గోల్కొండ బాబూరావు
దేశంలో మానవ వనరులను అభివృద్ధి చేయడంలో విద్యావిధానం కీలకపాత్ర పోషిస్తుంది. విద్యార్థుల నైపుణ్యాలు, జీవన ప్రమాణాలు మెరుగు పరుస్తుంది. దేశాభివృద్ధి… సామాజిక ప్రగతికి విద్య దోహదపడుతుంది. విద్య అందరికీ అందుబాటులో ఉంచడం, విద్యలో నాణ్యత మెరుగుపరచడం, సృజనాత్మక ఆలోచనలు ప్రోత్సహించడం, విద్యలో సాంకేతికత ప్రవేశపెట్టడం, భారతీయ సంస్కృతిని కాపాడడం దీని ముఖ్య విధి. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 77 ఏళ్లు గడిచినా విద్యావ్యవస్థ నిద్రాణంలోనే ఉంది. 1976లో రాజ్యాంగ 42వ సవరణనుసరించి విద్య ఉమ్మడి జాబితాలో చేర్చినా… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంపై నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నాయి. దీనికి ముందు విద్యారంగం ఆయా రాష్ట్రాల పరిధిలోనే ఉండేది. విద్య లేనిదే ఏ దేశమూ అభివృద్ధి చెందదు. 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా చిన్నారులకు విద్యను ప్రాథమిక హక్కుగా చేశారు. రాజ్యాంగంలో విద్యాహక్కును ఆర్టికల్ 21ఏలో పొందుపరిచారు. 6 నుంచి 14 ఏళ్ల వయసు గల బాలబాలికలకు ఉచిత… నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలని ఈ రాజ్యాంగ సవరణ పేర్కొంది. 2009లో చేసిన విద్యాహక్కు చట్టం ద్వారా దీనిని మరింత బలోపేతం చేశారు. చట్టంలోని సెక్షన్ 29 ఎఫ్ ప్రకారం వీలైనంత వరకు పిల్లలకు మాతృభాషలో బోధించాలని సూచించారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విద్యా విధానాల అమలులో కొంత నిర్లిప్తత ఏర్పడడంతో విద్యావ్యవస్థ అనుకున్న ఫలితాలను సాధించడంలో దశాబ్దాలుగా విఫలం చెందుతూనే ఉంది. విద్యారంగానికి అరకొర బడ్జెట్, ప్రధానంగా నూతన విద్యావిధానాలు అనుసరించకపోవడం, బోధనా పద్ధతుల్లో వెనుకబడి ఉండడం, నూతన సాంకేతిక పరిజ్ఞానం ప్రాథమిక స్థాయిలో ప్రవేశపెట్టడంలో వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. విద్యార్థులకనుగుణంగా ఉపాధ్యాయుల నిష్పత్తి లేకపోవడం, నాణ్యమైన విద్య అందించడంలో వెనుకబాటుతనం, సబ్జెక్ట్ బోధించే ఉపాధ్యాయులు విద్యార్థులకు సరిపడిన నిష్పత్తిలో లేకపోవడం, ప్రభుత్వ పథకాలు ఎన్ని ఉన్నా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి అవగాహన కల్పించడంలో డొల్లతనం, మధ్యలో బడిమానివేయడం నివారణలో వైఫల్యం ఇలా ఇత్యాధిక కారణాలతో ప్రభుత్వ విద్యారంగం అనుకున్న స్థాయిలో ఫలితాలు రాబట్టడం లేదు. దాదాపు 58,950 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 41 లక్షల మంది విద్యార్థుల సంఖ్య కేవలం రెండు మూడు సంవత్సరాల్లోనే 36 లక్షలకు పడిపోయిందంటే ప్రభుత్వ విద్యావ్యవస్థ ఏమేరకు నిద్రావస్థలో ఉందో ఇట్టే బోధపడుతుంది. దీనికితోడు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలికసదుపాయాల కొరత, సరిపడిన గదులు, బోధనా సామాగ్రి లేకపోవడం, పుస్తకాలు నూరుశాతం సమకూర్చకపోవడం, మారుతున్న సిలబస్‌కు అనుగుణంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వకపోవడం, బోధనలో మూస విధానం మారకపోవడం, విద్యార్థులకు అర్థమయ్యేలా సరళమైన విద్యాబోధన కొరవడడంతో చిన్నారులు చదువుపై నిరాసక్తత చూపుతున్నారు. పాలకుల హామీలు సంతోష పెడుతున్నా… ఆచరణలో మాత్రం డొల్లతనం కనబడుతోంది. దీనిని ఆసరా చేసుకుని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు క్షేత్రస్థాయిలో చిన్నారుల తల్లిదండ్రులకు దగ్గరై బడిఈడు పిల్లలను ఆకర్షిస్తున్నారు. దీంతో ప్రభుత్వ బడుల్లో చేర్పించేందుకు వెనుకాడుతున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా స్వార్థపర రాజకీయాలను జొప్పించి సెంట్రల్ సిలబస్ పరీక్ష నిర్వహణ విధానం మారడం పెద్ద తలనొప్పింగా మారింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు గందరగోళానికి లోనవుతున్నారు. జాతీయ విద్యావిధానం అమలులో భాగంగా 3, 4, 5 తరగతులను ఎక్కడో దూరాన ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపడానికి నిరాసక్తత చూపుతున్నారు. ఇంకనూ ఏకోపాధ్యాయ బడులు ఉన్నాయంటే ఆశ్చర్యపోక తప్పదు. దీనికి పూర్తి భిన్నంగా ప్రైవేట్ పాఠశాలలు అందుబాటులో ఉండడంతో వాటిలో చేర్పించేందుకే మొగ్గుచూపుతున్నారు. సమగ్రశిక్ష, సర్వశిక్షా అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, పీఎం పోషన్ (మధ్యాహ్న భోజనం) భేటీ బచావో… భేటీ పడావో వంటి పథకాలున్నా లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతూనే ఉన్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఫీజు దోపిడీ నిరోధించలేకపోవడం ప్రభుత్వాల లోపాలను ఎత్తిచూపుతున్నాయి. కేవలం మూస విద్యకు పరిమితం కాకుండా ఆచరణాత్మకమైన నైపుణ్య విద్యపై ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి. ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్య విద్యను దరికి చేర్చాలి. డిజిటల్ విద్యను ప్రోత్సహించడం ప్రభుత్వ విధిగా ఉండాలి. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రాముఖ్యతనిచ్చే విద్యావిధానం అవసరం. నేటి సమాజంలో విద్యారంగం వ్యాపారంగా మారింది. ఆ విధానం మారాలి.
నిద్రావస్థలో విద్యారంగం!
- Advertisement -


