– జిల్లా అధ్యక్షుడు వర్మ
విశాలాంధ్ర – రాజమహేంద్రవరం : తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిపై జరుగుతున్న అనుచిత రాజకీయ ఒత్తిళ్లు ఆందోళనకరం అని జిల్లా అధ్యక్షుడు పి. గిరి ప్రసాద్ వర్మ అన్నారు. వర్మ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది పలు రాజకీయ ఒత్తిడులు, అనుచిత ప్రవర్తనల వలన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటువంటి పరిస్థితుల్లో నుంచి వైద్య ఆరోగ్య శాఖను తక్షణమే రక్షించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. బుధవారం సాయంత్రం రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో జరిగిన సంఘ జిల్లా కార్యవర్గ సమావేశానికి పి. గిరి ప్రసాద్ వర్మ అధ్యక్షత వహించారు. ఇటీవల పత్రికల్లో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, అధికారులపై వస్తున్న తప్పుదారి పట్టించే వార్తలకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆరోగ్య రంగంలో వేలాదిమంది రోగులకు, ఇన్‌పేషెంట్లకు రేయింబవళ్లు శ్రమించి సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బంది మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా అనవసరమైన విమర్శలు ప్రచురించడం దురదృష్టకరమని తెలిపారు. ఏదైనా సంఘటన చోటుచేసుకుంటే, వాస్తవాలు సేకరించి, సమగ్ర విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, వాస్తవాల నిర్ధారణ లేకుండానే ఆరోగ్య సిబ్బందిపై ఒత్తిడి పెంచే వ్యాఖ్యలు చేయడం, దాడులకు పాల్పడడం వంటి చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇటువంటి సంఘటనల్లో పాల్గొన్నవారిపై ప్రభుత్వం చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న ఖాళీలను తక్షణం భర్తీ చేయాలని తమ సంఘం సుదీర్ఘకాలంగా విజ్ఞప్తి చేస్తోందని గుర్తుచేశారు. త్వరలోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని తమ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కేఆర్ సూర్యనారాయణ గారి నేతృత్వంలో కలసి, జరుగుతున్న పరిణామాలను వివరించి, తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి అండగా నిలిస్తేనే ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖను రక్షించేందుకు అవసరమైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కే. వెంకటేశ్వరరావు, పి. రవికుమార్, కమల్ సుందర్, ఏ. శ్రీనివాస రావు జాయింట్ సెక్రటరీ దినేష్, గోపాలకృష్ణ, సచివాలయ ఉద్యోగుల సంఘం జిల్లా చైర్మన్ వి. రామదాసు, కన్వీనర్ సుధాకర్, మహిళా విభాగం నాయకులు జి. అనిత, ఎం. ఇందిరా, అంజలి శ్రీ, వాణి, మధులత, మాధవి తదితరులు పాల్గొన్నారు.


