Homeజాతీయం40 ఏళ్ల బోఫోర్స్ కేసుకు ముగింపు.. చివరి పిటిషన్‌నూ కొట్టేసిన సుప్రీంకోర్టు

40 ఏళ్ల బోఫోర్స్ కేసుకు ముగింపు.. చివరి పిటిషన్‌నూ కొట్టేసిన సుప్రీంకోర్టు

- Advertisement -

దాదాపు నాలుగు దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా నిలిచిన బోఫోర్స్ కుంభకోణం కేసుకు తెరపడింది. దీని నుంచి హిందూజా సోదరులకు ఊరట కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు 2005లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన చివరి పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ కేసుకు సంబంధించిన న్యాయపరమైన ప్రక్రియ పూర్తిగా ముగిసింది.జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ వినోద్ కె. చంద్రన్‌తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. విచారణ వాయిదా వేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరినా, కోర్టు అంగీకరించలేదు. ఇప్పటికే చాలా కాలం గడిచిందని పేర్కొంటూ పిటిషన్‌ను తిరస్కరించింది.విచారణ సందర్భంగా ‘‘హిందూజా సోదరులు, సీబీఐ వ్యవహారం ఇంకా ఎందుకు కొనసాగుతోంది? అన్ని కేసులను హైకోర్టు కొట్టేసింది కదా. ఇంకా ఎంతకాలం ఈ వ్యవహారం కొనసాగుతుంది?్ణ్ణ అని జస్టిస్ పార్దీవాలా వ్యాఖ్యానించారు. దీనికి పిటిషనర్ తరఫు న్యాయవాది 1986లో ఈ ఒప్పందం జరిగిందని వివరించే ప్రయత్నం చేసినా, ధర్మాసనం మరిన్ని వాదనలు వినేందుకు నిరాకరించింది.2005 మే 31న ఢిల్లీ హైకోర్టు హిందూజా సోదరులు శ్రీచంద్, గోపీచంద్, ప్రకాశ్ హిందూజాలతో పాటు స్వీడన్‌కు చెందిన ఏబీ బోఫోర్స్ కంపెనీపై ఉన్న క్రిమినల్ కేసులను కొట్టివేసింది. అప్పట్లో దర్యాప్తు తీరుపై కూడా సీబీఐని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.ఆ తీర్పును సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన అప్పీల్‌ను కూడా సుప్రీంకోర్టు 2018లో తిరస్కరించింది. అప్పీల్ దాఖలులో 4,522 రోజుల ఆలస్యం జరిగిందని పేర్కొంటూ దానిని స్వీకరించలేదు.

1986లో భారత ప్రభుత్వం స్వీడన్‌కు చెందిన ఏబీ బోఫోర్స్ సంస్థతో రూ.1,437 కోట్ల విలువైన 400 హోవిట్జర్ గన్‌ల కొనుగోలు ఒప్పందం చేసుకుంది. 1987లో ఈ ఒప్పందంలో అక్రమ కమీషన్లు చెల్లించారనే ఆరోపణలు వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం చెలరేగింది. అనంతరం సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. తాజాగా సుప్రీంకోర్టు చివరి పిటిషన్‌ను కూడా కొట్టివేయడంతో బోఫోర్స్ కేసు చట్టపరంగా ముగిసినట్లైంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు