Homeసాహిత్యంవ్యాకరణంలో మేటి దువ్వూరి వెంకటరమణ

వ్యాకరణంలో మేటి దువ్వూరి వెంకటరమణ

- Advertisement -

తెలుగు భాష తెలుసున్న వారందరికీ బాల వ్యాకరణం పేరు తెలిసే ఉంటుంది. ఆ బాల వ్యాకరణానికి సాహిత్య సౌరభాన్ని అద్దిన సౌందర్య భావుకులు దువ్వూరి వెంకటరమణ శాస్త్రి. అతి కటువైన వ్యాకరణ శాస్త్రాన్ని అతి సుకుమారమైన ఓ పువ్వులా మలిచి, తెలుగువారికి ఓ గొప్ప వ్యాకరణం పుస్తకాన్ని అందించిన మహానుభావుడు ఆయన.
శాస్త్రిది తూర్పుగోదావరి జిల్లాలో మసకపల్లి గ్రామం. వీరు విళంబి నామ సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి నాడు జన్మించారు. ఈయన విద్యాభ్యాసం తాత రామచంద్రుడు వద్ద జరిగింది. రామచంద్రుడు గొప్ప వేద పండితుడు. ఎవరైనా ఆయన్ని ఆహ్వానించి సత్కరిద్దాం అనుకుంటే తాంబూలం మాత్రమే తీసుకునేవారుట! అదేనా, అవతలవారు ఇవ్వబోతూ ఉంటే,” వద్దు వద్దు పళ్ళెంలో ఉంచండి… నేను తీసుకుంటాను.” అనేవారట!” చేతికి ఇస్తే పుచ్చుకోక పళ్లెంలో ఉంచమంటారేమిటి?” అని ఎవరైనా అడిగితే,” చెయ్యి బోరగిలా ఉండాలి కానీ తిరగబడితే విలువ లేదు!” అనే వారట? అంటే, ‘చేతనైతే ఎవరికైనా ఇవ్వాలి గాని ఒకరి దగ్గర పుచ్చుకుంటే ఏం విలువ?’అని ఆయన తాత్పర్యం. అటువంటి తాత దగ్గర సంస్కృత విద్యను అభ్యసించిన వెంకటరమణ శాస్త్రి 1918లో మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి విద్వాన్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.
1923వ సంవత్సరంలో శాస్త్రి విజయనగరం కాలేజీలో ఉద్యోగానికి ప్రవేశించిన కొత్తలో ఆయన స్వగ్రామమైన మసకపల్లి నుండి శొంఠి లక్ష్మీనరసింహ శాస్త్రి ఉత్తరం రాశారు.’ కనీసం రెండు రోజులు ఊళ్లో ఉండేలా సెలవు పెట్టి రా!’ అంటూ.
దువ్వూరి వారు మసకపల్లి చేరుకున్నారు. “ఏమిటి సంగతి?” అని అడిగితే,” ఇప్పుడు 9 గంటలుకి కాకర్లపూడి నరసరాజు గారు వస్తారు. ఆయనే చెబుతారు వివరాలు!” అంటూ సమాధానం వచ్చింది.
9 గంటలకు నరసరాజు గారు రానే వచ్చారు. ఇంటి అరుగు మీద కూర్చున్న వారందరికీ నమస్కరించి, దువ్వూరి వారు ఎవరో తెలుసుకొని, ఆయన వంక తిరిగి “అయ్యా! మీ తాత గారి వద్ద నేను 40 సంవత్సరాల క్రితం రెండు దఫాలుగా 40, 40 చొప్పున మొత్తం 80 రూపాయలు ‘చే బదులు’ పుచ్చుకొని, వెంటనే సర్దుబాటు చేయలేక, ఆ తర్వాత ప్రోనోటు రాసి ఇచ్చాను వారికి! నేను వారికి ఆ బాకీ అప్పట్లో తీర్చలేకపోయాను.
ప్రోనోటుకు కాల దోషం పడుతుందని నా మీద కోర్టులో దావా వెయ్యమని మీ తాతకు అందరూ చెబుతూ ఉంటే, “నరసరాజు కంఠంలో ప్రాణం ఉంటే, ప్రోనోటుకు కాలదోషం ఏమిటి?” అంటూ వారు దావా తేవడానికి నిరాకరించారని నాకు తెలిసింది. వారు గతించారు.! మీ తండ్రి కూడా గతించారు! మీరు ఎక్కడో విజయనగరంలో ఉద్యోగం లో ఉన్నారు. అయినా ఈ మీ ఇంటి అరుగు మీదే బాకీ తీర్చేయాలని, వారి మాటకు సార్ధకత చేకూర్చాలని, నాకు అనిపించింది. మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను. క్షమించండి.” అంటూ రొంటి నున్న పైకం బయటికి తీసి,” వడ్డీ ఎంతో మీకే వదిలేస్తాను! చెప్పండి!” అంటూ ముగించారు.
“అసలు ఇవ్వండి చాలు! అదేనా మీరంతా ప్రేమగా తెచ్చి ఇస్తున్నారు కనుక!” అంటూ 80 రూపాయలు తీసుకున్నారు దువ్వూరి వారు. ఈ రోజుల్లో ఇదొక జోక్‌గా మనకు అనిపించవచ్చు కానీ ఆనాడు జరిగిన సత్యం.
ఒకసారి వెంకటరమణ శాస్త్రి బెజవాడ నుండి బందరు ప్యాసింజర్‌లో వెళ్తున్నారు. దారిలో వచ్చే స్టేషన్లను చూస్తూ, ‘ఇదేమిఊరండి?’ అని పక్కాయన్ని అడిగితే, తరిగొప్పుల అని చెప్పారు. తర్వాత కొంతసేపటికి మళ్లీ అడిగితే, ఇందుపల్లి అని చెప్పారు. అలా రైలు వెళుతూ ఉంటే వరుసగా స్టేషన్ల పేర్లు అడుగుతూ ఉంటే పక్కాయనకి విసుగువచ్చినట్టుంది …”మీకు ఏమైనా సంస్కృతం వచ్చునా?” అంటూ అడిగారు.
శాస్త్రి ఈ ప్రశ్నకు తెల్లబోయి,” కొంచెం వచ్చులెండి.” అన్నారు పక్కాయన వంక అయోమయంగా చూస్తూ.
“రాసుకోండి ఓ శ్లోకం చెబుతాను. దాన్ని మీరు గుర్తుంచుకుంటే ఇలా ప్రతి స్టేషన్ పేరు పక్క వాళ్లని అడిగే అవసరం రాదు మరి.” అంటూ “బెరాని ఉత ఇందోగు నూకవప్పె చిమః క్రమాత్!
స్టేషన్సు బెబం శాఖాయాం నూక్రాస్యాదితి నిర్ణయః” అని డిక్టేట్ చేశారు.
వెంటనే శాస్త్రి దాన్ని మరొక్క మాట చదువుకొని, బె.. బెజవాడ, రా… రామవరప్పాడు, ని… నిడమానూరు, ఉ… ఉప్పులూరు, ఇ.. ఇందుపల్లి, దో….దోసపాడు, గు…గుడివాడ, నూ… నూజెళ్ల, క…కవుతవరం, వ…వడ్లమన్నాడు, చి…చిలకలపూడి, మ… మచిలీపట్నం; ఇవన్నీ బె. బం. శాఖాయాం … బెజవాడ బందరు లైన్‌లో స్టేషన్స్… స్టేషన్లు” అంటూ గటగటా చెప్పేసి,”అయ్యా! నాలుగో పాదంలో నూ క్రాస్యాత్ అంటే ఏమిటో తెలియలేదండి.” అన్నారట.
పక్కాయన చిరునవ్వు నవ్వి,” కవి హృదయం… విడమర్చి చెబితే గాని తెలియదులెండి!” అన్నారట. వెంకటరమణ శాస్త్రి ఎంతో కుతూహలంతో,” ఏమిటండీ ఆ కవి హృదయం?” అంటూ అడిగారు.
నూ… నూజెళ్లలో క్రా…క్రాసింగ్ స్యాత్…అవుతుంది. ఇది అదనపు సమాచారం అన్నమాట! గుర్తుంచుకోండి!” అంటూ, అంతలోనే తన స్టేషన్ వస్తే, సంచి పుచ్చుకొని దిగిపోయాడట ఆయన.
‘అయ్యో! ఈ చిత్రకవి పేరైనా అడిగాను కాదే!’ అని దువ్వూరి వారు ఎంతో చింతించారట!!
ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు దువ్వూరి వారికి కళా ప్రపూర్ణ ఇచ్చి సత్కరించారు. తర్వాత ఏర్పాటైన ఓ అభినందన సభలో దువ్వూరి వారు మాట్లాడుతూ,” పూర్వం ఛాన్సలర్లు బ్రిటిష్ వారు కళా ప్రపూర్ణ ఇస్తూ ‘కాల ప్రపూర్ణ’ అని పలికేవారు. గౌరవం పొందుతున్న వాళ్లు కూడా బాగా వృద్ధులు. ఈ గౌరవం లభించిన కొద్ది కాలానికి వారు పరమపదం చేరుకునేవారు!” అంటూ చమత్కరించారు.
సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులైన దువ్వూరి వారి స్వీయ చరిత్ర ప్రతి తెలుగువాడు చదవవలసిన గొప్ప పుస్తకం.
వీరు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తమ 78వ ఏట, 1976 మార్చి ఆరో తేదీన దివంగతులు అయ్యారు.
సెల్: 94403 18415

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు