మేడిగడ్డ కూలడానికి ‘సుందిళ్ల, అన్నారం’ సాంకేతిక లోపాలే: సమీక్షలో మంత్రి ఉత్తమ్
విశాలాంధ్ర – హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగాలైన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్‌ల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర జలవనరుల సంఘంతో సమన్వయం చేసుకుంటూ శాస్త్రీయ పద్ధతుల్లో పునరుద్ధరణకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజాధనంతో నిర్మించిన ఈ బ్యారేజ్‌లను వినియోగంలోకి తెచ్చేందుకు నిర్ణయించినట్టు చెప్పారు. అంబేద్కర్ సచివాలయంలో బుధవారం ప్రాజెక్టుల పునరుద్ధరణ విషయమై నీటిపారుదల శాఖాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉత్తమ్ మాట్లాడుతూ మేడిగడ్డ కూలిపోవడానికి సుందిళ్ల, అన్నారం బ్యారేజ్‌లలో లీకేజ్‌లు, సాంకేతిక లోపాలే ప్రధాన కారణమని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, న్యాయ కమిషన్ స్పష్టంగా పేర్కొన్నాయని చెప్పారు. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ పై కుడా ఆరోపణల నేపథ్యంలో అర్హత కలిగిన స్వతంత్ర సాంకేతిక సంస్థలను నియమించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కేంద్ర జలవనరుల సంఘం సూచనలను పరిగణనలోకి తీసుకుని కొత్త డిజైన్లను రూపొందించాలని నిపుణులను అదేశించామన్నారు. పూణే లోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ద్వారా జియో ఫిజికల్,హైడ్రాలిక్ పరీక్షలు నిర్వహించి నష్టం విలువ అంచనా వేసి పనుల పునరుద్ధరణకు అంకురార్పణ చుట్టబోతున్నట్లు వివరించారు. పునరుద్ధరణ వ్యయం మొత్తం ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆయా సంస్థలే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. డిజైన్ లోపాలు, పనుల నిర్లక్ష్యం, ఆర్థిక అవకతవకలను జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలో స్పష్టం చేసిందని గుర్తుచేశారు. ఇదే విషయంలో విచారణ జరిపిన విజిలెన్స్… సంబంధిత అధికారులతో పాటు కాంట్రాక్టర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసిందన్నారు. సమ్మక్క-సారక్క, సీతమ్మ సాగర్, సీతారామ సాగర్, చనకా-కోరాట, దేవాదుల,చిన్న కాళేశ్వరం, ఎస్.ఎల్.బి.సి హెలిబోర్న్ సర్వే, డిరడిలతో పాటు జూరాల వద్ద నిర్మించ తల పెట్టిన ప్రత్యామ్నాయ బ్రిడ్జి సింగూర్ కాలువ లైనింగ్ పనులపై సమీక్షించారు. నీటిపారుదల శాఖా ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, సలహాదారు ఆడిత్యానాథ్ó్ దాస్,ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, సహాయ కార్యదర్శి కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


