న్యూదిల్లీ: వాల్‌మార్ట్ నేతృత్వంలోని ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే పబ్లిక్ ఇష్యూకు మార్గం సుగమమైంది. ఈ ఐపీఓకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఆమోదం లభించింది. సెబీ సూచించిన మార్పులు, చేర్పులకు అనుగుణంగా అప్‌డేటెడ్ డీహెచఆర్‌పీని ఫోన్‌పే త్వరలో సమర్పించనుంది. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఐపీఓ త్వరలోనే పట్టాలెక్కనుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఫోన్‌పే ఐపీఓ పూర్తి ఆఫర్ ఫర్ సేల్ రూపంలో జరగనుంది. ప్రస్తుత వాటాదారులు తమ వాటాలను పబ్లిక్ ఇష్యూ ద్వారా విక్రయించనున్నారు. తాజా ఇష్యూ ఉండబోదని తెలుస్తోంది. అంటే కంపెనీకి పబ్లిక్ ఇష్యూ ద్వారా ఎలాంటి నిధులు రావు. ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ మార్కెట్‌లో ఫోన్‌పే హవా నడుస్తోంది. మొత్తం యూపీఐ లావాదేవీల్లో 45 శాతం ఈ యాప్ ద్వారానే జరుగుతున్నాయి. 2025 డిసెంబర్‌లో మొత్తం 9.8 బిలియన్ లావాదేవీలు ప్రాసెస్ చేసిందని ఎన్‌పీసీఐ డేటా చెబుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.7115 కోట్ల ఆదాయం పొందింది. ఐపీఓ సైజ్, ధరల శ్రేణి వంటి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఐపీఓ సుమారు రూ.12 వేల కోట్లు ఉంటుందని అంచనా.


