పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు రుణమాఫీ చేయాలి
విశాలాంధ్ర, ముదిగుబ్బ, శ్రీసత్యసాయి జిల్లా
మండలంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితుల దృష్ట్యా ముదిగుబ్బ మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీపీఐ నాయకులు తహసీల్దార్ ఉమామహేశ్వర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. సీపీఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు ఆధ్వర్యంలో నాయకులు తహసీల్దార్‌ను కలిసి తమ డిమాండ్లను వివరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది దీర్ఘకాలంగా వర్షాలు లేకపోవడంతో మండలంలో కరువు పరిస్థితులు తీవ్రంగా నెలకొన్నాయని తెలిపారు. వర్షాభావం కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే ఇన్పుట్ సబ్సిడీ అందించాలని, రైతులు బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని కోరారు. విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా కళాశాల ఫీజుల్లో రాయితీ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా హంద్రీ–నీవా కాలువ ద్వారా ముదిగుబ్బ మండలంలోని చెరువులన్నింటినీ సాగునీటితో నింపేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ మండల సహాయ కార్యదర్శి తిప్పయ్యతో పాటు నాయకులు రాధాకృష్ణ, ఆదెబ్బ, తుమ్మల చిన్నప్ప, చాంప్లానాయక్, చెన్నప్ప, వేలూరి వెంకటనాయుడు తదితరులు పాల్గొన్నారు.


