విశాలాంధ్ర ధర్మవరం:: పాత్రికేయుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే విధంగా తమకు న్యాయం చేయాలని కోరుతూ ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు జానపాటి మోహన్ ప్రధాన కార్యదర్శి అజయ్ నాయుడు కమిటీ సభ్యులు కలిసి ఆర్డిఓ మహేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ నిర్మాణానికి స్థలము కేటాయించాలని, జర్నలిస్టులకు ఇంటి స్థలాల మంజూరు కోసం చొరవ వెంటనే చూపాలని, గతంలో జర్నలిస్టులపై బనాయించిన అక్రమ కేసులను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల రక్షణ కోసం జిల్లా స్థాయిలో జర్నలిస్టులపై దాడుల నిర్వహణ కమిటీని ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎటువంటి జాప్యము లేకుండా వర్కింగ్ జర్నలిస్టు అందరికీ సత్వరమే నూతన అక్రిడేషన్ కార్డులు అందే విధంగా తగిన చర్యలు గైకొనాలని తెలిపారు. జర్నలిస్టులకు పెన్షన్ విధానము అమలు చేయాలని, ఇప్పటికే పలు రాష్ట్రాలలో పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నారని వారు గుర్తు చేశారు. జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం ఆరోగ్య బీమా కార్డులు అన్ని కార్పొరేట్ ఆసుపత్రిలో పటిష్టంగా అమలు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. అదేవిధంగా రైల్వే ప్రయాణం నందు 50 శాతం రాయితీతో రైల్వే పాసులు జారీ చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాత్రికేయులు పాల్గొన్నారు.


