Homeహౌసింగ్ సొసైటీ ప్రమోటర్ల దందా

హౌసింగ్ సొసైటీ ప్రమోటర్ల దందా

- Advertisement -
  • రూ.15 కోట్ల దగాకు మార్గాలు
  • గజానికి రూ.900 వసూలుకు కుట్ర
  • ఏపీ రెరా ఉత్తర్వులు బేఖాతరు
  • తామే ప్రభుత్వం అంటూ విశ్రాంత ఉద్యోగుల నడ్డి విరుస్తున్న అక్రమార్కులు

‘ప్రభుత్వమే మా చేతుల్లో ఉంది. రెరా ఎన్ని సెక్షన్‌లు వల్లించినా మా గుప్పెట్‌లో నుంచి తప్పించుకోలేదు’ అనే దురహంకారపు ధీమాతో జీవితకాల కష్టార్జితాన్ని కోల్పోయి రోడ్డున పడ్డ వందలాది విశ్రాంత ఉద్యోగులను ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్రమోటర్లు మరోసారి నిలువునా దగా చేయడానికి సిద్ధమయ్యారు. ఎన్‌టీఆర్ జిల్లా కేతనకొండ ప్రాజెక్టులో జరిగిన వందల కోట్ల నిలువు దోపిడీని, ఫాం-5 మోసాలను, నిధుల మళ్లింపును రెరా స్వయంగా అథారిటీ రికార్డులతో సహా నిగ్గుతేల్చి, ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశించినా అక్రమా ర్కుల్లో ఏమాత్రం భయం కలగలేదు. ‘ఈసారి డబ్బులు దుర్వినియోగం కాకుండా మరో ఖాతా తెరిచాం’ అంటూ కొత్త డ్రామాకు తెరతీసిన ప్రమోటర్లు, ఈ నెల 3న చట్టవిరుద్ధంగా సమావేశం ఏర్పాటు చేసి సభ్యులపై గజానికి రూ.900 చొప్పున అదనపు భారాన్ని మోపుతు న్నారు. పత్రికలలో వరుసగా సంచలన కథనాలు వస్తున్నా, చట్టాలను, రెరా ఆదేశాలను తుంగలో తొక్కుతూ ‘మేమే ప్రభుత్వం… మేము చెప్పిందే శాసనం’ అన్నట్లు సాగుతున్న ఈ రాక్షస క్రీడపై వ్యవస్థలు ఇకనైనా స్పందించకపోతే, బాధితుల ఆగ్రహాగ్నిలో కరిగిపోక తప్పదు.

(విశాలాంధ్ర ప్రత్యేక ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ నియంత్రణ ప్రాధికార సంస్థ (ఏపీ రెరా) ముందున్న రికార్డులు, ఉత్తర్వులు ఒకలా ఉంటే… బయట సాగుతున్న దోపిడీ దందాలు మరోలా ఉంటున్నాయి. ఎన్‌టీఆర్ జిల్లా ‘శ్రీహరిపురం’ (కేతనకొండ) ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ప్రమోటర్లు చేసిన అడ్డగోలు అతిక్రమణలను, చట్టాన్ని ఏవిధంగా అపహాస్యం చేసిందో రెరా … 2026, జులై 17 నాటి ఉత్తర్వులలో (ఆర్డర్ నెం. ఎంఏయూ 70-రెరా/31/2026-అడ్మిన్) అత్యంత స్పష్టంగా ఎండగట్టింది. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం బాధితులను రక్షించాల్సిన వ్యవస్థల మౌనం అక్రమార్కులకు వరంగా మారుతోంది. రెరా చట్టం-2016 సెక్షన్ 3 నిబంధనలను తుంగలో తొక్కి, ఎలాంటి చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ గడువు లేకపోయినా ప్రమోటర్లు అక్రమాలకు పాల్పడ్డారని రెరా స్వయంగా నిర్ధారించింది. ప్రాజెక్ట్ గడువు 2023, జులై 10వ తేదీ నాటికే ముగిసినప్పటికీ, అభివృద్ధి పనులలో తీవ్రమైన వైఫల్యాలున్నాయని అథారిటీ స్పష్టం చేసింది. కేటాయింపుదారుల నుంచి సేకరించిన నిధులను దారి మళ్లించి, సెక్షన్ 4(2)(1) (డీ) ప్రకారం ప్రత్యేక ఎస్క్రో ఖాతా (ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే లావాదేవీల కోసం థర్డ్ పార్టీ నిర్వహించే తాత్కాలిక ఖాతా) నిర్వహించకుండా అక్రమాలకు పాల్పడ్డారని తేల్చింది. ఇంతటి తీవ్రమైన ఆర్థిక అవకతవకలు జరిగాయని, ఫాం-5లో నిధులు ‘ఏమీ లేవు’ అని తప్పుడు సమాచారం ఇచ్చారని రెరా తన ఉత్తర్వు ల్లో కళ్లకు కట్టినట్లు వివరించింది. అంతేకాకుండా, ప్రాజెక్టు వ్యవహారాలపై నిష్పక్షపాత విచారణ కోసం చార్టర్డ్ అకౌంటెంట్ ద్వారా ‘ఫోరెన్సిక్ ఆడిట్’ నిర్వహించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ప్రమోటర్లు ఎలాంటి మూడవ పక్ష హక్కులను సృష్టించరాదని, అదనపు వసూళ్లు చేయరాదని స్పష్టమైన ఆంక్షలు విధించింది. రెరా ఉత్తర్వులు ఇలా ఉంటే, మరోవైపు ప్రమోటర్లు మాత్రం సర్వహక్కులు తమకే ఉన్నట్లు కొత్త నాటకానికి తెరలేపారు. చట్ట ప్రకారం ప్రమోటర్ హోదాను కోల్పోయి నప్పటికీ, సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తూ సరికొత్త దోపిడీకి ప్రణాళిక రచించారు. సంక్షోభం నుంచి గట్టెక్కిస్తామంటూ గజానికి రూ.900 చొప్పున అదనపు వసూళ్లకు తెరలేపడం సభ్యులను నిలువునా మోసం చేయడమే అవుతోంది. అసలు ఇళ్ల స్థలాలు అప్పగించాల్సిన ప్రమోటర్లు, ఇప్పుడు మళ్లీ డబ్బుల పేరుతో బాధితుల నడ్డి విరుస్తుండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గజానికి రూ. 900 వసూలు చేసే సొమ్మును సొసైటీ ఖాతాలో కాకుండా, వేరే బ్యాంకు ఖాతాలో తెరిచి ప్రముఖుల అధ్వర్యంలో నిర్వహిస్తామంటూ కొత్త డ్రామా ఆడుతున్నారు. స్వచ్ఛ ఆంధ్ర మిషన్ మాజీ చైîÕర్మన్ డాక్టర్ సి.ఎల్. వెంకటరావు, ప్రముఖ అడ్వకేట్ సుంకర రాజేంద్ర ప్రసాద్ పేర్లను అడ్డుపెట్టుకుని ఈ వసూళ్ల దందాకు పాల్పడుతుండటం గమనార్హం. గౌరవనీయులైన వ్యక్తుల పేర్లను ముసుగుగా వాడి, సభ్యుల నుంచి బలవంతంగా కోట్లు వసూలు చేయడానికి వేస్తున్న ఈ కుట్ర వెనుక అసలు మతలబు ఏమిటి… రెరా చట్టం సెక్షన్ 11 ప్రకారం ప్రాజెక్ట్ వివరాలు, ఆర్థిక లెక్కలు, ఎస్క్రో ఖాతాల నిర్వహ ణలో ప్రమోటర్లు పూర్తిగా విఫలమ య్యారని అథారిటీ స్పష్టం చేసినా, వీరు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా మళ్లీ సమావేశాల పేరుతో సభ్యులను తప్పుదోవ పట్టిస్తున్నారు. కోర్టుల్లో వేసిన కేసులు అన్నీ ఉపసంహరించుకుంటేనే సమస్య పరిష్కారమవుతుందని హెచ్చరిస్తూ, బాధితుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించిన వారిని భయభ్రాంతులకు గురిచేయడం చట్ట విరుద్ధం కాదా… భూ యజమానులకు చెల్లించాల్సిన కోట్లాది రూపాయల బకాయిల కారణంగా సివిల్ కోర్టుల్లో ఓఎస్ 42/2022, 121/2022 వంటి దావాలు పెండింగ్‌లో ఉన్నాయని, అనేక ప్లాట్లు జప్తులో ఉన్నాయని రెరా తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. ఐకేఎఫ్ ఫైనాన్స్ వద్ద, సీఆర్‌డీఏ వద్ద ప్లాట్లు తాకట్టులో ఉన్నప్పటికీ, ఆ వాస్తవాలను దాచిపెట్టి మళ్లీ సభ్యులపై ఆర్థిక భారం మోపడం ఏ రకమైన న్యాయం… సొసైటీ చేసిన తప్పలకు అమాయక ఉద్యోగులు మూల్యం చెల్లించుకోవాలా… సి.ఎల్. వెంకటరావు, అడ్వకేట్ సుంకర రాజేంద్ర ప్రసాద్ ఈ ప్రాజెక్టుకు సలహాదారులుగా తెరపైకి వచ్చి రాజీ కుదిరిస్తామనడం వెనుక ఆంతర్యం ఏమిటి… రెరానే స్వయంగా ప్రమోటర్ల అవకతవకలను ఎత్తిచూపినా, ఈ పెద్దల ముసుగులో జరుగుతున్న తంతు చూస్తుంటే అక్రమార్కులకు పరోక్షంగా కొమ్ముకాస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. స్పష్టమైన ఆధారాలు కళ్లముందు కనిపిస్తున్నా, వ్యవస్థలు అండగా నిలవకపోవడం బాధితులను మరింత క్షోభకు గురిచేస్తోంది. సెక్షన్ 8 కింద ప్రాజెక్టును ప్రభుత్వ పర్యవేక్షణలోకి లేదా బాధితుల సంఘానికి అప్పగించాల్సిన రెరా కోర్టు ఆదేశాలను పక్కనబెట్టి, ప్రమోటర్లు ఇష్టానుసారంగా సమావేశాలు నిర్వహించడం చెల్లదు. ప్రభుత్వ అధికారులు, మంత్రుల పేర్లు చెప్పకుంటూ అమాయకుల నుంచి బలవంతంగా వసూలు చేసే ఈ సొమ్ము ఎట్టి పరిస్థితుల్లోనూ సురక్షితం కాదని బాధితులు వాపోతున్నారు. ఇన్నాళ్లు జీవితకాల పొదుపును కోల్పోయి రోడ్డున పడ్డ విశ్రాంత ఉద్యోగులను, ఇప్పుడు మళ్లీ అదనపు వసూళ్ల పేరుతో పీడించడం దారుణాతిదారుణం. సభ్యుల హక్కులను, ప్రయోజనాలను పరిరక్షించడానికి చట్టం ప్రకారం తమకు పూర్తి అథారిటీ ఉందని నిరూపిస్తూ రెరా సంస్థ 2026, సెప్టెంబరు 3న మరో కీలకమైన మధ్యంతర ఉత్తర్వు (ఫైల్ నెం.ఎంఏయూ 61-డీపీఓ వీఐజే (ఎల్‌ఏడీ)/ 3/2019) జారీ చేసింది.
తాకట్టు ప్లాట్లను విడుదల చేయొద్దంటూ సీఆర్‌డీఏకు రెరా ఆదేశం
చట్టంలోని సెక్షన్ 8, సెక్షన్ 36 అధికారాలను ఉపయోగించి, ప్రాజెక్టుకు సంబంధించిన తాకట్టు ప్లాట్లను (డీమార్ట్గేజ్) ప్రమోటర్ అసోసియేషన్‌కు గానీ, ఇతరులకు గానీ ఎలాంటి పరిస్థితుల్లోనూ విడుదల చేయరాదని ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌ను రెరా ఆదేశించింది. విచారణ పెండింగ్‌లో ఉండగా ప్లాట్లను అన్యాక్రాంతం చేయడాన్ని నిషేధించిన ఈ తాజా ఆర్డ్రే రెరా అధికారానికి నిదర్శనం. ఇలాంటి పకడ్బందీ చట్టపరమైన ఉత్తర్వులు, హెచ్చరికలు ఉన్నప్పటికీ… ప్రమోటర్లు మాత్రం ఏమాత్రం లెక్కచేయకుండా మళ్లీ 600 మంది సభ్యుల నుంచి లక్షా 60 వేల చదరపు గజాలకు… గజానికి రూ. 900 చొప్పున సుమారు రూ.15 కోట్లు వసూలు చేయడానికి తెగబడటం గమనార్హం. ఒకవైపు రెరా స్పష్టమైన ఆదేశాలు ఇస్తుంటే, మరోవైపు ప్రమోటర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండటం చూస్తుంటే… రెరా అధికారుల వైఖరిపై, వారి మౌనం వెనుక మతలబుపై సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
‘రెరా కూడా ప్రమోటర్‌తో కుమ్మక్కైందేమో’ అనే అనుమానాలు బాధితుల నుంచి బలంగా వ్యక్తమవుతున్నాయి. రెరా చట్టంలోని సెక్షన్ 18 ప్రకారం బాధితులకు నష్టపరిహారంతో కూడిన వడ్డీ చెల్లించాల్సిన బాధ్యత ప్రమోటర్లపై ఉంది. కానీ దానికి విరుద్ధంగా, బాధితుల నుంచే తిరిగి డబ్బులు వసూలు చేయాలనే కుట్ర జరుగుతుంటే రెరా అధికారులు ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు… ఫోరెన్సిక్ ఆడిట్ ఆదేశాలు అమలయ్యే లోపు, ఈ అక్రమ వసూళ్ల నాటకానికి తెరదించాల్సిన బాధ్యత అథారిటీపై లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని, ప్రమోటర్లు నిర్వహిస్తున్న ఈ అక్రమ సమావేశాలను, బలవంతపు వసూళ్లను నిలవరించాలని, రెరా ఉత్తర్వుల ప్రకారం ఫోరెన్సిక్ ఆడిట్‌ను వేగవంతం చేసి, నిధులు మళ్లించిన అక్రమార్కుల ఆస్తులను జప్తు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగుల సొసైటీ ముసుగులో జరుగుతున్న రూ. కోట్ల కుంభకోణానికి బాధ్యులైన అందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, చట్టాన్ని కాపాడాల్సిన రెరా సంస్థ, అక్రమార్కుల బెదిరింపులకు, కొత్త నాటకాలకు తలవంచకూడదని, రావాల్సిన ప్లాట్లను లేదా వడ్డీతో కూడిన నగదు ఇప్పించేలా కఠిన చర్యలు తీసుకోవాలని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి, దోపిడీదారుల ఆటకట్టించాలని బాధితులైన 1100 కుటుంబాలు కన్నీటితో వేడుకుంటున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు