Homeవిశ్లేషణసమాజాన్ని కథగా మలిచిన వాసిరెడ్డి నారాయణరావు

సమాజాన్ని కథగా మలిచిన వాసిరెడ్డి నారాయణరావు

- Advertisement -

కె.శరచ్చంద్ర జ్యోతిశ్రీ

తరుణ స్వాతంత్ర్య భారతదేశంలో సామాజిక జీవితం, పేదలపై జరుగుతున్న దోపిడీ, పీడన, రాజకీయ ఎత్తుగడలు, మనుషుల అమాయకత్వం వంటి అంశాలను తన కథల్లో సజీవంగా పొందుపరిచిన వ్యక్తి. కథా అభిమానుల ఆదరణ, సాహితీ విమర్శకుల ప్రశంసలను అందుకున్న జీవము, జవము ఉన్న కథలు చెప్పిన కథకుడు, నవలాకారుడు. ఆయన రచనలు నాటి తెలుగు సమాజానికి అద్దం పట్టాయి. ఆ జీవభాషలోంచి సామెతలు, పలుకుబడులు గుభాళిస్తుంటాయి. “తెలుగు సాహిత్యాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శాసించి, రక్షించిన” కాలప్రభావం లోంచి వచ్చిన కథలు వారివి. ఎవరీ కథకుడు ? వనశ్రీ, నరేంద్ర, రహింషా వంటి అనేక నామధేయాలతో రచనలు చేసిన నారాయణరావు. అసలు పేరు వాసిరెడ్డి నారాయణరావు. సుప్రసిద్ధ రచయిత వాసిరెడ్డి సీతాదేవికి సోదరుడు. ఉత్తమ కథకుడుగా, నవలాకారుడుగా వాసికెకాక్కరు. హైదరాబాద్‌లో నివసిస్తున్న ఆయన ఆగస్టు 21న వయోభారంతో కన్నుమూశారు. ఈతరం కోసం కథాస్రవంతి శీర్షికలో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు జిల్లా శాఖ 2023లో వాసిరెడ్డి సీతాదేవి కథల్లోంచి ఎంపిక చేసిన 10 కథలతో, 2024లో నారాయణరావు కథల్లోంచి ఎంపిక చేసిన 11 కథలతో కథా సంపుటాలను ప్రచురించింది. వాసిరెడ్డి నారాయణరావు గుంటూరు జిల్లా చేబ్రోలులో 1929లో నారాయణరావు రైతు కుటుంబంలో పుట్టారు. తల్లి రంగనాయకమ్మ. తండ్రి రాఘవయ్య. గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివిన ఆయన, మద్రాసులో డిగ్రీతో పాటు ఫిషరీస్ టెక్నాలజీ అండ్ నావిగేషన్ డిప్లొమా పూర్తి చేశారు. పిన్న వయసులోనే మత్స్యశాఖలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేసి, అనంతరం గ్రామీణ అభివృద్ధి శాఖ (డి.ఆర్.డి.ఏ) ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఉద్యోగ విరమణ చేశారు. నారాయణరావుపై హేతువాద ఉద్యమ ప్రభావం ఉంది. మార్క్సిజాన్ని అభిమానించారు.
ఒక వైచిత్రి : వాసిరెడ్డి నారాయణరావు కథా రచన ప్రారంభ సందర్భం ఒక వైచిత్రితో కూడుకుంది. రెండు పదుల వయసులో ఒక రచయితను ఆటపట్టించడానికి రాసిన కథ ఆయన్ను కథకుడిగా మార్చింది. 1951లో ‘తెలుగు స్వతంత్ర’లో ప్రచురితమైన ‘తీగతెచ్చిన సంపద’ ఆయన తొలి కథ. తర్వాతి ఐదేళ్లలో దాదాపు 60 కథలు రాశారు. ఒక పత్రికలో అది కూడా ఒకే సంచికలో ఒక రచయితకు సంబంధించిన రెండు కథలు ప్రచురితం కావడం అరుదైన విషయం. ఆయన రచనా ప్రతిభకు ఇదొక ఉదాహరణ. ఒకే పత్రిక సంచికలో వనశ్రీ, రహింషా పేర్లతో ఆయన రెండు కథలు ప్రచురితమయ్యాయి. ఆనాడు చలం, కొడవటిగంటి కుటుంబరావు రచనల ప్రభావానికి లోనుగాని రచయితలు అరుదు. ఐతేû నారాయణరావు ఆ ప్రభావాలను అధిగమించి తనదైన రచనా శైలిని ఏర్పరుచుకున్నారు. నారాయణరావుకు కుటుంబరావుతో వ్యక్తిగత సాన్నిహిత్యం ఉన్నప్పటికీ తనదైన సాహితీ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించుకునేందుకు కృషి చేశారు. వ్యంగ్యం, వెటకారం నారాయణరావు రచనల్లో కనిపించే సహజ లక్షణాలు. నారాయణరావు కథ నడుస్తూ ఉంటుంది. మధ్యలో ఆగి ఉపన్యసించదు. వ్యాఖ్యానించదు. వివరణ ఇవ్వదు. మరేం ఉంటుంది ? సమాజం ఉంటుంది. వాస్తవిక జీవితం ఉంటుంది లేదా అందులో ఏదో ఒక తునక ఉంటుంది. మనిషి అమాయకత్వం ఉంటుంది. దానిని సొమ్ముచేసుకునే కాపట్యం పొంచి ఉంటుంది. జిత్తులమారితనం ఉంటుంది. రాజకీయ ఎత్తులకు పైఎత్తులూ ఉంటాయి. అన్నింటికీ మించి తన రచనల్లో అంతర్లీనంగా మానవీయతకు పెద్దపీట వేశారు రచయిత. కథ చదివితే కన్నీళ్లేం కాలవగట్టవు. కానీ కళ్లు చెమర్చకుండా ఉండవు. నవ్వు రాకుండా ఉండదు. దానివెనుక గూడుÅ£ట్టుకున్న విషాదం లోలోపల ధ్వనిస్తుంది. మొత్తంగా వ్యవస్థ స్వభావం కథల్లో ప్రస్ఫుటం అవుతుంది.
అయిదు కథల నవల “కురుక్షేత్రం” : 1959వ సంవత్సరం ఫిబ్రవరిలో ‘జీవన భృతి’ని పెంచాలని ఎన్.జి.ఓ.లు సమ్మె చేశారు. ఆ సమ్మె 56 రోజులు సాగింది. ఎన్.జి.ఓ.ల జీవన భృతిని ప్రభుత్వం అర్థ రూపాయి నుండి 5రూపాయిలకు పెంచింది. కానీ ఎన్.జి.ఓ.లు సంఘటితమయ్యారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్.జి.ఓ. సంఘం జాతీయ మహాసభలు జరపాలని నిర్ణయించింది. ప్రగతి ప్రచురణ సంయుక్త సంపాదకుడు పరుచూరి హనుమంతరావు. నారాయణరావుగారితో “ఎన్.జి.ఓ. కథలను నవలగా ముద్రించి మహాసభలకు విడుదల చేస్తే బాగుంటుంద”న్నారు నారాయణరావుగారితో. 1954 ఆంధ్రపత్రికలో వారసత్వం, స్వయంవరం అనే రెండు కథలు అచ్చయ్యాయి. ఆ తర్వాత ఆరేళ్లకి అంటే 1960లో నవోదయ వారపత్రికలో ప్రవేశం, నిర్వహణ, నిష్క్రమణ అనే మూడు కథలు ప్రచురితమయ్యాయి.“ఎపðడో రాసిన కథలు కలిపి అచ్చుగుద్ది నవల అంటే చెల్లుబాటవుతుందా?” నారాయణరావు సందేహం. మద్రాసులో ఉన్న కొడవటిగంటి కుటుంబరావు అభిప్రాయం కోసం రాశారు. “ఛార్లెస్ డికెన్స్‌ ‘ది పికిÇక్ పేపర్స్‌’ను నవల అనే అంటున్నారు. ‘పికిÇక్ పేపర్స్‌’ నవల అయినప్పుడు మీ ‘కురుక్షేత్రం’ కూడా నవలే.” అన్నారు కొడవటిగంటి. అంతేకాదు, ఆ నవలకు “ప్రస్తావన” కూడా రాసి పంపారు. “కురుక్షేత్రం నవల ఈ కాలపు నవలా సాహిత్యంలో విశిష్ట స్థానం సంపాదించుకుంటుందని నాకు గట్టి నమ్మకం. ఇందులో వాస్తవికత నూటికి నూరు పాళ్లు ఉట్టిపడుతుంది. ఇందులో చిత్రించిన వ్యక్తి ఈనాటి సమాజంలో ఒక విస్తృత వర్గానికి ప్రతినిధి. ఈ రెండు విషయాలలోనూ ఈ నవల నేను చదివిన అన్ని నవలలకన్నా ముందున్నది. భవిష్యత్తులో రాబోయే అనేక నవలలకు ఇది ఒరవడిగా ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.” అని ప్రస్తావనలో పేర్కొన్నారు కొడవటిగంటి. డా॥వాసిరెడ్డి సీతాదేవి ఫౌండేషన్‌ను నారాయణరావు స్థాపించారు. ఆమె సమగ్ర సాహిత్యాన్ని 16 సంపుటాలుగా ప్రచురించారు. వాసిరెడ్డి సీతాదేవి గ్రంథాలయాన్ని స్థాపించారు. రాష్ట్రవ్యాప్తంగా అనేకానేక సాహిత్య కార్యక్రమాలను ఆ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించారు. వివిధ సాహిత్య సాంస్కృతిక కార్యకలాపాలకు అండగా నిలిచారు.
చరమాంకం : వాసిరెడ్డి సీతాదేవి సుప్రసిద్ధ రచన మట్టిమనిషి నవలను ప్రసిద్ధ నాటక రచయిత, అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ నాటకీకరించారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ప్రేక్షకుల విశేష ఆదరణ పొందిన ఆ నాటకాన్ని పుస్తకంగా ప్రచురించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆగస్టు 21న పుస్తక ఆవిష్కరణ సభ ఏర్పాట్లు జరిగాయి. ఈ సందర్భంగా 20న ఆ నాటక ప్రతిని వల్లూరి శివప్రసాద్ నుండి నారాయణరావు అందుకొని చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఆ ఆవిష్కరణ సభ బాగా జరుగుతుందనే ఆకాంక్షను, అభినందనలను వ్యక్తం చేశారు. అయితే ఆ సభలోనే నారాయణరావు మృతికి సంతాపం ప్రకటించాల్సి రావటం ఒక విషాదం. హైదరాబాద్‌లో ఆగస్టు 30న కుటుంబ సభ్యులు, సాహితీ కుటుంబ బంధువుల మధ్య వాసిరెడ్డి నారాయణ సంస్మరణ సభ జరగనుంది.
( ఈ నెల 30న సంస్మరణ సభ సందర్భంగా… )

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు