విశాలాంధ్ర గుంతకల్లు.. మండలంలోని నరసాపురం గ్రామం సమీపంలో గుంతకల్–గుత్తి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది.స్థానికుల వివరాల ప్రకారం, నరసాపురం గ్రామానికి చెందిన కె. సావిత్రమ్మ (46) పొదుపు సంఘం లోన్ పనుల కోసం పాత కొత్త చెరువుకు వెళ్లేందుకు గ్రామంలోని మరో తొమ్మిది మంది మహిళలతో కలిసి బస్సు కోసం రోడ్డు పక్కన వేచి ఉంది. ఈ క్రమంలో లారీని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించిన గుంతకల్ నుంచి గుత్తి వైపు వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు అదుపు తప్పి, రోడ్డు పక్కన కూర్చున్న సావిత్రమ్మ తలపై నుంచి వెళ్లింది.ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.మృతురాలికి నలుగురు సంతానం ఉన్నారు. ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కుమారులు. కూతుర్లకు వివాహాలు కాగా, కుమారులకు ఇంకా వివాహం కాలేదు.భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంతకల్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, ఘటనపై దర్యాప్తు చేపట్టారు.


