Homeజిల్లాలుఅనంతపురంకోట్లు కురిపిస్తున్న కుళ్లాయిస్వామి ఆలయం

కోట్లు కురిపిస్తున్న కుళ్లాయిస్వామి ఆలయం

- Advertisement -

భక్తులకు మాత్రం కనీస సదుపాయాలే కరువు..!

ఉత్సవాల వేళ మరోసారి వెలుగులోకి దేవాదాయ శాఖ నిర్లక్ష్యం…

విశాలాంధ్ర – నార్పల: మండల పరిధిలోని గూగూడు గ్రామంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న శ్రీ కుళ్లాయిస్వామి ఉత్సవాల నేపథ్యంలో భక్తుల సౌకర్యాల కొరత మరోసారి చర్చనీయాంశంగా మారింది. హుండీ ఆదాయం, బంగారం, వెండి కానుకలు, వివిధ వేలాల ద్వారా ఏటా కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతున్నప్పటికీ, భక్తులకు అవసరమైన కనీస మౌలిక వసతులు కల్పించడంలో దేవాదాయ శాఖ విఫలమవుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు దర్శనార్థం తరలివచ్చే ఈ ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారి అత్యంత ఇరుకుగా ఉండటంతో ఉత్సవాల సమయంలో భక్తుల నడవడానికి కూడా సమస్యలు తలెత్తుతున్నాయి. గత ఏడాది ఉత్సవాల్లో గంటల తరబడి కుళ్లాయి స్వామి దర్శనం కోసం భక్తులు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఏటా ఇదే పరిస్థితి పునరావృతమవుతున్నప్పటికీ రహదారి విస్తరణపై ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
మహిళలు, వృద్ధులు, చిన్నారుల కోసం సరిపడా మరుగుదొడ్లు లేకపోవడం మరో ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా పవిత్ర స్నానాలు చేసిన అనంతరం మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు లేక తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వేలాదిమంది భక్తులు వచ్చే ఆలయంలో ఈ తరహా ప్రాథమిక సదుపాయాలు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భక్తుల బస కోసం తగిన వసతి గదులు లేకపోవడంతో కుటుంబాలతో వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీరు, విశ్రాంతి కేంద్రాలు, నీడనిచ్చే షెడ్లు కూడా సరిపడా లేకపోవడంతో ఎండవేడిమిలో, గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆలయ పరిసరాల్లో పలు ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగకపోవడం, పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోవడం కూడా భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఉత్సవాలకు పూర్తిస్థాయి ఏర్పాట్లు కనిపించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.”ఏటా కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఆలయంలో భక్తులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడం బాధాకరం. ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యాలకు నిధులు ఎక్కడ వినియోగిస్తున్నారో అధికారులు వెల్లడించాలి” అని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో అయినా దేవాదాయ శాఖ, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రహదారి విస్తరణ, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీటి సదుపాయం, మరుగుదొడ్లు, మహిళల కోసం ప్రత్యేక దుస్తుల మార్పిడి గదులు, వసతి, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. లేదంటే మరోసారి భక్తులు ఇబ్బందుల మధ్యే ఉత్సవాలను జరుపుకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు