. కోట్లమంది మరణించినా… కార్డులు యథాతథం
. కార్డుల జారీ, రద్దులో తీవ్ర అలసత్వం
. ప్రభుత్వ పథకాలపై ప్రభావం
న్యూదిల్లీ : దేశంలో ఏ పథకం పొందాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి.బ్యాంకులో ఖతా తెరవాలన్నా, విద్యార్థులు ప్రవేశాలు పొందాలన్నా, పింఛన్లు, ఉద్యోగ నియామకాలు, రేషన్ కార్డులు, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, రైతు భరోసా వంటి వాటి అన్నింటికి ఆధార్ కార్డు ఉండాల్సిందే. అలాంటిది అధార్ కార్డుల జారీ, రద్దులో అలసత్వం కనిపిస్తున్నది. 2009లో ‘ఆధార్’ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి దేశంలో 142.39 కోట్ల ఆధార్ కార్డులు జారీ అయ్యాయి. మృతుల ఆధార్ నంబర్లు డీయాక్టివేట్ కాకపోవడంతో దేశ ప్రజల్లో ఒకింత ఆందోళన చెలరేగుతోంది. ప్రతి పదేళ్లకు ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆధార్ కార్డుల జారీ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 1.15 కోట్ల కార్డు నంబర్లు మాత్రమే రద్దు చేసినట్లు ‘ఉడాయ్’ డేటా ద్వారా తెలుస్తోంది. 16 ఏళ్లలో కోట్ల మంది చనిపోయినా నిలిపివేసిన కార్డుల సంఖ్య మాత్రం తక్కువగా ఉన్నట్లు సమాచార హక్కు చట్టం కింద దాఖలు చేసిన దరఖాస్తు ద్వారా వెల్లడైంది. 2025 జూన్ నాటికి దేశంలో ఆధార్ కార్డు కలిగివున్న వారి సంఖ్య 142.39 కోట్లుగా ఉంది. ఐక్యరాజ్య సమితి (ఐరాస) జనాభా నిధి ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌కి దేశ జనాభా 146.39 కోట్లు. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఎస్ఆర్) డేటా ప్రకారం 2007-2019 వరకు ఏటా సగటున 83.5 లక్షల మంది మరణించారు. అయితే ఉడాయ్ మాత్రం మరణించినవారిలో 10 శాతం మంది ఆధార్ కార్డులనే డీయాక్టివేట్ చేసింది. మరణించిన వారి ఆధార్ డీయాక్టివేట్ ప్రక్రియ కష్టమని ఆర్టీఐకి ఇచ్చిన సమాధానంలో ఉడాయ్ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే మరణ ధ్రువీకరణ పత్రాలు, మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చే సమాచారం ఆధారంగా ఈ ప్రక్రియ జరుగుతుందని తెలిపింది. మరణాల ఆధారంగా ఆధార్ నంబర్ల రద్దుకు సంబంధించిన తమ వద్ద ప్రత్యేక డేటా లేదని వెల్లడిరచింది. కాగా, మరణించిన వారి ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేయకపోవడం, అవి యాక్టివ్‌గా ఉండటంతో వాటి దుర్వినియోగానికి అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, ఈ ఐడీ లింక్ ఉన్న ఇతర సేవలపైనా ప్రభావం ఉంటుందన్నారు. నకిలీలను నివారించేందుకు మరణాల ధ్రువీకరణ, ఆధార్ డేటా బేస్ నిర్వహణలో సమన్వయం ఉండాలని సూచించారు.


