Homeఆంధ్రప్రదేశ్రైతు సమస్యలు పరిష్కరించండి

రైతు సమస్యలు పరిష్కరించండి

- Advertisement -

హరిశ్చంద్రపురం నకరికల్లు ఎత్తిపోతల తక్షణ పూర్తి
అక్కినేని వనజ డిమాండ్

విశాలాంధ్ర-క్రోసూరు: రైతాంగ సమస్యల పరిష్కారంపై పాలకులకు చిత్తశుద్ధి లేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మండిపడ్డారు. నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి సాగునీరు మళ్లించడంలో సమస్యలు ఉన్నాయన్న నెపంతో హరిశ్చంద్రపురం నకరికల్లు ఎత్తిపోతల పథకాన్ని ప్రత్యామ్నాయ మార్గంగా ఎంచుకుని దానిని పూర్తి చేయడంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహించిందో రైతాంగానికి సమాధానం చెప్పాలని ఆమె నిలదీశారు. ఒకసారి బనకచర్ల అంటారు… మరోసారి నల్లమల అంటారు… కాదుకాదు హరిశ్చంద్ర పురం అంటారు అని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవల్లపూడి రాము నేతృత్వంలో రైతు సంఘం బృందం శుక్రవారం నకరికల్లు, పీసపాడు, ఎర్రబాలెం, రాజుపాలెం తదితర గ్రామాలను పర్యటించి పరిస్థితులను అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా అక్కినేని వనజ మాట్లాడుతూ… దశాబ్దాలుగా సాగునీటి సమస్యలతో సతమతమవుతున్న ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లా రైతాంగానికి భరోసా కల్పిస్తూ శాశ్వత పరిష్కార మార్గంగా నాగార్జునసాగర్ కుడి కాలువ నీటికి ప్రత్యామ్నాయంగా గోదావరి- పెన్నా నదులను అనుసంధానిస్తూ హరిశ్చంద్రపురం-నకరికల్లు వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించి రైతులకు ప్రయోజనం కల్పించాలని డిమాండ్ చేశారు. గత టీడీపీ పాలనలో చంద్రబాబు ఆర్భాటంగా నకరికల్లు వద్ద శిలాఫలకం ప్రతిష్టించి హడావుడిగా ప్రారంభించిన పనులు అంతే వేగంతో ఆగిపోయాయన్నారు. కందకాల నిర్మాణ పనుల కోసం తరలించిన భారీ పైపులు రాజుపాలెం వద్ద డంపు చేయడంతో తుప్పు పట్టి దర్శనమిస్తున్నాయన్నారు. అనంతరం వైసీపీ హయాంలో కూడా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి రెండేళ్ల క్రితం అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పథకం నిలిచిపోయిందన్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటికే పల్నాడు జిల్లాలు కరవు ప్రాంతాలుగా మారిన తరుణంలో రైతాంగాన్ని పక్కత్రోవ పట్టించడం కోసమే తప్ప ఆచరణలో పక్కా ప్రణాళికతో పథకాలు పూర్తిచేసే పరిస్థితి కూటమి ప్రభుత్వానికి లేకుండా పోయిందని విమర్శించారు. ప్రభుత్వం మీనమేషాలు మానుకొని తక్షణమే హరిశ్చంద్ర పురం నకరికల్లు ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని వనజ డిమాండ్ చేశారు. లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రం పాలవుతుండడం పాలకుల దౌర్భాగ్యస్థితికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రభుత్వం స్పందించకుంటే గుంటూరు, ప్రకాశం ఉమ్మడి జిల్లాల రైతాంగాన్ని సమీకరించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, సీపీఐ సంయుక్త అధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు. సీపీఐ పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి షేక్ హుస్సేన్, పెదకూరపాడు నియోజకవర్గ కార్యదర్శి మునుగోటి శ్రీనివాసరావు, రైతు సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ముసునూరు రమేశ్, జిల్లా అధ్యక్షులు మందపాటి రమణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చేకూరి నాగేశ్వరరావు, జిల్లా నాయకుడు సిహెచ్.సత్యనారాయణ రాజు, కంతేటి పెద్దబ్బాయి పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు