కార్మికుల హక్కుల కోసం పోరాటం ముమ్మరం చేయాలి
– సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ పిలుపు
విశాలాంధ్ర- అనంతపురం : 9న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని,కార్మికుల హక్కుల కోసం పోరాటం ముమ్మరం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ పిలుపు నిచ్చారు. మంగళవారం స్థానిక నీలం రాజశేఖర్ రెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాఫర్ మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా కార్మిక, రైతు, ప్రజాసంఘాల పిలుపు మేరకు జులై 9న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. “కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను కాలరాస్తూ తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అమలుచేయకపోతే, మన రాష్ట్రంలోని టిడిపి, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మాత్రం తొందరపడి పని వేళలను 8 నుండి 10 గంటలకు పెంచిన తీర్మానం దుర్మార్గం అని పేర్కొన్నారు. ఇది కార్మికులపై వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.“విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై అధికారంలోకి రాకముందు టీడీపీ మోసం చేసిన మాటలన్నీ బలహీనతగా మారాయి అన్నారు. ఇప్పుడు అదే పార్టీ దొడ్డిదారిలో ప్రైవేటీకరణకు తోడ్పడుతోంది” అన్నారు. కనీస వేతనం రూ. 26 వేలు గా నిర్ణయించాలని, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ విధానాలను రద్దు చేసి కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా నియమించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో 8వ, రాష్ట్రంలో 12వ పీఆర్సీ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలి అన్నారు.రైతుల పండ్లకు గిట్టుబాటు ధరలు, నల్ల చట్టాల రద్దు, నిత్యావసర ధరల తగ్గింపు, ఖాళీ ఉద్యోగాల భర్తీ తదితర డిమాండ్లను ప్రస్తావిస్తూ, సమ్మెకు కార్మికులు, యువత, రైతులు, ప్రజలు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సహాయ కార్యదర్శి పి.నారాయణస్వామి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కేశవ రెడ్డి, ఏ.ఐ.వై.ఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి జి సంతోష్ కుమార్ పాల్గొన్నారు.


