Homeఆంధ్రప్రదేశ్త్యాగధనుల ఫలమే భారతావనికి స్వేచ్ఛా వాయువులు

త్యాగధనుల ఫలమే భారతావనికి స్వేచ్ఛా వాయువులు

- Advertisement -

*జిల్లా కలెక్టర్, కమిషనర్(F.A.C) పి.ప్రశాంతి*

*మునిసిపల్ కార్యాలయం నందు ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు*

*భారత ఆర్థిక వ్యవస్థ ప్రయాణం అద్భుతం: ఎమ్మెల్సీ సోమువీర్రాజు*

*స్వాతంత్ర్య ఫలాలు అందరికీ అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్*

*దేశ ప్రగతికి ప్రజలందరూ పునరంకితం కావాలి: ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ*

విశాలాంధ్ర – తూర్పుగోదావరి : 

దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహనీయులు చూపిన మార్గం నేటితరానికి అనుసరణీయమని జిల్లా కలెక్టర్, కమిషనర్(F.A.C) పి.ప్రశాంతి అన్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నగరపాలక సంస్థ కార్యాలయం నందు శుక్రవారం ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, రుడా ఛైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరితో పాటు కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొని మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. తొలుత కార్యాలయ ఆవరణలోని మహాత్మ గాంధీ, డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. నగర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటీష్ దాస్య శృంఖలాలను తెంచి, స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న ఈరోజు మనందరికీ పర్వదినమన్నారు. నాటి స్వాంతంత్ర్య సమరయోధులు కలలుగన్న నవభారత నిర్మాణమే వారికి మనం అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఇందుకోసం పౌరులుగా మన బాధ్యతలను మనం సక్రమంగా నిర్వర్తించవలసి ఉంటుందన్నారు. ముఖ్యంగా యువత మత్తుపదార్ధాలకు దూరంగా ఉండాలని.. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే మత్తు మనిషి జీవితాన్ని సర్వనాశనం చేస్తుందన్నారు. అలాగే మహిళల రక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని కలెక్టర్ అన్నారు. ఓవైపు మహిళలు, బాలికలపై హింసాత్మక ఘటనలు పెరుగుతున్న కాలంలో.. స్త్రీ ఆత్మగౌరవంతో జీవించగల వాతావరణాన్ని నగరంలో మనం కల్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మరోవైపు స్వచ్ఛ నగరాన్ని సాధించడంలో నగర ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని కలెక్టర్ అన్నారు. సుందర రాజమహేంద్రవరం నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.  

*ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ..* రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్ళతో పెకళించి వేసేందుకు ఆనాడు ఎందరో త్యాగమూర్తులు తమ ప్రాణాలను అర్పించారని గుర్తుచేశారు. ఈ 79 ఏళ్ల కాలంలో దేశం ఎంతో పురోగతి సాధించిందని.. ఇంకా సాధించాల్సింది చాలా ఉందని పేర్కొన్నారు. ఓ వైపు ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో.. మన దేశం ఆర్థిక ప్రగతి వైపు దూసుకుపోతోందని చెప్పుకొచ్చారు. ప్రపంచంలోనే ఓ బలమైన ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతూ.. భవిష్యత్తులో అగ్రరాజ్యాల ఆర్థిక వ్యవస్థలను తలదన్ని అగ్రగామిగా నిలబడుతుండటంలో ఎటువంటి సందేహం లేదన్నారు. 

*ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ..* ఈ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ సమగ్రత కోసం, భద్రత కోసం, ప్రగతి కోసం ప్రతిఒక్కరూ పునరంకితం కావాలని కోరారు. కొన్ని తరాల నిస్వార్థ త్యాగానికి నిదర్శనం మన స్వాతంత్ర్య పోరాటమని.. జాతీయ జెండాను ఎగురవేయడమంటే స్వేచ్చను అనుభవించడమేనని వ్యాఖ్యానించారు. జాతికే కేతనం ఇచ్చిన పింగళి వెంకయ్య మన తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణమన్నారు. ఎంద‌రో మ‌హానుభావులు మ‌న దేశానికి స్వాతంత్య్రాన్ని తీసుకువస్తే.. ప్రధాని నరేంద్ర మోదీ ఒక శక్తివంతమైన దేశంగా భారతదేశాన్ని మారుస్తూ, ఆ మ‌హనీయుల త్యాగాల‌కు స‌రైన నివాళి అర్పిస్తున్నార‌ని పేర్కొన్నారు. ఇటు రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిజ‌మైన స్వాతంత్య్ర ఫ‌లాలు పేద ప్రజ‌లందరికీ ద‌క్కేలా చూస్తున్నార‌ని చెప్పుకొచ్చారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం హామీని నేటి నుంచి రాష్ట్రంలో అమలుకు శ్రీకారం చుడుతున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. అలాగే స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వచ్ఛ రాజమహేంద్రం నిర్మాణంలో నగర ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 

*ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ..* “స్వరాజ్యమే నా జన్మహక్కు” అని ప్రకటించిన బాలగంగాధర తిలక్‌, లాలాలజపతిరాయ్‌, సుభాష్ చంద్రబోస్, బిపిన్‌చంద్రపాల్‌, గోపాలకృష్ణ గోఖలే వంటి మహనీయులు సామాన్య ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఉద్యమాన్ని నడిపించారన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ రాకతో స్వాతంత్య్రోద్యమంలో ఓ విప్లవాత్మకమైన మార్పు చోటు చేసుకుందన్నారు. ఆ త్యాగధనుల పోరాటాలు భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో పేజీలుగా మారాయన్నారు. వారి ఆశయాలు, ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్లడమే.. ఆ మహనీయులకు మనం అర్పించే నిజమైన నివాళి అని తెలియజేశారు. కార్యక్రమంలో నాయిబ్రాహ్మణ కార్పొరేషన్ డైరక్టర్ యానాపు యేసు, అడిషినల్ కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకట రమణ, సెక్రటరీ శైలజవల్లి, డిప్యూటీ డైరక్టర్ రామారావు, సిటీ ప్లానర్ జి.కోటయ్య, ఎస్ఈ ఎం.సీహెచ్ కోటేశ్వరరావు, మేనేజర్ అబ్దుల్ మాలిక్, రెవిన్యూ అధికారులు సీహెచ్ శ్రీనివాసరావు, రవికుమార్, ఎంహెచ్ఓ ఎ.వినూత్న, సీఎంఎం రామలక్ష్మి, అకౌంటెంట్ నాగమణి, ఆర్ఎంసి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు