ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల (అన్నా లెజినోవా) మరోసారి తన సేవా దృక్పథంతో ప్రశంసలు అందుకుంటున్నారు.
ఇటీవల కాలంగా సోషల్ మీడియాలో చురుకుగా ఉంటున్న ఆమె, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై తనకున్న అభిమానాన్ని తరచూ పంచుకుంటూ అభిమానులకు మరింత చేరువ అవుతున్నారు.
రష్యాలో జన్మించినప్పటికీ భారతీయ ఆచారాలు, సంప్రదాయాలను గౌరవిస్తూ పూజలు, పండుగలు, కుటుంబ వేడుకల్లో సంప్రదాయ దుస్తుల్లో కనిపించే అన్నా కొణిదెలకు సోషల్ మీడియాలో ఇప్పటికే మంచి ఆదరణ ఉంది.తాజాగా ఆమె తీసుకున్న మరో నిర్ణయం నెటిజన్లతో పాటు జంతు ప్రేమికుల ప్రశంసలు అందుకుంటోంది.
ఒకటి ఆసియా ఏనుగు కాగా, మరొకటి రాయల్ బెంగాల్ పులి
తాజాగా హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో రెండు జంతువులను అన్నా కొణిదెల దత్తత తీసుకున్నారు.వాటిలో ఒకటి ఆసియా ఏనుగు కాగా, మరొకటి రాయల్ బెంగాల్ పులి. ఈ జంతువుల ఆహారం, వైద్య సంరక్షణతో పాటు ఇతర నిర్వహణ ఖర్చులను ఇకపై ఆమె భరించనున్నట్లు సమాచారం.ఈ దత్తతకు గుర్తుగా జూ పార్క్‌లో ఆయా జంతువుల వద్ద అన్నా కొణిదెల పేరు పేర్కొంటూ ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేశారు.ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.ఇంతకుముందు పవన్ కళ్యాణ్ కూడా విశాఖపట్నం జూలో జిరాఫీలను దత్తత తీసుకుని వన్యప్రాణుల సంరక్షణకు తన వంతు సహకారం అందించారు.
సోషల్ మీడియాలో ప్రశంసలు
ఇప్పుడు అదే స్ఫూర్తితో అన్నా కొణిదెల కూడా ముందుకు రావడం అభిమానులను ఆకట్టుకుంటోంది.అన్నా కొణిదెల నిర్ణయాన్ని జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసిస్తున్నారు.జంతు సంరక్షణకు వ్యక్తిగతంగా చేయూతనివ్వడం సమాజానికి మంచి సందేశమని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా వన్యప్రాణుల పరిరక్షణపై మరింత అవగాహన పెరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.సామాజిక బాధ్యతను మరోసారి చాటుతూ అన్నా కొణిదెల తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.


