మోదీ ప్రభుత్వ హయాంలో శుద్ధీకరణ జోరుగా సాగుతున్నట్టు ఉంది. మొట్టమొదట బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్‌లోని హల్దాÇనీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖడ్గే ఓ ర్యాలీలో పాల్గొన్న తరవాత కొంతమంది ఆ వేదికను గంగాజలంతో శుద్ధి చేశారు. తాను దళితుడిని కనక ఇలా శుద్ధి చేశారని ఖడ్గే నిండు పార్లమెంటులో ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటన అవాంఛనీయమని కేంద్ర మంత్రి జె.పి.నడ్డా అన్నారు. ఈ విషయమై దర్యాప్తు జరిపిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఆ దర్యాప్తులో ఏం తేలిందో ఇప్పటి దాకా తెలియదు. దర్యాప్తు కొలిక్కి రావడానికి ఎంత కాలం పడ్తుందో కూడా తెలియదు. దళితుల విషయంలో కుల వివక్ష ఇప్పటికీ కొనసాగుతోందని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరమే లేదు. ఈ విషయమై ఎఫ్.ఐ.ఆర్. దాఖలైన జాడ కూడా లేదు. మోదీ హయాంలో కులవివక్ష మాత్రమే ఉందనుకుంటే పొరబడినట్టే. ముస్లింల మీద మోదీ ఏలుబడిలో ఎంత విద్వేషం విరజిమ్మారో అందరికీ తెలుసు. ముస్లింలు అయినందుకు ఇద్దరు మహిళలు ఘోరమైన అవమానాలు భరించవలసి వచ్చింది. ఒక మహిళ అయితే ఉద్యోగమే వదులుకున్నారు. మరో మహిళ మీద బదిలీ వేటు పడింది. ఒక మహిళా ఐ.ఎ.ఎస్. అధికారి బుష్రా బానో ఒక వీడియోలో “ఇన్షా అల్లా”, “సలామాలెకుం”, “జజాక్ అల్లా” అన్నందుకు ఆమెను బదిలీ చేసేశారు. ముస్లింల నోటి వెంట అపశబ్దాలు వెలువడ¦ందుకు బదిలీ వేటు పడింది కానీ సి.వి.ఆనంద్ తెలంగాణా డి.జి.పి.గా పదవీ బాధ్యతలు చేపట్టినప్పుడు ఆ కార్యక్రమం వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగింది. ఇది ఎవరికీ అభ్యంతరకరం కాలేదు. ఎందుకంటే ఆయన హిందువు కనక హిందూ సంప్రదాయాలు అనుసరించడంలో ఎవరికీ బేసబబు ఏమీ కనిపించలేదు. హిందూ లీగల్ ఫండ్ అనే సంస్థ ఫిర్యాదు మేరకే బుష్రా బానోనూ బదిలీ చేశారు. కోల్‌కతాలోని సురేంద్రనాథ్ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్‌గా పని చేస్తున్న మహమ్మది తరన్నుం విద్యార్థుల హాజరీ మీద శ్రద్ధ పెట్టినందుకు ఆమెను విపరీతంగా వేధించారు. పాతికేళ్ల బోధనానుభవం ఉన్న తరన్నుం అవమాన భారంతో రాజీనామా చేసి వెళ్లిపోవలసి వచ్చింది. ఆమె గత 11వ తేదీన రాజీనామ చేశారు. హాజరీ గురించి పట్టుపట్టినందుకు ఆమెను దాదాపు 23 గంటల పాటు ఘెరావ్ చేశారు. ఆందోళనకు దిగిన విద్యార్థులే ఆమె తరఫున రాజీనామా పత్రం రాసేసి బలవంతాన ఆమె సంతకం తీసుకున్నారు. తరన్నుం రాజీనామా చేసి వెళ్లిపోయిన తరవాత సంఘ్ పరివార్‌లో భాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎ.బి.వి.పి.) విద్యార్థులు ఆమె ఆఫీసు గదిని శుద్ధి చేశారు. అక్కడ అగరొత్తులు వెలిగించారు. గంగా జలంతో సంప్రోక్షణ చేశారు. ఆమెను మతం పేరెత్తి దూషించినందు వల్ల ఆమె రెండు రోజులు జబ్బు పడ్డారు. తనను ఎంత అవమానించినా రాజీనామా చేయకూడదని ఆమె మొదట పట్టుదలగానే ఉన్నారు. విపరీతమైన మానసిక క్షోభ అనుభవించారు. తనను చంపినా రాజీనామా చేయకూడదనుకున్నారు. ప్రసిద్ధ కాంగ్రెస్ నాయకుడు సురేంద్రనాథ్ బెనర్జీ పేర ఈ కళాశాలను 1884లో నెలకొల్పారు. మాజీ రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్, బంగ్లాదేశ్ నాయకురాలు ఖాలీదా జియా ఇదే కళాశాలలో చదువుకున్నారు. అయితే ఇప్పుడు ఈ కళాశాల యాజమాన్య కమిటీకి బీజేపీ శాసనసభ్యుడు కౌస్తవ్ బాగ్చీ అధిపతిగా ఉన్నారు. బీజేపీ నాయకుడు అధ్యక్షుడుగా ఉండడం, తరన్నుంను తరిమేసిన వారు ఎ.