న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో కొనసాగుతున్న నాయకత్వ వివాదం నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) శుక్రవారం రెండు ప్రత్యర్థి వర్గాలకు కొత్త పేర్లు, ఎన్నికల గుర్తులు కేటాయించింది. అక్టోబర్ 6న జరగనున్న ఉప ఎన్నికలకు ముందు రోజు రెండు వర్గాలు ‘ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’ పేరును, ‘పూలు-గడ్డి’ గుర్తును ఉపయోగించరాదని ఈసీ ఆదేశించిన విషయం తెలిసిందే. మమతా బెనర్జీ నేతృత్వంలోని వర్గానికి ‘మమతా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’ అనే పేరుతో పాటు ‘ఫుట్‌బాల్ ప్లేయర్’ ఎన్నికల గుర్తు కేటాయించింది. ఈ వర్గాన్ని పశ్చిమ బెంగాల్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా ఈసీ పరిగణించనుంది. ఇక అరూప్ రాయ్ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గానికి ‘డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్’ అనే పేరు, కవర్ (ఎన్వలప్) గుర్తు కేటాయించింది. ఈ వర్గాన్నీ పశ్చిమ బెంగాల్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా పరిగణించనున్నట్లు ఈసీ తెలిపింది. పార్టీ సంస్థాగత నియంత్రణ, గుర్తింపుపై వివాదానికి తుది పరిష్కారం అయ్యే వరకు రెండు వర్గాలు ‘ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’ పేరు లేదా రిజర్వ్ చేసిన ‘పూలు-గడ్డి’ గుర్తు ఉపయోగించరాదని ఈసీ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిర్వాచన్ సదన్‌లో రెండు వర్గాల వాదనలు విన్న అనంతరం ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉప ఎన్నికల కోసం రెండు వర్గాలు మూడు పేర్లు, మూడు ఉచిత ఎన్నికల గుర్తులను సూచించాలని ఈసీ ఆదేశించింది. అక్టోబర్ 6న నందిగ్రామ్, రెజినగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ వివాదం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. రెండు వర్గాలూ తమ అభ్యర్థులను ప్రకటించి…టీఎంసీ సంప్రదాయ గుర్తుపై హక్కు కోరాయి. నందిగ్రామ్ స్థానానికి మమతా వర్గం సంచితా ప్రధాన్ (డే), రెజినగర్కు రబియుల్ ఆలమ్ చౌదరీని అభ్యర్థులుగా ప్రకటించింది. రెండు స్థానాలకు అక్టోబర్ 6న పోలింగ్ జరగనుండగా, అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
బీజేపీ-ఈసీ కుట్రలు: రాహుల్ గాంధీ
ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (ఏఐటీసీ) పార్టీ పేరు, ‘పూలు-గడ్డి’ ఎన్నికల గుర్తును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకున్న నిర్ణయంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. బీజేపీ, ఈసీ కలిసి ప్రతిపక్ష పార్టీలను చీల్చేందుకు పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో చేసిన పోస్టులో రాహుల్ గాంధీ పేర్కొన్నారు. శివసేన, ఎన్సీపీ తర్వాత ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ విషయంలోనూ అదే విధానం కనిపిస్తోందని పేర్కొన్నారు. పార్టీని చీల్చి, అనంతరం ఎన్నికల గుర్తు తీసుకోవడం జరుగు తోందని ఆరోపించారు. ‘ఓట్ల దోపిడీ, ప్రభుత్వ దోపిడీ, ఇప్పుడు పార్టీ దోపిడీ.. ఇవే భారత ప్రజాస్వామ్య పతనానికి చిహ్నాలుగా మారాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఓటర్లను రక్షించాల్సిన రాజ్యాంగ బాధ్యతను ఈసీ నిర్వర్తించకుండా, ప్రజల తీర్పును మార్చే శక్తులకు సహకరిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ పోరాటం కేవలం మమతా బెనర్జీది మాత్రమే కాదని, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు కోరుకునే ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి ఓటరు కు సంబంధించినదని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈసీ నిర్ణయంపై స్పందించారు. ‘ఇలా ఎన్నికల్లో గెలుస్తారా?’ అని ఎక్స్‌లో ప్రశ్నించారు.
తృణమూల్కుకొత్త పేర్లు, గుర్తులు
- Advertisement -


