జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, జిల్లా సమితి వినతులు
విశాలాంధ్ర అనంతపురం : వ్యవసాయ కూలీల వలస బాటను నివారించాలని,ఉపాధి హామీ చట్టాన్ని పారదర్శకంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కు సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ సహాయ కార్యదర్శి పి నారాయణస్వామి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బి కేశవరెడ్డి జిల్లా అధ్యక్షులు టి రంగయ్య, చేతివృత్తుదారుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సి లింగమయ్య లు శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో వ్యవసాయ పనులు లేనందున వ్యవసాయ కూలీలు,పేదలు వలస బాట పట్టారన్నారు. గ్రామాలకు గ్రామాలే ఖాళీ అయిందన్నారు. వ్యవసాయ కూలీలకు జీవించే హక్కును కల్పించేందుకు ఉద్దేశించిన ఉపాధి హామీ చట్టంను పారదర్శకంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరడం జరిగిందన్నారు. ఈ చట్టం సమర్థవంతంగా అమలు చేయడం కోసం రాజకీయ నాయకుల జ్యోక్యం పూర్తిగా నివారించాల్సిన అవసరము ఉందన్నారు.
రాయలసీమ జిల్లాలలో వర్షాలు సరిగా లేకపోవడంతో ఉన్న గ్రామాలలో పనులు దొరకకపోగా బ్రతకడం కోసం అప్పులు చేస్తూ జీవనం సాగిస్తు, ఈ అప్పులు తీర్చడానికి ఉన్న గ్రామాలలో పనులు లేవు. దీంతో జీవనం కోసం వివిధ రాష్ట్రాలలో కోస్తా జిల్లాలకు వలసలు పోతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ,వ్యవసాయ కూలీల జీవన పరిస్థితులలో మార్పు రావడం లేదన్నారు. ఈ విషయంపై సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, డ్వామా పీడీలకు మెమోరాండాలు సమర్పించాలని పిలుపునిచ్చిందన్నారు.
ఉపాధి హామీ కూలీలకు రోజు వేతనం 700/- రూపాయలు ఇవ్వాలని, జాబ్ కార్డుతో నిమిత్తం లేకుండా అడిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పనులు కల్పించాలి. ఉపాధి హామీలో చేసిన పనికి సకాలంలో వేతనాలు చెల్లించాలి.పెండింగ్ బకాయిలు చెల్లించాలన్నారు.రాయలసీమ ప్రాంతాలలో విద్యార్థులు చదువులు పూర్తిచేసుకుని ఉద్యోగ అవకాశాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.ఇలాంటి పరిస్థితులు ఏర్పడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకొని విద్యార్థులకు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు.
వ్యవసాయానికి సాగునీరు అందిస్తే ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉంటుందన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ కారణాలతో తీసివేసిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి కోవాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బందిపై కక్ష సాధింపులు, వేధింపులు నివారించాలన్నారు. వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి డి పెద్దయ్య, పెరుగు సంగప్ప, చిన్న రాయుడు, మల్లెల శ్రీనివాసులు, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి బి రమణయ్య తదితరులు పాల్గొన్నారు.