–సీఐ గంగాధర్
విశాలాంధ్ర -ఆస్పరి (కర్నూలు జిల్లా) : రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలు, పౌర హక్కులు, కర్తవ్యాలపై ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులకు అవగాహన కల్పించాలని సీఐ గంగాధర్ అన్నారు. సోమవారం విజేత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటంతో పాటు జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఐ గంగాధర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్కూల్ కరస్పాండెంట్ మల్లేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీఐ మాట్లాడుతూ, భారత రాజ్యాంగాన్ని 1950 జనవరి 26న అమల్లోకి తీసుకువచ్చారని తెలిపారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్పదని, ఇది ప్రతి పౌరునికి స్వేచ్ఛ, సమానత్వం, సమన్యాయం కల్పిస్తుందన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు, బాధ్యతలను విద్యార్థులు తప్పనిసరిగా తెలుసుకోవాలని, రాజ్యాంగ విలువలను ఆచరణలో పెట్టినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని సూచించారు. రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం 2024–25 విద్యా సంవత్సరంలో విజేత స్కూల్లో చదివిన విద్యార్థులు మండల స్థాయి టాపర్లుగా ఎంపికైన వారికి నగదు బహుమతులు అందజేశారు. స్వతంత్ర సమరయోధుల వేషధారణలో పాల్గొన్న చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ధనలక్ష్మి, ఇండియన్ గ్యాస్ ప్రోప్రైటర్ హరి, ఉపాధ్యాయులు బాలరాజు, శేషావలి, సోమశేఖర్, రమాదేవి, జాంసూర్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


