పందులు బాబోయ్ పందులు.. పట్టపగలే పాఠశాలలో దూరుతున్న వైనం..
ఇలా ఉంటే పుష్కరాలు నిర్వహణ ఎలా..
విశాలాంధ్ర-కొవ్వూరు : పందుల బాబోయ్ పందులు.. కుక్కల స్వైర విహారం.. ఇటువంటి మాటలు జిల్లాలో చాలా పట్టణాల్లోనూ.. గ్రామాల్లోనూ తరచూ వినిపిస్తున్నాయి. అయితే రెవెన్యూ డివిజన్ కేంద్రమైన కొవ్వూరులో మాత్రం పందులు ఏకంగా పాఠశాలలకు దూరి బెంచీల కింద నివాసాలు ఏర్పరచుకుంటున్నాయి. కొవ్వూరులో చాలా కార్పొరేట్ పాఠశాలలు బహుళ అంతస్తులు భవనాల్లో నడుస్తుండగా పెద్ద సమస్య రావడం లేదు కానీ నేల మీద ఏర్పాటు అయినా పాఠశాలల యాజమాన్యం మాత్రం పందులు బెడద ఎదుర్కోవడం తప్పట్లేదు. అసలే కొవ్వూరు పట్టణంలో అంతంత మాత్రమే ఉన్న శానిటరీ విభాగం పర్మినెంట్ సానిటరీ ఇన్స్పెక్టర్ లేకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఆ వంతు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది. పగలు ఎలా ఉన్నా సెలవు రోజుల్లోనూ శని ఆదివారాల రోజుల్లోనూ పాఠశాల బెంచీలు కుర్చీలు ఖాళీగా ఉండడంతో పందులు తమ ఆవాసాలుగా మార్చుకుంటున్నాయి. ఇదే అలవాటును పాఠశాల పని చేసే రోజుల్లో కూడా కొనసాగిస్తే విద్యార్థులు వాటి గాయాల బారిన పడే అవకాశం ఉంది. దీంతో యాజమాన్యాలతో పాటు విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో వచ్చే పుష్కరాలను ఎలా నిర్వహిస్తారు అన్న ఆందోళన ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.


