Homeఆంధ్రప్రదేశ్కరవు రక్కసికి రాష్ట్రం కుదేలు

కరవు రక్కసికి రాష్ట్రం కుదేలు

- Advertisement -

రైతాంగాన్ని తక్షణమే ఆదుకోండి: రామకృష్ణ డిమాండ్
విశాలాంధ్ర – సచివాలయం: రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయ రంగం పూర్తిగా చిన్నాభిన్నమైందని, కరవు రక్కసికి కుదేలవుతున్న రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, పశుపోషకులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీపీఐ కార్యదర్శి కె.రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో సుమారు రూ.5.40 లక్షల కోట్ల మేర పంట నష్టం వాటిల్లిందని ఆయన వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను సీపీఐ ప్రతినిధి బృందం శుక్రవారం కలిసింది. రాష్ట్రంలో నెలకొన్న తీవ్రమైన కరవు పరిస్థితులపై వినతిపత్రం సమర్పించింది. ప్రతినిధి బృందంలో రామకృష్ణతో పాటు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, ముప్పాళ్ళ నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య ఉన్నారు. మంత్రితో భేటీ అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ సెప్టెంబర్ 12, 13, 14 తేదీల్లో తమ పార్టీ బృందం అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి… పంటల నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిందని తెలిపారు. రాష్ట్రంలో సాధారణంగా 476.1 మిమీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా… కేవలం 218.2 మిమీ మాత్రమే నమోదైందని, 54.2 శాతం లోటు ఏర్పడిందని వివరించారు.ఎకరాకు రూ.15,000 నుండి రూ.20,000 వరకు పెట్టుబడి పెట్టి విత్తిన పత్తి, కంది, వేరుశనగ, మొక్కజొన్న, చీనీ తోటలు నీరు లేక ఎండిపోతు న్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భూగర్భజలాలు అడుగంటి తాగునీరు లభించక, పశువులను పోషించలేక తక్కువ ధరలకే అమ్ముకునే దుస్థితి ఏర్పడిందని, క్షేత్రస్థాయి పరిస్థితులు ప్రభుత్వ అధికారిక గణాంకాల కంటే చాలా ఆందోళనకరంగా ఉన్నాయని రామకృష్ణ స్పష్టం చేశారు.రాష్ట్రంలోని 688 మండలాలకుగాను 665 మండలాల్లో కరవు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని రామకృష్ణ పేర్కొన్నారు. ఇలాంటి తీవ్ర సంక్షోభంలో ‘ఆరుతడి పంటలు వేసుకోండి’ అంటూ ఉచిత సలహాలు ఇవ్వడం వల్ల రైతులకు ఎటువంటి ప్రయోజనం ఉండదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం కేవలం సమీక్షలకే పరిమితం కాకుండా తక్షణమే కరవు ప్రభావిత మండలాలను శాస్త్రీయంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులు, కౌలు రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా పరిహారం వెంటనే అందజేయాలని, వర్షాభావ ప్రాంతాల్లో పంట రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని కోరారు. ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ.700 వేతనం చెల్లించాలని, కరవు ప్రాంతాల్లో విద్యార్థుల ఫీజులు పూర్తిగా మాఫీ చేసి… పశువులకు దాణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కరవు తీవ్రతపై కేంద్రానికి సమగ్ర నివేదిక పంపి అత్యవసర నిధులు రాబట్టాలని కోరారు.
సీఎం దృష్టికి తీసుకెళతా: అనగాని: సీపీఐ ప్రతినిధి బృందం వినతిపై రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సానుకూలంగా స్పందించారు. సీపీఐ బృందం ప్రస్తావించిన అంశాలను, రాయలసీమతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెంటనే తీసుకెళతానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం త్వరలోనే ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి… కరవు ప్రభావిత ప్రాంతాల్లో రైతులు, కౌలు రైతులు, పశుపోషకులను ఆదుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు