సీఐ రాజగోపాల్ నాయుడును వెంటనే సస్పెండ్ చేయాలి..
బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాకే వినయ్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం;;హిందూపురం 1 టౌన్ సీఐ రాజగోపాల్ నాయుడు దళిత అడ్వకేట్ శివరామకృష్ణపై దురుసుగా ప్రవర్తించి, బూటుకాలితో తన్నిన ఘటనకు సంబంధించిన వీడియో లో కనిపిస్తోందని బహుజన్ సమాజ్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు సాకే వినయ్ కుమార్ తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ధర్మవరం పట్టణంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సాకే వినయ్ కుమార్ మాట్లాడుతూ, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కలిగిన పోలీసు అధికారి ఒక దళిత అడ్వకేట్‌ను బూటుకాలితో తన్నడం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు కూడా ఉన్నాయని, వాటిని అధికారులు పరిశీలించి వాస్తవాలను నిర్ధారించాలని కోరారు.శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఎంతో నీతి, నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావడానికి కృషి చేస్తున్నప్పటికీ, ఇలాంటి అధికారుల చర్యల వల్ల మొత్తం పోలీసు శాఖకు చెడ్డ పేరు వస్తోందని సాకే వినయ్ కుమార్ అన్నారు.సీఐ రాజగోపాల్ నాయుడును వెంటనే విధుల నుంచి తప్పించి సస్పెండ్ చేయాలని, ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీ) చట్టం కింద కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఒక దళిత అడ్వకేట్‌ను పోలీసు అధికారి బహిరంగంగా బూటుకాలితో తన్నడం వంటి ఘటన చోటుచేసుకున్నప్పుడు దళిత ప్రజాప్రతినిధులు, దళిత సంఘాలు,ప్రజాస్వామ్యవాదులు స్పందించాలని కోరారు.బాధితుడికి న్యాయం జరిగే వరకు బహుజన్ సమాజ్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.ఈ విలేకరుల సమావేశంలో బహుజన్ సమాజ్ పార్టీ కార్యదర్శి నారాయణస్వామి, పార్టీ కార్యకర్తలు అంజి, తిరుపాలు, బహుజన నాయకులు సాకే కుళ్లాయప్ప, విద్యార్థి నాయకులు పోతలయ్య, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దళిత అడ్వకేట్‌పై దురుసు ప్రవర్తన
- Advertisement -
RELATED ARTICLES


