Homeఅమరావతి 2.0కు బ్రేక్‌?

అమరావతి 2.0కు బ్రేక్‌?

- Advertisement -

.డిప్యూటీ సీఎం పవన్‌ అభ్యంతరం!
. కరేడు సహా అనేకచోట్ల రైతుల తిరుగుబాటు
. చంద్రబాబు సర్కారుకు తలనొప్పులు
. భూసేకరణ, సమీకరణకు విరామం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో భూ కేటాయింపుల అంశం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. పారిశ్రామికాభివృద్ధి, ప్రభుత్వం అవసరాల కోసం భూములు అవసరమే అయినప్పటికీ గత అనుభవాలతో చాలా చోట్ల భూములు ఇచ్చేందుకు రైతులు సుముఖత చూపడం లేదు. అమరావతి భూసమీకరణ2.0తోపాటు వివిధ ప్రాంతాల్లోని ప్రాజెక్టులకు అవసరమైన భూములు ఇవ్వడంపై రైతుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్ర సమగ్రాభివృద్ధి నినాదంతో అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. దీంతో పెద్దఎత్తున భూసేకరణ, భూ సమీకరణపై ప్రభుత్వం దృష్టిపెట్టగా…కొన్ని చోట్ల రైతులు అనుకూలంగాను, మరికొన్ని ప్రాంతాల్లోను వ్యతిరేకత చూపుతున్నారు. ఈ పరిణామాలతో చంద్రబాబు ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు సమాచారం. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భూసేకరణ, భూసమీకరణ అంశాలు ప్రభుత్వానికి సానుకూలంగా లేవు. నెల్లూరుజిల్లా కరేడు గ్రామంలో ఇండోసోల్‌ సోలార్‌ కంపెనీకి 8,500 ఎకరాల్లో పచ్చటి పొలాలను ధారాదత్తం చేసే నిర్ణయంపై ఆ ప్రాంత రైతులు తిరగబడుతున్నారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంతోపాటు నెల్లూరుజిల్లా దగదర్తి ప్రాంతాల్లో విమానాశ్రయాలకు భూసమీకరణ పెద్ద సమస్యగా మారిందన్న వాదనలున్నాయి. ఉత్తరాంధ్రలోని కొత్తవలస ప్రాంతంలో జిందాల్‌ కంపెనీ కోసం భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజధాని అమరావతిలో మొదటి విడత భూసమీకరణకు రైతులు స్వచ్ఛందంగా సహకరించగా… ల్యాండ్‌ పూలింగ్‌2.0పై ఆ ప్రాంత రైతులు అంతగా ఆసక్తి చూపడంలేదని తెలిసింది. అమరావతి 2.0 ల్యాండ్‌ పూలింగ్‌ కింద భూసమీకరణకు నిర్వహించిన గ్రామ సభల్లోను మిశ్రమ స్పందన లభించింది. 50శాతం వరకు రైతులు అనుకూలంగాను, మిగిలిన 50 శాతం రైతులు భూసమీకరణకు వ్యతిరేకత చూపినట్లు సమాచారం. దీనికి ప్రధాన కారణం…ఇప్పటికే భూములిచ్చిన రైతుల పాట్లను అభివృద్ధి చేయకపోవడమే. గత వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలు, మూడు రాజధానుల ప్రకటన, రైతుల నుంచి తీసుకున్న భూములను అభివృద్ధి చేయకపోవడం వారిని వెంటాడుతున్నాయి.
పవన్‌ కల్యాణ్‌ జోక్యంతోనే వెనుకడుగు
రెండో విడత భూసమీకరణలో భాగంగా ల్యాండ్‌ పూలింగ్‌ యాక్టు కింద రాజధానికి 44వేల ఎకరాలు అదనంగా కేటాయించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి మండలిలో మొదటగా ప్రభుత్వం 22వేల ఎకరాల భూసేకరణకు ఆమోదం తెలిపినా… ఆ తర్వాత జరిగిన మంత్రి మండలిలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నాదెండ్ల మనోహర్‌ అభ్యంతరం తెలిపిన నేపథ్యంలో ప్రభుత్వం తాత్కాలికంగా వెనుకడుగు వేసినట్లు ప్రచారముంది. ఇప్పటివరకు ఈ అంశంపై ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. 2014లో చంద్రబాబు ప్రభుత్వ హయంలో రాజధాని కోసం ల్యాండ్‌ ఫూలింగ్‌ ద్వారా భూసమీకరణ కింద సుమారు 55వేల ఎకరాలు సమీకరించగా, వాటిలో అభివృద్ధి పనులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో రెండో విడత భూసమీకరణకు వెళ్లడానికి ముందు రైతుల సందేహాల్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి.
రైతుల్ని ఆలోచింపజేసిన కరేడు
ప్రకాశంజిల్లా ఉలవపాడు మండలం కరేడులో ఇండోసోల్‌ సోలార్‌ కంపెనీకి సుమారు 8,500ఎకరాల పచ్చటి పొలాలను కేటాయించడంపై రైతులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఉద్యమానికి దారితీసింది. సారవంతమైన భూములను ఇచ్చేందుకు తాము సిద్ధంగా లేమని, నిరుపయోగ భూములయితే ఇవ్వొచ్చని రైతులు తేల్చిచెబుతున్నారు. కొత్తవలస ప్రాంతంలో జిందాల్‌ కంపెనీ కోసం భూములిచ్చిన రైతులు సైతం తమకు నిబంధనల ప్రకారం రావాల్సిన పథకాలు, ఉద్యోగాలు, ఆర్థిక సాయం అందలేదని నిరసన చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బలవంతపు భూసేకరణ, భూసమీకరణలపై వామపక్ష పార్టీలు, రైతు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. రైతు సంఘాలు సైతం ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి.
అమరావతిలో మొదటి విడత భూసమీకరణ కింద ఉన్న భూముల్లో పూర్తిస్థాయి అభివృద్ధి చేపట్టకముందే రెండో విడత చేపట్టడం సరికాదని తేల్చిచెబుతున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవాలంటే రైతులతో మళ్లీ సమగ్రంగా చర్చించి… వారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు