విశాలాంధ్ర ధర్మవరం/పుట్టపర్తి : శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో కీర్తిశేషులు శ్రీ ప్రగడ కోటయ్య గారి 111వ జయంతి ఉత్సవాలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) శ్రీ కొండయ్య, ధర్మవరం రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) సువర్ణ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ప్రాజెక్ట్ డైరెక్టర్ నరసయ్య, సహాయ సంచాలకులు బి. రామకృష్ణ, జిల్లా ట్రెజరీ అధికారి నాగరాజు రావు, చేనేత శాఖ అధికారులు, చేనేత కార్మికులు, నేత కళాకారులు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అధికారులు కీర్తిశేషులు ప్రగడ కోటయ్య గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు అధికారులు మాట్లాడుతూ ప్రగడ కోటయ్య గారు భారత స్వాతంత్ర్య సమరంలో విశేష పాత్ర పోషించిన మహనీయులలో ఒకరని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన ప్రదర్శించిన త్యాగనిరతి, ధైర్యసాహసాలు, దేశభక్తి భావం నేటి తరానికి ఆదర్శప్రాయమని కొనియాడారు. స్వాతంత్ర్యం అనంతరం కూడా సమాజ శ్రేయస్సు, ప్రజా సంక్షేమం, సామాజిక సమానత్వం కోసం నిరంతరం కృషి చేశారని తెలిపారు.ముఖ్యంగా చేనేత రంగ అభివృద్ధికి, నేత కార్మికుల సంక్షేమానికి శ్రీ ప్రగడ కోటయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని వారు పేర్కొన్నారు. చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, వారి జీవనోపాధి మెరుగుపడేలా అనేక చర్యలు చేపట్టేందుకు కృషి చేశారని వివరించారు. గ్రామీణాభివృద్ధి, స్వయం ఉపాధి, స్వదేశీ వస్త్రాల ప్రోత్సాహం, సామాజిక న్యాయం వంటి అంశాల్లో ఆయన అందించిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.నిజాయితీ, సేవాభావం, అంకితభావం, క్రమశిక్షణ, దేశభక్తి వంటి విలువలను ఆచరణలో చూపిన మహనీయుడు ప్రగడ కోటయ్య అని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించి సమాజ సేవకు అంకితమవ్వాలని అధికారులు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా చేనేత రంగంలో విశిష్ట సేవలు అందించిన జాతీయ అవార్డు గ్రహీత ధర్మవరం డిజైనర్ నాగరాజును ఘనంగా సన్మానించారు. అలాగే చేనేత రంగ అభివృద్ధికి విశేష కృషి చేసిన చౌడప్ప, మార్కండేయ, అల్లాబక్ష్, శ్రీ దాసరి శ్రీనివాసులును శాలువా, జ్ఞాపికలతో సత్కరించి వారి సేవలను కొనియాడారు.కార్యక్రమంలో పాల్గొన్న చేనేత కార్మికులు, నేత కళాకారులు ప్రగడ కోటయ్య సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ చేనేత రంగ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, నేత కళాకారులు ,పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఘనంగా ప్రగడ కోటయ్య 111వ జయంతి ఉత్సవాలు
- Advertisement -
RELATED ARTICLES


