Homeఓట్లు దోచేస్తున్నారు

ఓట్లు దోచేస్తున్నారు

- Advertisement -

బీహార్‌లో తక్షణం ఎస్‌ఐఆర్‌ నిలిపివేయాలి

. పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యుల డిమాండ్‌
. ‘ఇండియా’ ఎంపీల నినాదాల హోరు
. ఉభయ సభల్లోనూ ప్లకార్డులతో నిరసనలు

న్యూదిల్లీ : బీహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) సవరణ అంశం పార్లమెంటును కుదిపేసింది. ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఎంపీ అఖిలేశ్‌ యాదవ్‌ సహా ప్రతిపక్ష ఎంపీలు మంగళవారం పార్లమెంట్‌ హౌస్‌ కాంప్లెక్స్‌లో నిరసన తెలిపారు. పార్లమెంట్‌లోని మకర్‌ ద్వార్‌ మెట్ల వద్ద ప్రతిపక్ష ఎంపీలు బీహార్‌లో ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇది ఓట్లను దొంగిలించడమేనని విమర్శించారు. వారు ‘ఎస్‌ఐఆర్‌ : స్టీలింగ్‌ ఇండియన్‌ రైట్స్‌’ మరియు ‘ఎస్‌ఐఆర్‌ సవర్టింగ్‌ ఇండియన్‌ రిపబ్లిక్‌’ వంటి ప్లకార్డులను ప్రదర్శించారు. కాంగ్రెస్‌, ఎస్పీ, ఆర్జేడీ, టీఎంసీ, డీఎంకే, జేఎంఎం సహా అనేక పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా నిరసనలో పాల్గొన్నారు.
నిరసనల నడుమ ఉభయసభలు వాయిదా
పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు వరుసగా రెండో రోజు మంగళవారం కూడా ఎలాంటి చర్చలు జరగకుండా వాయిదాపడ్డాయి. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీహార్‌లో కేంద్ర ఎన్నికల సంఘం ఎస్‌ఐఆర్‌ పేరుతో ఓటర్ల జాబితాను సవరించడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టాయి. లోక్‌సభలో,రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలు ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ ప్రక్రియను తక్షణం నిలిపివేయడంతోపాటు దీనిపై చర్చించాలని డిమాండ్‌ చేశారు. లోక్‌సభలో స్పీకర్‌, రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్‌ చర్చలకు అవకాశం కల్పించేందుకు ప్రయత్నించినప్పటికీ సభ్యులు వినిపించుకోలేదు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేయడంతో సభలు గందరగోళంగా మారాయి. ఈ కారణంగా ఉభయసభలు మొదట మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. రెండుసార్లు వాయిదా పడిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనప్పుడు ప్రతిపక్ష సభ్యులు లోక్‌సభ వెల్‌లోకి దూసుకెళ్లారు.
అధ్యక్ష స్థానంలో ఉన్న దిలీప్‌ సైకియా, ప్రతిపక్ష ఎంపీలను తమ స్థానాలకు తిరిగి వెళ్లి సభా కార్యకలాపాలకు సహకరించాలని పదేపదే అభ్యర్థనలు చేశారు. నిరసనలు కొనసాగుతుండగానే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్‌ రిజిజు లేచి ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తనను తప్పుబట్టారు. సోమవారం జరిగిన బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ సమావేశంలో మొదట ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చించేందుకు అంగీ అంగీకరించామని, దానికి సమయం కూడా నిర్ణయించామని తెలిపారు. కానీ వారు ప్లకార్డులు పట్టుకుని ఇక్కడికి వచ్చి నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. దీనిని ఖండిస్తున్నానని రిజిజు అన్నారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉన్నా కూడా వారు సభ జరగకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. ‘‘ఈ ద్వంద్వ ప్రమాణాలు తప్పు… ఒక వైపు వారు చర్చ కోసం అడుగుతారు. తరువాత ఇలాంటి గందరగోళాన్ని సృష్టిస్తారు’’ అని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ సహా ఇతర ప్రతిపక్ష పార్టీల ప్రవర్తనను ఆయన ఖండిరచారు.
అంతకుముందు, మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు, సభకు అధ్యక్షత వహించిన జగదాంబికా పాల్‌ మాట్లాడుతూ… ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్‌ లీడర్లు తమ సభ్యులను నియంత్రించాలని కోరారు. ‘‘స్పీకర్‌ నిబంధనల ప్రకారం అనుమతించే ఏ అంశంపైనైనా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు మీ సీట్లకు తిరిగి వెళ్లాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఫ్‌ువాల్‌ అన్నారు. గందరగోళం కొనసాగడంతో, పాల్‌ మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యకలాపాలను వాయిదా వేశారు. అనంతరం సభలు మళ్లీ ప్రారంభమైనప్పటికీ అదే పరిస్థితి కొనసాగింది. చివరికి ఉభయసభలను బుధవారానికి వాయిదా వేశారు.
రాజ్యసభలో…
ప్రతిపక్ష పార్టీల ఆందోళనల మధ్య రాజ్యసభ కార్యకలాపాలు మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడ్డాయి. రాజ్యసభ చైర్మన్‌, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌ సోమవారం రాత్రి ఆకస్మికంగా రాజీనామా చేయడంపై ప్రతిపక్ష సభ్యుల ఆందోళనల మధ్య ఎగువ సభ ఉదయం కార్యకలాపాలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. తరువాత కూడా నిరసనలు కొనసాగడంతో మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా వేశారు. డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ సమావేశాలకు అధ్యక్షత వహించారు. ధన్కర్‌ రాజీనామా, బీహార్‌లో ఎస్‌ఐఆర్‌పై చర్చ చేపట్టడానికి ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా నోటీసులను హరివంశ్‌ తిరస్కరించారు. దీంతో సభ్యులు సభలోనే ఆందోళన చేపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు