. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య డిమాండ్
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించాలని, మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం అందించి, క్షతగాత్రులకు మెరుగైన ఉచిత వైద్య సహాయం అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న ఓల్వో బస్సు కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రమాదానికి గురై, పూర్తిగా దగ్ధమవ్వడం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. ఈ ఘోర ప్రమాదంలో స్కూటరిస్టుతో సహా 20 మంది మృతి చెందగా… 22 మంది గాయాలతో బయటపడినట్లు, చిన్నారులు సైతం ప్రమాదబారిన పడినట్లు తెలుస్తోందన్నారు. మృతులకు ప్రగాఢ సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని ఆయన వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, గాయపడిన వారికి మెరుగైన ఉచిత వైద్య సహాయం అందించాలని కోరారు. ప్రమాదానికి గురైన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ఫిట్నెస్ వాలిడిటీ ఈ ఏడాది మార్చి 31వ తేదీతోనే ముగిసిందన్నారు. ఇన్సూరెన్స్, పొల్యూషన్ వాలిడిటీ గత ఏడాది ఏప్రిల్‌లోనే ముగిశాయన్నారు. ఫిట్నెస్, ఇన్సూరెన్స్ వంటి అత్యంత ముఖ్యమైన ధ్రువ పత్రాల గడువు తీరిపోయిన బస్సులో ప్రయాణికులను తరలించడానికి, రహదారులపై తిరిగేందుకు అధికారులు అనుమతి ఎలా ఇచ్చారు?, నిబంధనలకు విరుద్ధంగా గడువు ముగిసిన అనుమతులతో ఈ ప్రైవేట్ బస్సు రోడ్డుపైకి రావడానికి కారకులైన, దీనిని నిర్లక్ష్యం చేసిన ఆయా అధికారులపై ప్రభుత్వం ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదనీ, రవాణా శాఖలో ఉన్న ఈ నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అని సూటిగా ప్రశ్నిస్తున్నామన్నారు. బస్సుల నిర్మాణంలో నాసిరకం మెటీరియల్ వాడడం, వేగ నియంత్రణ లేకపోవడం, తరచుగా ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేయకపోవడం వంటి కారణాలు ప్రమాద తీవ్రతకు అద్దం పడుతున్నాయని వివరించారు. బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సమగ్ర విచారించాలన్నారు. ప్రైవేటు బస్సుల ఫిట్నెస్, సాంకేతికత, పర్మిట్, సేఫ్టీలపై అక్రమాలకు, అవినీతికి తావివ్వకుండా ఎప్పటికప్పుడూ తనిఖీలు చేపట్టేలా చూడాలని, సెలవు రోజులలో డిమాండ్‌కు అనుగుణంగా ఇబ్బడిముబ్బడిగా పెంచేస్తున్న ప్రైవేటు బస్సుల ధరలపై నియంత్రణ ఉండేలా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అక్రమార్కులపై, ప్రమాద బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలి
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నెట్వర్క్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలను పునరుద్ధరించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు శుక్రవారం ఆయన ఒక లేఖ రాశారు. రాష్ట్రంలో నెట్వర్క్ ఆసుపత్రులకు రూ.3 వేల కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాల్సి ఉందని, బకాయిలు చెల్లించనందున 14 రోజులుగా రాష్ట్రంలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిచిపోయాయని, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల వారు తమకు రావలసిన బకాయిల చెల్లింపులు కోరుతూ ఆందోళన చేపట్టారన్నారు. పెండిరగ్ బకాయిల కోసం ఆసుపత్రుల యాజమాన్యాలు ఆరు నెలల్లో రెండు సార్లు సమ్మె చేపట్టినప్పటికీ… రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని తెలిపారు. ఫలితంగా పేదల ప్రజల ఆరోగ్య సంరక్షణ ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. అనారోగ్యంతో వెళ్లిన వారికి ఆరోగ్యశ్రీ పథకం క్రింద వైద్య సేవలు అందించలేమని, డబ్బు చెల్లిస్తేనే వైద్యం అందిస్తామని నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతూ, ఆరోగ్యశ్రీ వైద్య సేవల కింద ఎవరినీ ఆసుపత్రులలో చేర్చుకోవడం లేదన్నారు. దీంతో గుండె, కిడ్నీ, కేన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పరిస్థితి దినదినగండంగా మారిందని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడం వలన పేద, సామాన్య ప్రజలకు వైద్య ఖర్చులు తీవ్ర భారమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు, సిబ్బంది, వైద్య పరికరాల కొరత కారణంగా ప్రజలకు సమగ్ర వైద్య సేవలు అందడం లేదన్నారు. పేదల ఆరోగ్య సంరక్షణిగా పేరుగాంచిన ఆరోగ్యశ్రీ పథకానికి అవసరమైన నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడం విచారకరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికయినా స్పందించి నెట్వర్క్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించి, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు తక్షణ పునరుద్ధరణకు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.


