న్యూదిల్లీ: ఉత్తర భారతంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల్లోకి ఇకపై హిందువులను మాత్రమే అనుమతించనున్నారు. ఈ ఆలయాల్లోకి హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధించాలని బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ ప్రతిపాదించింది. త్వరలో జరగబోయే ఆలయ కమిటీ బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనలను ఆమోదించనున్నారు. ఈ విషయాన్ని బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ హేమంత్ ద్వివేది ధ్రువీకరించారు. ఈ రెండు ఆలయాలతో పాటు కమిటీ పరిధిలోకి వచ్చే మిగతా దేవాలయాల్లోనూ ఇదే ప్రవేశ నిబంధన వర్తించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే గంగోత్రి ధామ్‌లోకి హిందూయేతరులు ప్రవేశించకుండా నిషేధం విధించారు. ఈ మేరకు ఆదివారం జరిగిన శ్రీ గంగోత్రి టెంపుల్ కమిటీ సమావేశంలో దీనిపై ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ ప్రవేశాలపైనా ప్రతిపాదనలు వచ్చాయి. ఈ కొత్త నిబంధనలు ఎప్పటినుంచి అమల్లోకి తెస్తారన్న విషయాన్ని ఇంకా నిర్ణయించ లేదు. ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ యాత్రలో భాగమైన ఈ ఆలయాలను ఏటా లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారు. శీతాకాలం నేపథ్యంలో ఆరు నెలల పాటు మూసి ఉంచిన బద్రీనాథ్ ఆలయ ద్వారాలను ఏప్రిల్ 23న తెరవనున్నారు. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు అక్షయ తృతీయను పురస్కరించుకొని ఏప్రిల్ 19న తెరుచుకోనున్నాయి.


