ఏజెన్సీ ప్రాంత ప్రజలను చంద్రబాబు మోసం చేశారు.
రాష్ట్ర పౌర హక్కుల సంఘం ఉపాధ్యక్షులు నంబూరి.
విశాలాంధ్ర – కొవ్వూరు: నూతన జిల్లాల ఏర్పాటులో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పోలవరం ఏజెన్సీ ప్రాంత ప్రజలను మోసం చేసిందని రాష్ట్ర పౌర హక్కుల సంఘం ఉపాధ్యక్షులు నంబూరు శ్రీమన్నారాయణ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు చేసేటటువంటి జిల్లాకు పోలవరం పేరు పెట్టి పోలవరం నియోజకవర్గంలోని ఏజెన్సీ మండలాలను కలపకపోవడం విడ్డూరంగా ఉంది. ఇది చాలా విచిత్రం. రంపచోడవరం కేంద్రం గా ఏర్పడే నూతన జిల్లా పేరు పోలవరం. రంపచోడవరం ఒక్క నియోజకవర్గంలోనే పోలవరం జిల్లా కేంద్ర ఏర్పాటు చేయడం కూడా చాలా చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పోలవరం ప్రాంత మన్యం ప్రజలను కలపక పోవటంలో ఆంతర్యం ఏమిటో? ప్రభుత్వం ఆలోచన ఏమిటో? దీని వెనక కుట్ర ఏమిటో? ప్రజలకు పలు సందేహాలు ఏర్పడుతున్నాయి. గిరిజనేతర నాయకుల ఆధిపత్య శక్తుల ప్రభావం ప్రభుత్వం నిర్ణయం వెనుక ఉందని సందేహం కలుగుతుంది. పోలవరం నియోజకవర్గం లోని మన్యం మండలాలను రంపచోడవరం కేంద్రంగా ఏర్పడే జిల్లాలో కలపకపోవడం ఆన్యాయం. వారిని ఏలూరు జిల్లాలోనే ఉంచడం అన్యాయం. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి.ఇది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మతిలేని నిర్ణయం. పోలవరం నియోజకవర్గ మన్యం ఆదివాసి ప్రజల ఆశలు ఆకాంక్షలకు వ్యతిరేక నిర్ణయం. చంద్రబాబు కూటమి ప్రభుత్వం మతిలేని నిర్ణయాలతోటి మన్యం ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతారు. పోలవరం కేంద్రంగా మన్యం జిల్లాని ఏర్పాటు చేసిన పర్వాలేదు. రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు చేసిన పర్వాలేదు. కానీ మన్యం ప్రాంత ప్రజలందరూ ఒకే జిల్లా గొడుగు కిందకు తీసుకురావడం అనేది చాలా అవసరం ఉన్నది. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. పాలనాపరంగా గాని ప్రభుత్వపరంగా తీసుకునే నిర్ణయాల్లో ఆదివాసి ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు గాని మన్యం ప్రాంత ప్రజలందరూ ఒకే జిల్లా కేంద్రంలో ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది. వారి సమస్యలు అన్నీ కూడా ఆదివాసి సమస్యలే. ఆదివాసి చట్టాల ప్రకారం పరిష్కారం చేయాలి. కావున చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి పెట్టి రంపచోడవరం నియోజకవర్గం మరియు పోలవరం నియోజకవర్గంలోని మన్యం ప్రాంతం మండలాలను ఒకే జిల్లా కేంద్రంలో తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాము. మన్యం జిల్లా ఏర్పాటు చేయాలని పోలవరం నియోజకవర్గంలోని మన్యం మండల ప్రాంతం ప్రజల చిరకాల కోరిక. ఇది ప్రజాసామికమైనది మన్యం ప్రజల ప్రజాస్వామ్య డిమాండ్ ను ప్రభుత్వం తక్షణమే ఆమోదించి అమల్లోకి తీసుకురావాలని నంబూరు శ్రీమన్నారాయణ డిమాండ్ చేశారు.


