ఈనెల 20న రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం
ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ:జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయ పాత పరిపాలన భవనంలో రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ ను బుధవారం వర్చువల్ గా సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. మంగళవారం రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ ను ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏపీ సీఎం రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ ను అమరావతి నుంచి వర్చువల్ గా బుధవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభిస్తారన్నారు. అనంతపురం జేఎన్టీయూ అడ్మిన్ బిల్డింగ్ నుంచి ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆయా పరిశ్రమల యాజమాన్యాలు, పాల్గొనడం జరుగుతుందన్నారు. అనంతపురం జిల్లాలో ఆవిష్కరణ, స్టార్టప్‌లు, నైపుణ్య అభివృద్ధి, ఉపాధి సృష్టిని ప్రోత్సహించే లక్ష్యంతో, సిలికాన్ వ్యాలీ తరహా ఇకోసిస్టమ్‌ను సృష్టించడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లను రాష్ట్ర ముఖ్యమంత్రి ఏర్పాటు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి నగరాలతో పాటు అనంతపురం ఒక కీలక కేంద్రంగా ఎంపికైందన్నారు. ఈ సెంటర్ లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. సెంటర్ వద్ద నాటిన మొక్కలను సంరక్షించాలని హార్టికల్చర్ డిడికి సూచించారు. సెంటర్ లో ఇంటర్నెట్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, ఆర్డీఓ కేశవనాయుడు, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ప్రతాపరెడ్డి, హార్టికల్చర్ డిడి ఉమాదేవి, ఎన్ఐసి డిఐఓ రవిశంకర్, జిల్లా పరిశ్రమల శాఖ ఏడి రాజశేఖర్ రెడ్డి, నగర పాలక సంస్థ ఎస్ఈ చంద్రశేఖర్, ఆర్.అండ్.బి జెఈ బాల కాటమయ్య, ఎస్కే యూనివర్సిటీ అధికారి చంద్రమౌళి పాల్గొన్నారు.


