కేంద్ర కార్మిక సంఘాల పిలుపు
న్యూదిల్లీ: బానిసత్వం దిశగా దేశం అడుగులు వేస్తోందని, లేబర్ కోడ్ల అమలులో భావితరాల ఆశలు, ఆకాంక్షలు ఆవిరవుతాయని, వినాశకర పరిణామాలు తప్పబోవని కేంద్ర కార్మిక సంఘాలు హెచ్చరించాయి. కార్మిక కోడ్లను తక్షణమే రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. వీటిని అమలు చేయడం శ్రామిక వర్గంపై యుద్ధం ప్రకటించడమే అవుతుందని, దీనికి నిరసనగా కార్మిక`శ్రామిక వర్గం పోరు బాట పట్టాలని పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు (సీటీయూలు) శుక్రవారం ఐక్య ప్రకటన విడుదల చేశాయి. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను కాలరాస్తూ, బానిసత్వంలోకి కార్మికులను నెట్టే విధంగా నాలుగు కోడ్ల అమలునకు కేంద్రం సిద్ధమైందని దుయ్యబట్టాయి. లేబర్ కోడ్ల అమలును వ్యతిరేకిస్తూ ఈనెల 26న రైతులతో కలిసి పోరాటానికి పిలుపునిచ్చాయి. కార్మిక లోకం గర్జన తప్పబోదని సూచించాయి. పోరాటంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, కోడ్ల రద్దునకు బిగ్గరగా డిమాండ్ చేయాలని కార్మిక వర్గానికి ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఎస్ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, ఎల్పీఎఫ్, యూటీయూసీ సంయుక్తంగా పిలుపునిచ్చాయి. కార్మిక వ్యతిరేకయాజమాన్యం అనుకూల లేబర్ కోడ్లను ఏకపక్షంగా రుద్దే ప్రయత్నం... కార్మిక వర్గానికి కేంద్రం చేసిన మోసమని దుయ్యబట్టాయి. సంక్షోభంగా మారుతున్న నిరుద్యోగం, దిగిరాని ద్రవ్యోల్బణం పరిస్థితుల్లో ఇలాంటి నోటిఫికేషన్లు ఇవ్వడం శ్రామికులపై యుద్ధాన్ని ప్రకటించడమేనని వ్యాఖ్యానించాయి. ఆశ్రిత పెట్టుబడిదారులతో కుమ్మక్కై దేశాన్ని బానిసత్వం వైపునకు సర్కారు తీసుకెళుతోందని కార్మిక సంఘాలు విమర్శించాయి. లేబర్ కోడ్లు అమలు చేయొద్దంటూ డిమాండ్ ఉన్నప్పటికీ లెక్కచేయకుండా బీహార్ ఎన్నికల్లో విజయం మత్తులో ఎన్డీయే ప్రభుత్వం జోగుతోందని పేర్కొన్నాయి. ఈనెల 13, 20 తేదీల్లో కార్మిక సంఘాలు చేసిన విజ్ఞప్తులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశాయి. లేబర్ కోడ్లతో పాటు శ్రమ్ శక్తి నీతి2025 రద్దునకు డిమాండ్‌తో ఈనెల 26న తలపెట్టిన ఎస్కేఎం`సీటీయూల ఉమ్మడి పోరు జయప్రదానికి పిలుపునిచ్చాయి. నిరసన తెలిపేందుకు నల్ల బ్యాడీలతో విధులకు హాజరు కావాలని కార్మికులకు సంఘాలు సూచించాయి.
సోమవారం నుంచి గేట్ మీటింగులు, వీధి కూడళ్లలో సమావేశాలు వంటివి యుద్ధప్రాతిపదికన నిర్వహించాలని, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ సంక్షేమాన్ని తుంగలో తొక్కి బానిసత్వంలోకి నెట్టి ప్రయత్నాలను ప్రతిఘటించాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. 20 కేంద్ర కార్మిక చట్టాలను రద్దు చేసి ‘రాక్షస’ కోడ్లను అమలు చేయడాన్ని ఖండిరచాయి. వీటి అమలు కార్మికుల జీవితాలు, జీవనోపాధిని చంపేయడమే అవుతుందని కార్మిక సంఘాలు తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించాయి.


