సీఎం చంద్రబాబుకు గోవిందరాజులు లేఖ
విశాలాంధ్రవిజయవాడ: గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధానకర్తలుగా వాలంటీర్ వ్యవస్థను తీసుకోని రావడం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సోమవారం పంపిన లేఖలో ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు వివరించారు ఈ వ్యవస్థలో భాగస్వాములైనందుకుగాను రెండు విడతలలో సుమారు 2 లక్షల 60 వేలమందిని వాలంటీర్లుగా నియమించారని తెలిపారు. ఇందుకుగాను ప్రభుత్వం నెలకు రూ 5వేలు 5 వేలు చొప్పున గౌరవ వేతనం కూడా చెల్లించిందన్నారు.ఈ నియామకాలు జరిగినప్పటి నుంచి ప్రతి ఒక్క వాలంటీరు కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో కూడా ప్రాణాలకు తెగించి ఎంతో అంకితభావంతో ప్రజలకు సేవలంచారని తెలిపారు. కేవలం ప్రజలకు సేవలందిచాలనే దృక్పధం తప్ప ఏ ఒక్క రాజకీయ పక్షానికో సేవలందిచాలని ఆలోచన ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో కొంతమంది స్థానిక రాజకీయ ఒత్తిడులకు తలొగ్గి ఎన్నికల సమయంలో రాజీనామాలు చేశారే తప్ప వేరే ఉద్దేశ్యాలేవని స్పష్టం చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు వాలంటీర్ వ్యవస్థను పటిష్టం చేస్తాము , వారికీ ఉద్యోగ భద్రతా కల్పిస్తాము ,అలాగే వారికి గౌరవ వేతనాన్ని రూ 10 వేల చేస్తామని హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల హామీలను మరచి వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై గత సంవత్సర కాలంగా వాలంటీర్లు అనేక పర్యాయములు వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరించమని ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ప్రభుత్వ పక్షం నుంచి ఎటువంటి స్పష్టత రాలేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 2 లక్షల 60వేల మంది నిష్ణాతుల్కెన వాలంటీర్లకు ప్రత్యమ్నాయం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


