- 152 మీటర్ల ఎత్తుకు కట్టుబడి ఉన్నాం
- తెలంగాణకు ఇది ప్రాణప్రదం
- బీజేపీ సభ్యులు కేంద్రాన్ని ఒప్పించాలి: భట్టి
విశాలాంధ్ర – హైదరాబాద్: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో నిర్మించడానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, అసలు ఈ ప్రాజెక్టును కడదామా… వద్దా… అనే దానిపై బీజేపీ సభ్యులు తమ స్పష్టమైన వైఖరిని చెప్పాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. శాసనసభలో ఎల్‌నినో ప్రభావం… ప్రభుత్వం ముందస్తు చర్యలపై జరుగుతున్న చర్చలో భాగంగా బీజేపీ సభ్యులు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు అంశం లేవనెత్తడంతో ఆయన జోక్యం చేసుకుంటూ… గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ప్రాంతానికి గ్రావిటీ ద్వారా నీళ్లందించాలనే ఆలోచనతో తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కనబెట్టి, కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు కట్టి లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేసిందని ఆరోపించారు. తెలంగాణకు ప్రాణప్రదమైన ఈ ప్రాజెక్ట్ విషయంలో అటు బీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాయని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్ల కోసం ఉమ్మడి రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు కోసం ఏడు మండలాలను ఆంధ్రాకు ఇవ్వడానికి వీల్లేదని సోనియా గాంధీ పట్టుబట్టారు… కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చి 2 లక్షల ఎకరాల ముంపు భూములతో కూడిన 7 మండలాలను ఏపీలో కలిపేస్తే బీఆర్ఎస్ నోరు మెదపలేదన్నారు. అక్కడ 2 లక్షల ఎకరాలు ఇచ్చేసినవారు… తుమ్మిడిహట్టి వద్ద కేవలం 2,000 ఎకరాల ముంపు సమస్యను ఎందుకు పరిష్కరించలేకపో యారు అని భట్టి ప్రశ్నించారు. ఒక్క రూపాయి పరిహారం ఎక్కువ ఇచ్చైనా సరే ముంపు భూ బాధితులను ఆదుకోవడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఆ జిల్లాకు ప్రాణహిత నీళ్లు వరప్రసాదమని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు తమ ప్రాభవాన్ని ఉపయోగించి కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర జలశక్తి శాఖను, పొరుగున ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అవసరమైన అనుమతులు తీసుకురావాలని కోరారు. సభ్యుడు హరీశ్‌రావు ఇచ్చిన సలహాను తాము సానుకూలంగా స్వీకరించి ప్రాజెక్ట్ కడతామని చెప్పామని, బీజేపీ సభ్యులు కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంతో మాట్లాడి అనుమతులు తెస్తామని అంటారని ఆశించామని చెప్పారు. అయితే మైక్ ఇవ్వగానే ప్రధాన విషయాన్ని వదిలేసి వేరే అంశాల్లోకి వెళ్లిపోయారని ఆక్షేపించారు. బీజేపీ సహకరించినా, సహకరించకపోయినా తమ ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించి తీరుతుందని భట్టి స్పష్టం చేశారు.


