Homeఇంకా వర్షాభావమే !

ఇంకా వర్షాభావమే !

- Advertisement -

రైతుల్లో నిస్తేజం
. 8 జిల్లాల్లో తక్కువ వర్షపాతం
. 9 జిల్లాల్లో సాధారణం
. సాగుపై ఆసక్తి చూపని అన్నదాతలు
. ఇప్పటికి 3.15 లక్షల ఎకరాల్లోనే విత్తనం

విశాలాంధ్ర – సచివాలయం: ఖరీఫ్‌ సీజన్‌ మొదలై నెల గడిచినా పంటల సాగు సాధారణ విస్తీర్ణంలో 10 శాతం లోపే ఉంది. వర్షాభావ పరిస్థితులే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. దీంతో అధికశాతం రైతుల్లో నిస్తేజం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌ ఒకటో తేదీ నుంచి జులై ఒకటో తేదీ వరకు సాధారణ వర్షపాతం 86.46 మిల్లీమీటర్లు కాగా 76.47 మి.మీ. కురిసింది. లోటు 11.55 శాతం. 26 జిల్లాలుండగా ఎనిమిది జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా అన్నమయ్య జిల్లాలో 54.69 మి.మీ. వర్షం పడిరది. సాధారణం కంటే అధిక వర్షం తొమ్మిది జిల్లాల్లో కురిసింది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఏలూరు జిల్లాలో 70.72 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. మిగిలిన తొమ్మిది జిల్లాల్లో సాధారణ స్థాయిలో వానలు పడ్డాయి. ఈ ఏడాది అనంతపురంలో సాధారణం కంటే ఎక్కువ వర్షం పడిరది. జూన్‌లో ఆ జిల్లాలో మామూలుగా 41.85 మి.మీ. వర్షం పడాల్సి ఉండగా 54.73 మి.మీ. పడిరది. 2024 ఖరీఫ్‌లో పత్తి సాధారణ విస్తీర్ణం 14.47 లక్షల ఎకరాలుగా నిర్ణయించగా 9. 87 లక్షల ఎకరాల్లోనే సాగైంది. అంటే 32 శాతం తగ్గింది. ఈ ఏడాది 11.61 లక్షల ఎకరాలు సాధారణ విస్తీర్ణంగా అంచనా వేయగా ఇప్ప టికి 3.15 లక్షల ఎకరాల్లోనే విత్తనం వేశారు. ఏటా ఇప్పటికే మిరప విత్తనాలను కొనుగోలు చేయడమో, నర్సరీలకు చెప్పడమో చేసేవారు. ఈ ఏడాది 90 శాతం రైతుల్లో కదలిక లేదు. 2023-24లో మిరప ధరలు తగ్గడంతో గతేడాది ఖరీఫ్‌ లోనే మిరప సాగు బాగా తగ్గింది. సాధారణ విస్తీర్ణం 4.77 లక్షల ఎకరాలైతే 3.60 లక్షల ఎకరాలకే పరిమితమైంది. సాగు నిస్తేజంగా మారడంతో పొలాల కౌలు రేట్లు తగ్గాయి. మిరప సాగు చేసే పొలాలకు సాగునీటి వసతి ఆధారంగా ఎకరాకు రూ.35 వేల నుంచి రూ. 40 వేల వరకు కౌలు ఉంటుంది. ఈ ఏడాది రూ.30 వేలకే ఇస్తామన్నా ఎవరూ ఆసక్తి చూపడం లేదు. పత్తి పొలాలకు గతంలో రూ.15 వేలు ఉన్న కౌలు ప్రస్తుతం రూ.10 వేలకు తగ్గింది. ఖరీఫ్‌ ప్రారంభంలోనే రాష్ట్రాన్ని వర్షాభావం వెంటాడుతోంది. జూన్‌లో ఎనిమిది జిల్లాల్లో సాధారణస్థాయి కంటే తక్కువ వర్షం నమోదైంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, దక్షిణాంధ్రలో పల్నాడు, నెల్లూరు, రాయలసీమలో అనంతపురం, కర్నూలు, నంద్యాల మినహా మిగిలిన జిల్లాల్లో వర్షాభావం నెలకొంది. దీంతో ఆయా ప్రాంతాల్లో పంటల సేద్యం దాదాపు నిలిచిపోయింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఎప్పటి కంటే కాస్తంత ముందుగా మే 26, 27 తేదీల్లో రాష్ట్రాన్ని పలకరించడంతో ఖరీఫ్‌ సాగుపై రైతుల్లో ఆశలు చిగురించాయి. అంతలోనే రుతుపవనాలు సుదీర్ఘకాలం ముఖంచాటేయడంతో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తిరిగి వారం రోజులుగా రుతుపవనాల్లో కదలిక రావడంతోపాటు అల్పపీడనం, ఉపరితల ఆవర్తనాల వలన కొద్దిపాటి వానలు కురుస్తున్నాయి. కాగా రుతుపవనాల ఆగమనంతో సీజన్‌ మొదటి నెల జూన్‌ లో సాధారణ వర్షం పడిరది. ఎనిమిది జిల్లాల్లో తీవ్ర వర్షాభావం నెలకొంది. అల్లూరి, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల సగటు లెక్కల ప్రకారం వర్షాభావానికి దగ్గరగా ఉన్నాయి.
గిట్టుబాటు ధరలపై ప్రభుత్వం నమ్మకం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటేనే సాగు పుంజుకుంటుందనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. పత్తి, మిరప, కంది తదితర పంటలు వేసినా తీరా దిగుబడులు వచ్చే సరికి ధరల్లేకపోతే మళ్లీ నష్టాలే అనే భావన రైతుల్లో నెలకొంది.పెట్టుబడి తక్కువ కావడంతో కంది వేసేందుకు సిద్ధమవుతున్నారు. మొక్కజొన్నకు మొగ్గు చూపిస్తున్నారు. పల్నాడులో విత్తన మొక్కజొన్న సాగు పెరుగుతోంది. ఎన్టీఆర్‌ జిల్లాలో యూకలిప్టస్‌, సుబాబుల్‌ నాటేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు