
నల్లమోతువారిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం
విశాలాంధ్ర – బాపట్ల : విశాలాంధ్ర బాపట్ల జిల్లా బ్యూరో, సీనియర్ జర్నలిస్టు కాగిత ప్రశాంత్ రాజ్(38) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం విశాలాంధ్ర కుటుంబాన్ని, జర్నలిస్టు లోకాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. ప్రశాంత్‌కు భార్య వసంతకుమారి, కుమారుడు దేవరాజు, కుమార్తె పెర్రీ గ్లోరియా ఉన్నారు. సోమవారం రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వెళుతుండగా నల్లమోతువారి పాలెం వద్ద వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ ప్రశాంత్ రాజ్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, తోటి వాహనదారులు వెంటనే స్పందించి 108 వాహనం ద్వారా బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి… ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ప్రశాంత్‌రాజ్‌ను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో ప్రశాంత్‌రాజ్‌ను అంబులెన్స్‌లో తీసుకెళుతుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచారు. బాపట్ల ప్రభుత్వాసుపత్రిలో ప్రశాంత్‌రాజ్‌కు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని కర్లపాలెం మండలం నర్రావారిపాలెం తరలించారు. బాపట్ల నుంచి నర్రావారిపాలెం వరకు జర్నలిస్టులు, బంధుమిత్రులు భారీ ర్యాలీగా తీసుకెళ్లారు. ప్రశాంత్ అమర్ రహే… ప్రశాంత్‌కు జోహార్ అంటూ నినాదాలు చేశారు. ముందుగా బాపట్ల సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆర్‌డీఓ పి.గ్లోరియా, తహసీల్దార్ నసీమా…ప్రశాంత్ భౌతికకాయంపై పూలదండలు వేసి… ఘనంగా నివాళి అర్పించారు. మంగళవారం సాయంత్రం స్వగ్రామంలో అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. నిత్యం ప్రజాసమస్యలే లక్ష్యంగా నిర్భయంగా వార్తలు రాసిన ప్రశాంత్ రాజ్ అకాల మృతి మీడియా రంగానికి తీరని లోటుగా మారింది. ప్రజల గొంతుకగా బాధితుల పక్షాన నిలబడి పనిచేసిన ఆయన సేవలను సహచరులు కన్నీటి నివాళులతో గుర్తుచేసుకున్నారు. విశాలాంధ్ర జనరల్ మేనేజర్ పి.హరినాథ్ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి సింగరకొండ, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బత్తుల సోమేలు పూలదండలతో నివాళి అర్పించారు. ప్రశాంత్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అధికారులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఏపీయూడబ్ల్యూజే సంతాపం
బాపట్ల జిల్లా విశాలాంధ్ర బ్యూరో ప్రశాంత్ రాజ్ మృతికి ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చావా రవి, బాపట్ల జిల్లా అధ్యక్షుడు రాంబాబు, కార్యదర్శి శ్రీనివాసరావు సంతాపం తెలిపారు. కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటించారు. అంతిమయాత్రలో పాల్గొన్నారు.


