విశాలాంధ్ర – చంద్రగిరి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం నారావారిపల్లెలో మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి ఆనవాయితీగా, కోలాహలంగా సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు. ఉదయం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ముఖ్యమంత్రి వెంట జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఉన్నారు. సంక్రాంతి పర్వదినాలలో యేటా ఆనవాయితీగా నిర్వహించే ముగ్గుల పోటీలకు మహిళలు పోటీపడి రంగురంగుల ముగ్గులు వేసి తమ ప్రతిభ ప్రదర్శించారు. పూర్ణకుంభం, హరిదాసు చిత్రాలు వంటి సంక్రాంతి ప్రతీకలు ముగ్గుల రూపంలో ఆకర్షణగా నిలిచాయి. చిన్నారుల కోసం వివిధ రకాల గ్రామీణ క్రీడల పోటీలు నిర్వహించారు. పిల్లల కోసం పొటాటో గ్యాదరింగ్, బెలూన్ గేమ్, గిన్నీ బ్యాగ్ వాకింగ్, మ్యూజికల్ చెయర్స్, లెమన్ ఇన్ స్పూన్, టెయిల్ పికింగ్, సెల్ఫ్ డిఫెన్స్ వంటి ఆటలు నిర్వహించారు. క్రీడా ప్రాంగణంలో పోటీలను చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్, నారా బ్రాహ్మిణి, ఎంపీ భరత్, ఆయన సతీమణి తేజస్విని, ఎమ్మెల్యే పులివర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, శాప్ చైర్మన్ అమ్మినేని రవినాయుడు, తిరుపతి జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తిలకించారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బాలబాలికలకు బహుమతులు ప్రదానం చేశారు. గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ పండుగ వాతావరణం ఉట్టిపడిరది.


