Tuesday, November 18, 2025
Homeన్యాయ వ్యవస్థను బెదిరించడమే

న్యాయ వ్యవస్థను బెదిరించడమే

- Advertisement -

సీపీఐ కేంద్ర కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ నారాయణ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌పై ఓ న్యాయవాది బూటు విసరడం దారుణమని, ఇది న్యాయ వ్యవస్థను బెదిరించడమేనని సీపీఐ కేంద్ర కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ కె.నారాయణ తీవ్రంగా ఖండిరచారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఇది ఒక వ్యక్తి తప్పుడు ప్రవర్తన మాత్రమే కాదని, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలకు చెందిన కుడిపక్ష శక్తులు పెంచిపోషిస్తున్న అసహన సంస్కృతికి ప్రతీక అని పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థలను అవమానపరచడం, న్యాయవ్యవస్థను బెదిరించడం లక్ష్యంగా… ప్రణాళికతో కూడిన దాడి ప్రయత్నమని నారాయణ మండిపడ్డారు. సీపీఐ అభిప్రాయం ప్రకారం… న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యానికి ఒక స్వతంత్ర స్తంభం. న్యాయమూర్తులపై దాడి చేయడం అంటే రాజ్యాంగంపై దాడి చేయడమేనని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య శక్తులందరూ న్యాయవ్యవస్థ గౌరవం, స్వతంత్రతను కాపాడాల్సిన అవసరం ఉందని కోరారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని, దీని వెనుక ఉన్న ఉద్దేశం, సంస్థాగత ప్రోత్సాహం గురించి వెలికితీయాలని డిమాండ్‌ చేశారు. బాధ్యులపై నేర, ధిక్కరణ చట్టాల కింద కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడటానికి, ద్వేషం, బెదిరింపు రాజకీయాలను ఎదుర్కోవడానికి, సామ్యవాద, ప్రజాస్వామ్య శక్తులంతా ఐక్యంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
సనాతనవాది దాడి దుర్మార్గం: రామకృష్ణ
సీజేఐ బీఆర్‌ గవాయ్‌పై ఓ సనాతనవాది దాడికి పాల్పడడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్రంగా ఖండిరచారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఎన్నడూ లేని విధంగా సుప్రీంకోర్టులో ఇలాంటి అనూహ్య ఘటన చోటుచేసుకోవడం విచారకరమన్నారు. సాక్షాత్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌పై రాకేశ్‌ కిషోర్‌ అనే న్యాయవాది చెప్పుతో దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ‘సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదు’ అని న్యాయవాది కేకలు వేయడం దుర్మార్గమన్నారు. లౌకిక వ్యవస్థగా పేరుగాంచిన దేశంలో ఎవరి అభిప్రాయాలను వారు స్వేచ్ఛగా వెలిబుచ్చే పరిస్థితి ఉండేదని, మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి సనాతనవాదం తారస్థాయికి చేరిందన్నారు. సనాతనవాదుల్లో రోజురోజుకీ అసహనం పెరిగిపోతోందని, చివరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడులు చేసే స్థాయికి సనాతనవాద పిచ్చి పరాకాష్టకు చేరడం గర్హనీయమని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. హేతువాదులు, ప్రజాతంత్రవాదులంతా సనాతనవాదుల దురాగతాలను తీవ్రంగా ఖండిరచాలని కోరారు.
మతోన్మాదులపై చర్యలు: సీపీఎం
సనాతన ధర్మానికి అవమానం జరిగిందన్న పేరుతో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్‌ గవాయ్‌పై దాడికి పాల్పడిన మతోన్మాదులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం రాష్ట్ర కమిటీ తీర్మానించింది. రాష్ట్ర కమిటీ సమావేశాలు పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం అధ్యక్షతన జరిగాయి. మొదటగా జస్టిస్‌ గవాయ్‌పై మతోన్మాద న్యాయవాది ఒకరు కోర్టులో అందరూ చూస్తుండగానే బూటు విసరటం దేశంలో నెలకొన్న దుస్థితికి అద్దం పడుతోందని తీర్మానం విమర్శించింది. మోదీ పాలనలో మతోన్మాదులు అన్ని వ్యవస్థలను ధ్వంసం చేస్తూ వచ్చారని, ఇప్పుడు బహిరంగంగా సనాతనధర్మ పరిరక్షణ పేరుతో ప్రధాన న్యాయమూర్తిపైనే బూటు విసరటం రాజ్యాంగానికి, దేశ ప్రజలకు అవమానమని తెలిపింది. ఇదే సనాతన ధర్మం అని ప్రధాని మోదీ భావిస్తున్నారా? జాతికి దీనిపై ప్రధానమంత్రి జవాబు చెప్పాలని డిమాండ్‌ చేసింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద బల్క్‌డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటు చేయరాదని మరో తీర్మానంలో డిమాండ్‌ చేసింది. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు