విశాలాంధ్ర`మంగళగిరి/ హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనంలో అవకతవకలపై తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం విసృత్తంగా సోదాలు నిర్వహించింది. మంగళగిరి మండలం చినకాకానిలోని హాయ్‌ల్యాండ్ రిసార్ట్లోను, ఏపీపీఎస్సీ మాజీ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు, క్యామ్‌సైన్ మీడియా ఎండీ పి.మధుసూదనరావుకు సంబంధించిన ప్రాంగణాలతో పాటు మూల్యాంకన ప్రక్రియతో సంబంధం ఉన్న సంస్థలు, వ్యక్తుల ప్రాంగణాల్లో ఏడు చోట్ల తనిఖీలు జరిగాయి. మూల్యాంకన పనులకు జరిగిన చెల్లింపులు, సంబంధిత ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు సాగుతోంది. జవాబు పత్రాలను రిసార్ట్‌లో 84 రోజుల పాటు ఉంచి, అర్హత లేని 66 మందితో ముందుగా నిర్ణయించిన మార్కులను ఓఎంఆర్ పత్రాల్లో నమోదు చేయించారన్నది సిట్ దర్యాప్తులోని ఆరోపణ. ఈ వ్యవహారంలో రూ.1.14 కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగమైందని సమాచారం. 2025 ఏప్రిల్‌లో విజయవాడ సూర్యారావుపేట పోలీసు స్టేషన్లో నమోదయిన కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తు చేపట్టింది. కాగా హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సమష్టి నిర్ణయంతో మాన్యువల్ మూల్యాంకనం చేపట్టామని ఆంజనేయులు తరపు వాదనగా ఉంది. ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది. హాయ్‌ల్యాండ్‌లో రోజంతా విచారణ చేపట్టిన అధికారులు మీడియాకు ఎటువంటి వివరాలు అధికారికంగా వెల్లడించలేదు. గత ప్రభుత్వ ప్రాజెక్టు పనుల కోసం క్యామ్ షైన్ సంస్థ నెల రోజుల పాటు గదులు అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా అధికారుల అభ్యర్థన మేరకే గదులు ఇచ్చామని హాయ్‌ల్యాండ్ యాజమాన్యం తెలిపినట్లు తెలుస్తోంది. కరోనా సమయంలో రెస్టారెంట్ మూసివేసి ఉన్నా గదులు ఇవ్వాలని కోరడంతో అద్దెకు ఇచ్చామని, ఆహార పదార్థాలు సైతం బయట నుంచి తెప్పించుకున్నారని సమాచారం. ఈ వ్యవహారంలో క్యామ్ షైన్ సంస్థ కార్యకలాపాలు, గదుల అద్దె వెనుక ఉద్దేశం, అధికారుల పాత్రపై విచారణలో స్పష్టత రావాల్సి ఉంది. ఈ వ్యవహారంపై పీఎస్ఆర్ ఆంజనేయులు, క్యామ్‌సైన్ మీడియా డైరెక్టర్ మధుసూదనరావును గతంలోనే అరెస్టు చేశారు. సిట్ దర్యాప్తు నేపథ్యంలో 2026 అక్టోబరులో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసి తాజాగా సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.
గ్రూప్-1 మూల్యాంకన కేసుఈడీ సోదాలు
- Advertisement -
RELATED ARTICLES


