రోడ్డు అనే చెరువుకు గండ్లు కొడుతున్న జనసైనికులు
రోడ్డు కోసం పాట్లు
విశాలాంధ్ర – తూర్పుగోదావరి :
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం మద్దూరు గ్రామం కు రోడ్డు కావాలని ఆ గ్రామస్తులు ఏకతాటిగా సంఘటితమై వందలాది సంతకాలు సేకరించి సోమవారం పీజిఆర్ఎస్ మీకోసం లో కొవ్వూరు ఆర్డీవో మరియు జిల్లా కలెక్టర్లకు ఆర్జీలు సమర్పించారు. అలాగే ప్రజా సమస్యల కోసం కలెక్టర్ వర్యులు ఇచ్చిన నెంబర్కు వాట్స్అప్ ద్వారా తమ రోడ్డు దుస్థితిని తెలియజేసుకున్నారు. ఇది ఇలా ఉండగా అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు గోదావరి గట్టునుండి గ్రామానికి వెళ్లే మూడు కిలోమీటర్ల రోడ్డు గుంతలలో నీరు నిలిచిపోయి చెరువును తలచేలా మారిపోయింది. గ్రామస్తులు మరియు స్కూలు పిల్లలు ఆ గుంతలలో పడుతున్న అవస్థలను చూసి ఉదయాన్నే ఆ గ్రామ జనసైనికులు కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తడుస్తూ పలుగు, పార , తట్ట , బుట్ట చేతబూని అక్కడక్కడ రోడ్ కు గండి కొట్టి నిలిచిపోయిన నీటిని సాధ్యమైనంతవరకు బయటకు పోయేలా కృషి చేశారు. జన సైనికులు చేసిన కృషిని గ్రామస్తులు అభినందించారు. ఇలా ఆ గ్రామంలో ప్రతి ఒక్కరు తమ రోడ్డు కోసం తపిస్తూ అన్ని రకాలుగా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కొందరు అధికారుల దగ్గరకు, కొందరు నేతల దగ్గరకు మరికొందరు వాట్సప్ ద్వారా ఆర్జీలు పెట్టుకుని వేడుకుంటుంటే ఆ ఊరి యువకులు, జనసైనికులు తాత్కాలిక చర్యలు చేపడుతున్నారు. మంచి రోడ్డు కోసం త్వరలో స్కూలు పిల్లలు సైతం మేము రోడ్డు వేస్తే కానీ స్కూలుకి వెళ్ళాము అని సమ్మెబాట పట్టనున్నారు. వీరందరి ప్రయత్నాలు చూస్తున్న మిగతా గ్రామస్తులు వీరిని అభినందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. రోడ్డు కోసం ఆ గ్రామస్తులు చేసే ప్రయత్నాలు ఒక శాంతియుత పోరాటానికి బాటగా మారనుంది.


