగాయి. అనేక మంది సీనియర్ నాయకుల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. ఈ ఊహాగానాలన్నింటినీ పరాస్తం చేసి హఠాత్తుగా నితిన్ నవీన్‌ను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించారు. ఆ నిర్ణయం బీజేపీ పార్లమెంటరీ బోర్డు తీసుకుందని చెప్పారు. పార్లమెంటరీ బోర్డు సమావేశం ఎప్పుడు జరిగిందో ఎవరూ చెప్పలేదు. ఎవరికీ తెలియదు. ఎక్కడ జరిగిందో కూడా చెప్పలేదు. పార్లమెంటరీ బోర్డు సమావేశం దిల్లీలోని భవ్యమైన బీజేపీ ప్రధాన కార్యాలయంలో కాకుండా ఆన్‌లైన్‌లో జరిగిందన్నారు. నితిన్ నవీన్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ఆయన ఆర్.ఎస్.ఎస్.తో సమన్వయం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఆర్.ఎస్.ఎస్.తోనూ ఆయనకు పెద్ద అనుబంధం లేదు. ఆయన బీజేపీ యువమోర్చా అధ్యక్షుడిగా పని చేశారు. నవీన్ తనకన్నా చాలా సీనియర్లైన రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్‌తో ఎలా వ్యవహరిస్తారన్నదీ గమనించాల్సిన అంశమే. బీజేపీ ముఖ్యమంత్రులతో ఎలా వ్యవహరిస్తారు అన్నదీ పెద్ద సవాలే.
నితిన్ నవీన్ నెగ్గుకు రాగలరా !
- Advertisement -