బి.వి.పి.కి చెందిన వారు కావడం యాదృచ్చికం కాదు. నిబంధనల ప్రకారం న్యాయ శాస్త్ర విద్యార్థులకు 65 శాతం హాజరీ ఉండాలి లేకపోతే వారిని సెమిస్టర్ పరీక్షలకు అనుమతించరు. కొంతమంది విద్యార్థులకు నిబంధనల ప్రకారం అవసరమైన హాజరీ లేదు. ఎనిమిదవ సెమిస్టర్ పరీక్షలు వచ్చే 29వ తేదీన జరగనున్నాయి. 65 శాతం హాజరీ ఉంటేనే పరీక్షలకు హాజరు కానిస్తామని తరన్నుం చెప్పారు. ఇది కొందరు విద్యార్థులకు నచ్చలేదు. ఒక వర్గం విద్యార్థులు ఇతరులను తరగతులకు హాజరుకానివ్వడం లేదని, అదే సమయంలో లేనిపోని కోర్కెలు కోరుతున్నారని, తాను ప్రభుత్వోద్యోగిని కనక నిబంధనల ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నించానని తరన్నుం చెప్పారు. ఒక ఆలయం లాంటిది అపవిత్రం అయిపోయింది అనుకున్నప్పుడు సంప్రోక్షణ నిర్వహిస్తారు. అదీ శుద్ధీకరణే. రాజ్యాంగంలోని 17వ అధికరణం అంటరానితనాన్ని నిషేధించింది. కానీ కుల వివక్ష అంతరించిన ఆనవాళ్లే లేవు. ఖడ్గే విషయంలో అది నూటికి నూరుపాళ్లు కులవివక్షే. అంతరానితనం పాటించడమే. బుష్రా బానో, తరన్నుం విషయంలో అది కులవివక్ష కాకపోయినా అంతకన్నా ప్రమాదకరమైన మత విద్వేషమే. మోదీ హయాంలో పెచ్చరిల్లిపోయిన ముస్లిం విద్వేషం నేపథ్యంలో ముస్లింల మీద ఇలాంటి దురాగతాలు ఎంత మాత్రం ఆశ్చర్యం కలిగించవు. సంఘ్ పరివార్‌కు, ఇతర హిందుత్వ వర్గాలకు అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘాలు ఈ విద్వేషాన్ని ఆచరణలో అమలుచేస్తున్నాయి. నిజానికి సురేంద్రనాథ్ కళాశాలలో ఎ.బి.వి.పి.కి శాఖ ఏదీ లేదు. కానీ కళాశాలలో ఆ ఒక్క విద్యార్థి సంఘ పతాకమే రెపరెపలాడుతూ ఉంటుంది. “తరన్నుం ముఖం చూడడం మాకు ఇష్టం లేదు. ఆమె రాజీనామా చేయాల్సిందే. ఈ విషయంలో రాజీ ప్రసక్తే లేదు” అని ఓ విద్యార్థి నాయకుడు ఖరాఖండీగా చెప్పారు. తనను వేధించడం వెనక ఎవరి హస్తం ఉందో తనకు తెలుసు కానీ వారి పేర్లు చెప్పనని, వారి మీద పోలీసులకు ఫిర్యాదు కూడా చేయనని తరన్నుం అన్నారంటే ఆమె ఎంతటి వ్యధ అనుభవించారో అర్థం చేసుకోవచ్చు. తనను వేధించిన వారు కూడా తన పిల్లల్లాంటి వారేనని ఆమె అన్నారు. తరన్నుం బలవంతంగా సంతకం చేసిన రాజీనామా లేఖ చెల్లదని కూడా కౌస్తవ్ బాగ్చీ చెప్పలేదు. ఆ లేఖను ఉన్నత విద్యా శాఖకు పంపించారట. తరన్నుం మీద విద్యార్థుల ఫిర్యాదులను కూడా పంపించారట. ఇంతకీ సురేంద్ర కళాశాలకు ప్రస్తుతం వైస్ ప్రిన్సిపల్ ఉన్నారో లేదో స్పష్టంగా తెలియదు. కరోనా తరవాత చాలా మంది విద్యార్థులు తరగతులకు హాజరు కాకుండా ఇతర పనుల్లో నిమగ్నమై ఉన్నారని పశ్చిమ బెంగాల్ కళాశాల, విద్యార్థి అధ్యాపకుల సంఘం కార్యదర్శి నిత్య కుమార్ చెప్తున్నారు. తరగతులకు హాజరు కాకపోయినా పరీక్షలు రాయడానికి అనుమతించాలన్న మాట. ఈ అరాచకానికి మునుపు అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కారణమన్న ఆరోపణలున్నాయి. అవి నిజమే అనుకున్నా ముఖ్యమంత్రిగా ఉన్న సువేందు అధికారి పరిస్థితిని ఎందుకు చక్కదిద్ద లేదో! కుల వివక్షను మత వివక్ష మించిపోయింది.


