దిగ్గజ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ సహా ఆయన కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ )పెద్ద షాక్ ఇచ్చింది. అంబానీని, ఆర్‌కామ్‌ను ఫ్రాడ్‌గా వర్గీకరించింది. దీనిపై సీబీఐకి ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధమవుతోంది. అంబానీ సంస్థ.. ఎస్బీఐకి రూ. 2 వేల కోట్లకుపైగా బకాయి ఉంది. ఈ మేరకు సంబంధిత విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటులో వెల్లడించారు.
ఆర్‌కామ్, అనిల్ అంబానీని 2025, జూన్ 13న ఫ్రాడ్‌గా వర్గీకరించినట్లు ఎస్బీఐ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్ నిబంధనలు, బ్యాంక్ బోర్డు ఆమోదించిన విధానాల ప్రకారం ఇది జరిగిందని వెల్లడించింది. ఇక జూన్ 24న దీనిని ఆర్బీఐకి తెలిపింది. ఇక జులై 1నే ఆర్‌కామ్.. ఈ ఫ్రాడ్ వర్గీకరణ గురించి స్టాక్ ఎక్స్చేంజీకి తెలిపింది.
ఎస్‌బీఐ.. రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థకు రూ. 2,227.64 కోట్ల లోన్ ఇచ్చింది. దీనికి 2016, ఆగస్ట్ 26 నుంచి వడ్డీ, ఇతర ఖర్చులు అదనంగా ఉన్నాయి. దీనికి అదనంగా రూ. 786.52 కోట్ల బ్యాంక్ గ్యారెంటీ కూడా ఉందని మంత్రి తెలిపారు.
తెరపైకి పాత కేసు..
ఎస్‌బీఐ గతంలో 2020, నవంబర్ 10న కూడా ఆర్‌కామ్ సహా ప్రమోటర్ అనిల్ అంబానీని ఫ్రాడ్ గా వర్గీకరించి.. 2021, జనవరి 5న సీబీఐకి ఫిర్యాదు చేసింది. అయితే.. ఆ మరుసటి రోజే ఢిల్లీ హైకోర్టు స్టేటస్ కో (యథాస్థితి కొనసాగించమని) ఆదేశాలు ఇవ్వగా.. ఫిర్యాదును సీబీఐ వెనక్కి పంపింది. ఆ తర్వాత.. 2023, మార్చి 27న సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. దీని ప్రకారం.. అప్పు తీసుకున్న వారి ఖాతాను ఫ్రాడ్‌గా ప్రకటించే ముందు.. వారికి తమ వాదన వినిపించుకునే అవకాశం ఇవ్వాలి. ఈ తీర్పు ఆధారంగా, ఎస్‌బీఐ 2023, సెప్టెంబర్ 2న ఃఫ్రాడ్ః వర్గీకరణను తాత్కాలికంగా వెనక్కి తీసుకుంది.


